బార్డర్ సెగ్మెంట్​లో.. కౌన్​బనేగా ఎంపీ?

– జహీరాబాద్​లో బీజేపీ బలాబలాలు ఎంత?

– బీజేపీ నుంచి బరిలో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్​

– కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్

– బీఆర్ఎస్ నుంచి నాన్​లోకల్ ​గాలి అనిల్ కుమార్

– బీఆర్ఎస్​లో ఉన్నప్పుడే బీబీ పాటిల్​పై ప్రజాగ్రహం

– కమలం గూటికి చేరగానే ప్రజలు మళ్లీ కనికరిస్తారా?

– సురేశ్​షెట్కార్ ​సీనియారిటీ పనిచేస్తుందా?

– ‘హస్తం’ పార్టీ నూతనోత్సాహం మేలు చేస్తుందా?

– ‘హస్తం’ హవాలో బీఆర్ఎస్ ​‘గాలి’ వీస్తుందా?

– నాన్ ​లోకల్ అనిల్​ను ప్రజలు అంగీకరిస్తరా?

నేటి ధాత్రి, స్టేట్​ బ్యూరో:
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల బార్డర్​లో ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లో మూడు ప్రధాన పార్టీల్లో త్రిముఖపోరు నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీపడుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 3, కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు విస్తరించి ఉన్నాయి. మూడు పార్టీల క్యాండిడేట్స్​గెలుపు తమదేనన్న దీమాతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సెకండ్ క్యాడర్ లీడర్లను కలుస్తూ మద్దతు కోరుతూ వ్యూహాత్మక రాజకీయాలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి. 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల విభజనలో భాగంగా.. 2008లో జహీరాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో.. సంగారెడ్డి జిల్లా నుంచి మూడు శాసనసభ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లా నుంచి నాలుగు అసెంబ్లీ సెంగ్మెంట్లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లా నుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు కలిసి జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు.

బీజేపీకి సంపూర్ణ మద్దతు?
బీజేపీ క్యాండిడేట్​గా బరిలోకి దిగుతున్న సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గెలుపుపై దీమాతో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన బీబీపాటిల్​ఎన్నికలకు రెండు నెలల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. మొదట్లో అసమ్మతి రాగం వినిపించిన జహీరాబాద్ బీజేపీ శ్రేణులు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగిన బీబీ పాటిల్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే బీజేపీలో చేరి ప్రధాని మోదీ చరిష్మాపైనే ఆధారపడ్డారనే ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీలో చేరగానే ఆయనపై ప్రజల్లో ఆగ్రహం తగ్గి సానుభూతి ఏర్పడుతుందా? అన్నీ మరిచిపోయి మోడీ మానియా, బీజేపీ హవాలో ఆయనను కనికరిస్తారా? అన్న చర్చ సాగుతోంది. ఏదేమైనా ఉన్న అభ్యర్థులలో స్థానికంగా పాటిల్​కే కొంత సాఫ్ట్ కార్నర్​ఉన్నట్లు పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాటిల్ కు వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నప్పటికీ పార్లమెంట్ ఓటింగ్ కు వచ్చేసరికి బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి అనుకూల పవనాలు ఉంటాయని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఈ ఈక్వేషన్లలో బీబీ పాటిల్ పావులు కదుపుతూ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. దీంతో ఆయనకే మెజారిటీ విజయావకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్ కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. ఈ సెగ్మెంట్ లో మొదటి ఎంపీగా గెలిచిన అనుభవం ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉంది. ఈ లోక్ సభలోని అసెంబ్లీల వారీగా బలాబలాలు చూస్తే ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి సెగ్మెంట్లలో కాంగ్రెస్ హవా చాటింది. జహీరాబాద్, బాన్సువాడ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా, కామారెడ్డి ఒకచోట బీజేపీ గెలిచింది. ఈ పార్లమెంట్ పరిధిలో పార్టీల వారీగా వచ్చిన మొత్తం ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ కు 5,49,143 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ కు 5,30,499, బీజేపీకి 1,72,66 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉండి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బీబీ పాటిల్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావుపై కేవలం 6 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ హయంలోనే పుంజుకున్నా కాంగ్రెస్ తాజాగా మరింత ఓటు బ్యాంకు సాధించి గెలుస్తుందని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది.

బీఆర్ఎస్ కొత్త పరిచయం
బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఆ పార్టీ నుంచి బరిలో నిలుస్తారని అందరూ ఆశించారు కానీ ఆయన బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ సందిగ్ధంలో పడింది. మెదక్ టికెట్ ఆశించిన గాలి అనిల్ కుమార్ కు పార్టీ హై కమాండ్ జహీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. మొదట్లో అనిల్ వ్యతిరేకించినప్పటికీ తప్పని పరిస్థితుల్లో జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు అంగీకరించినట్టు తెలిసింది. ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలుస్తానన్న విశ్వాసంతో అనిల్ పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీ మార్పుతో పాటు ప్రజల్లో ఆయనకు ఉన్న వ్యతిరేకతను అనిల్ కుమార్ క్యాచ్​చేసుకుని ఓటు బ్యాంకును పెంచుకునేందుకు రాజకీయ సమీకరణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు అనిల్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్​మధ్యనే పోటీ..
బీజేపీ, కