Police Raid on Illegal Sand Mining
అర్ధరాత్రి ఇసుక తవ్వకాలపై పోలీసుల దాడి
* టిప్పర్లు ట్రాక్టర్లు పరార్ జెసిబి స్వాధీనం కేసు నమోదు
చేవెళ్ల, నేటిధాత్రి :
షాబాద్ మండలం నాగర్‌గూడ ఈసీ వాగులో కొన్నాళ్ళుగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వాకాలపై పోలీసులు దాడి చేసి ఒక జెసిబిని స్వాధీనం చేసుకున్నారు. ఈసి వాగులో కొన్నాళ్ళుగా అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుఅదుపు లేకుండపోయింది. రాత్రి వేళలో ఇసుకను జెసిబితో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. మంగళవారం రాత్రి ఈసి వాగులో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న షాబాద్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఒక జేసిబిని పట్టుకున్నారు. పోలీసులు చేరుకునేలోపే కొన్ని ట్రాక్టర్లు, ఒక టిప్పర్ అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. అయితే జెసిబిని పోలీసులు పట్టుకుని షాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ జెసిబి పోతుగల్ గ్రామానికి చెందిన భానురెడ్డి, మునీర్‌కు చెందినదిగా స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వాహనాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా జరుగుతున్న ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కాంతరెడ్డి తెలిపారు.
* తాత్కాలిక చర్యలతో… ఆగని ఇసుక తవ్వకాలు
నాగరగూడ ఈసి వాగులో ప్రతి రోజు ఇసుక తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇసుక తవ్వకాలపై వార్తపత్రికల్లో అనేక వార్త కథనాలు ప్రచురితమైన సందర్భాలలో పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టి పిట్టింగ్ కేసులు పెట్టి స్టేషన్ లోనే వదిలేయటంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ఇసుక తవ్వాకాలకు పాల్పడుతున్నవారిపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
