రాజీనామా యోచనలో మంత్రి జగదీష్‌రెడ్డి…?
ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల మూలంగా విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ఆయన తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది. వీటన్నింటికి తాను నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని జగదీష్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కలగజేసుకుని నష్టనివారణ చర్యలు చేపడుతూ ఉచిత వెరిఫికేషన్ చేయాలంటూ అధికారులను ఆదేశించిన ఫలితాల్లో గందరగోళం విషయం రోజురోజుకు చిలికిచిలికి గాలివానగా మారుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఆందోళనకు దిగుతుండడం, రాష్ట్ర గవర్నర్ ఫలితాల విషయంలో ఆరా తీయడం, సున్నా మార్కులు రావడం ఏంటని అధికారులను ప్రశ్నించడంతో ఇది మరింత సీరియస్‌గా మారింది. వీటన్నింటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న జగదీష్‌రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ఫలితాల విషయంలో నెలకొన్న గందరగోళం మూలంగా నష్టనివారణ జరగాలంటే మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామా చేస్తే పరిస్థితి కొంతమేర చక్కబడుతుందని ప్రతిపక్షాలు, విద్యార్థుల ఆందోళనలను తగ్గించవచ్చని ప్రభుత్వం సైతం అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. జరిగిన లోపాలను సవరించుకుని విద్యార్థులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిస్తున్న పరిస్థితిని చక్కబెట్టాలని కోరుతున్న జగదీష్‌రెడ్డి మాత్రం రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం టిఆర్‌ఎస్ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారిందని తెలిసింది. మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామా చేస్తే ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టవచ్చని కొందరు గులాబీ నాయకులు అంటున్నారు. పరిస్థితి చక్కబడుతున్న వేళ రాజీనామా యోచన ఎందుకని కొందరు అంటున్నారు.