Headlines

ఎండల్లో ప్రచారం- ప్రాణాలతో చెలగాటం.

https://epaper.netidhatri.com/view/229/netidhathri-e-paper-6th-april-2024%09/3

బతికుంటే బలుసాకు తినొచ్చు.

కరువు కాలంలో అది కూడా దొరక్కపోవచ్చు.

కార్యకర్తల్లారా జాగ్రత్త.

ఏ నాయకుడు సాయానికి రాడు.

ఎన్నికలైపోతే ఏ నాయకుడు గుర్తుంచుకోడు.

జ్ఞాపకం చేసుకునే వారుండరు.

ఎగేసుకొని వెళ్లి ఎండల్లో తిరగొద్దు.

ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.

కుటుంబాలను ఆగం చేసుకోవద్దు.

బీరు, బిర్యానీలకు ఆశపడొద్దు.

మీ కుటుంబ సభ్యులను దిక్కులేనివారిని చేయొద్దు.

అసలే! ఎండా కాలం. సూరయ్య సుర్రుమంటున్నాడు. భగభగ మండిపోతున్నాడు. ఎప్రిల్‌ మొదటి వారంలోనే 40 డిగ్రీలు దాటి పరుగులు పెడుగుతున్నారు. ఏడు గంటలకే నిప్పులు కురిపిస్తూ వస్తున్నాడు. సాయంత్రం ఏడుగంటలైనా గూటికి చేరనంటున్నాడు. మధ్యాహ్నం మరీ మంటెక్కి వుంటున్నాడు. బైటకెళ్తిరి బిడ్డా మీ సంగతి చూస్తానని హెచ్చరిస్తున్నాడు. నీళ్లెన్ని తాగినా కడుపు చల్లగ కాకుండా గడగడలాడిస్తున్నాడు. ఎండల్లో ఎన్నికలు ఎందుకు పెట్టుకున్నట్లు, నాతోనే పరాచికాలా అన్నట్లు ఉరిమురిమి చంద్రనిప్పులు కక్కుతున్నాడు. వారం రోజుల క్రితం దాకా చల్లగా వున్న సూరీడు ఒక్కసారిగా వాతావణాన్ని బొగ్గుల కొలిమి చేశాడు. ఎండ ప్రచంఢ తాపాన్ని పెంచి బైటకు రండి అని సవాలు విసురుతున్నాడు. మరి ఇలాంటి వేళ ఎన్నికల ప్రచారం అంటే అభ్యర్థులే కాదు, నాయకులు, క్యాడర్‌ బాగా ఆలోచించుకోవాలి. రోడ్లమీద ర్యాలీలు, రోడ్‌షోలు, కార్నర్‌ సభలు, ఇంటింటి ప్రచారాలు పెట్టుకోవద్దు. ఉదయం వేళ కొద్ది సేపు, సాయంత్రం ఎంత సేపైనా ప్రచారం పర్వం కొనసాగించుకోవాలి. కాని ఉదయం పది తర్వాత నుంచి ప్రచారం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమే అవుతుంది. ఇంటింటి ప్రచారం చేయడం కొంత మేలే అయినా, రోడ్‌షోలు వంటివి ఎట్టిపరిస్దితుల్లోనూ పెట్టుకోకూడదు. సభలు, సమావేశాల నిర్వహణకు ప్రజలు విముఖత చూపాలి. ఎందుకంటే సభలు ఏర్పాటుచేసే నాయకులు ఎప్పుడూ చల్లగానే వుంటారు. కార్లలో వస్తారు. కాని జనాల తరలింపు కోసం వాడే వాహనాల వల్ల కూడా ప్రజల ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపొచ్చు. సహజంగా ఇలా ఎండా కాలంలో ఎన్నికలు రావడం చాలా అరుదు. వర్షాకాలంలో వచ్చినా ఇంత ఇబ్బంది వుండదు. కాని నడి ఎండా కాలంలో ఎన్నికలు అంటే రాజకీయ నాయకులకు కూడా ఇబ్బందే..కార్యకర్తలకు ప్రాణసంకటమే.
నాయకులు రమ్మన్నారు కదా! అని కార్యకర్తలు కూడా ఎగేసుకొని వెళ్లకండి. ఎందుకంటే నాయకులు అన్న తర్వాత అంతో ఇంతో సంపాదించిన వారే వుంటారు. ఆర్ధికంగా స్దిరపడిన వాళ్లే ఎక్కువగా వుంటారు. అంతో ఇంతో ఆస్ధులు పోగేసుకున్నవాళ్లుంటారు. వారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా తట్టుకోగలరు. వారికి ఏదైనా అయితే ఆ పై స్ధాయి నాయకులు చూసుకుంటారు. అవసరమైతే ఆదుకుంటారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కాని కార్యకర్తల పరిస్ధితి వేరు. రోజు తన కూలీ తాను చేసుకొని బతికే బతుకు కార్యకర్తది. జెండా మోయాల్సిన నాడు పార్టీ రూపాయి ఇవ్వకపోయినా, తన సంపాదన నుంచే ఖర్చు పెట్టుకొని, జెండా మోసే కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరుగుముఖం పట్టే వెట్టి చాకిరీ బతుకే. అందుకే ఎండా కాలంలో ఎన్నికల ప్రచారం. మీ గ్రామాల వరకు మాత్రమే ప్రచారంలో పాల్గొంటామని చెప్పండి. సభలు, సమావేశాలు, నాయకులు వస్తున్నారు..ర్యాలీలు తీస్తున్నారు. రోడ్‌షోల చేస్తున్నారంటే వెళ్లకండి. రామని తెగేసి చెప్పండి. ఎందుకంటే ఎన్ని ఎన్నికలైనా నాయకులకు కార్యకర్తలతోనే పని. నాయకులతో కార్యకర్తలకు ఎలాంటి వుండదు.

ఎన్నికలు అయిపోయాయంటే ఏ నాయకుడు కార్యకర్త గురించి ఆలోచించడు. కేవలం జెండా మోయడానికి, జేజేలు కొట్టడానికి తప్ప కార్యకర్తల సంక్షేమం ఏ పార్టీ తీసుకొదు. చెప్పడానికి చాలా చెబుతారు. మాటలతో మభ్య పెడతారు. ఏ కష్టం వచ్చినా నన్ను కలవమని మాయ మాటలు చెబుతారు. తీరా ఏదైనా అవసరం వస్తే ముఖం చాటేస్తారు. నాయకుల కంటే ముందే ఎగేసుకొని వెళ్లకండి. పార్టీ కోసం, ఎన్నికల్లో గెలుపుకోసం మీరు వెళ్లినా, బీరు , బిర్యాని కోసం వచ్చాడనే అపోహలో నాయకులు వుంటారు. కాకపోతే బైటకు చెప్పరు. చిరునవ్వుతో పలకరిస్తారు. పలువురి ముందు గొప్పగా చెబుతారు. అంతే దానికి కార్యకర్తలు పొంగిపోతారు. మా నాయకుడు భుజం చేయి , బాగున్నావా? అని అన్నాడనో..దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకున్నాడనో మురిసిపోకు..నీ జీవితం వారికి అంకితం చేయకు.
అసలే మంచి ఎండా కాలం. అందులో కరువు కాలం. ఈ ఎండల్లో తిరిగి తిరిగి వచ్చి వడదెబ్బతో మంచాన పడితే ఏ నాయకుడు వచ్చిన ఆదుకోడు. ఎలా వున్నాడని పరామర్శించేందుకు సమయం తీసుకోడు. ఏదైనా జరగరానిది జరిగితే వచ్చి రాజకీయం కోసం వాడుకుంటారే గాని, ఆ కుటుంబానికి ఎవరూ ఆదుకోరు. పది మందిలో గొప్పలు చెప్పి చేతులు దులుకుంటారు. కనీసం గుర్తుంచుకునే వీలు కూడా వుండదు. ఈ నెల రోజులు తిరిగి తిరిగి అనారోగ్యం పాలై మంచాన పడినా పలకరించేందుకు గెలిచిన వారికి తీరిక వుండదు. ఓడిపోయిన వారు ముఖం చాటేస్తారు. ఎవడెట్లా పోతే నాకేంటి అనుకునే వాళ్లే అంతా…అందువల్ల ఎన్నికల ప్రచారం అనగానే, నాయకుడు ఫోన్‌ చేశాడని మురిసిపోకు. నాకు మా నాయకుడు ఫోన్‌ చేసి రమ్మన్నాడని హడావుడి చేయకు. ఇప్పుడు నీ అవసరం మాత్రమే. అందుకే ఫోన్‌ చేస్తారు. అంతే కాదు ఏ నాయకుడైనా కార్యకర్తలకు మీకు సాయం అందిస్తాను రమ్మని ఏనాడు ఫోన్లు చేయరు.ఏదైనా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా ఎంతిస్తావమనే నాయకులు అడుగుతారు. కాని నా కోసం పనిచేశావని ఉచితంగా టిక్కెట్లు ఇవ్వరు. పైగా సభలకు, సమావేశాలకు తమ గుంపును చూపించుకునేందుకు మాత్రమే నాయకులు పిలుస్తారు. అప్పుడు ఇంత బీరు, బిర్యాని ఇస్తారు. అదే పదివేలని కార్యకర్తలు మురిసిపోతుంటారు. నాయకుడి వెంట పరుగులెత్తుతుంటారు. ఇంతటి ఎండల్లో తిరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.

నీకంటూ ఓ కుటుంబం వుంటుంది. నీ మీద ఆధారపడి తల్లిదండ్రులు, భార్యాపిల్లలుంటారు. వారిని ఆగం చేయొద్దు. ఎందుకంటే ఎండల వల్ల వడదెబ్బల మూలంగా ప్రాణాలు పోయే ప్రమాదాలున్నాయి. చలికాలంలో సభలకు పెద్ద ఇబ్బందులుండవు. వర్షాకాలం కూడా పెద్దగా సమస్యలు ఎదురుకావు. కాని కేవలం మంచి ఎండా కాలం ఎన్నికలకు చాలా ఇబ్బందికరం. ఇది దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు మసలు కోవాలి. ఈ నెల రోజులే మీతో పని. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్ల దాకా మీ ముఖం ఎవరూ చూడరు. మళ్లీ స్దానిక సంస్ధల ఎన్నికలు, ఓట్ల నాడే నీతో అవసరం. ఇది తెలుసుకోవాలి. పార్టీల మీద ప్రేమ వుంటే ఓట్లు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కర్తవ్యం. కాని కార్యకర్తల అవతారం ఎత్తి జెండాలు మోస్తూ, జీవితాలు నాశనం చేసుకున్నవారు చాలా మంది వున్నారు. పార్టీలలో పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఏవైన పథకాలు అమలు చేస్తాయా? చేయవు. పైగా ఏదైనా ప్రభుత్వ పథకాలలో ముందు వరసలో నిలబెడతారా? అంటే అదీ వుండదు. పార్టీ కోసం కష్టపడిని కార్యకర్తలకే ఇస్తామని నాయకులు చెప్పగలరా? ముందు కార్యకర్తలే ఇస్తామని నాయకులు అనగలరా? ప్రకటించగలరా? అంటే కార్యకర్త ఎప్పుడూ కూరలో కరివేపాకే… వంటలోకి బాగానే వుంటుంది. తినడానికే చేదుగా వుంటుంది. సువాసన ఎంతో బాగా వెదజల్లుతుంది. అందుకే కూరలో పడుతుంది. తినే ముందు తీసిపడేస్తే పళ్లెముందు పనికి రానిదానిగా పడి వుంటుంది. నువ్వు అంతే కార్యకర్త ఆలోచించుకో..ఈ ఎండల్లో ప్రచారాలకు వెళ్తావా? కూరలో కరివేపాకువై పోతావా? అన్నది నీ చేతిలో వుంది. ఇప్పుడు కార్లలో తీసుకుపోతున్నారు..కార్లలో దించిపోతారని అనుకుంటారే గాని, ఎండల్లో తిప్పుతారన్నది మర్చిపోతున్నారు. కారు ప్రయాణం అరగంటో..గంటో అంతే మిగతా సమయమంతా ఎండలోనే…అందుకే ఈ ఎండల్లో మొహమాటానికి వెళ్లకండి. వెళ్లి విగత జీవులు కాకండి. కుటుంబాలను ఆగం చేయకండి. మీ కుటుంబానికి మీరే రక్ష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *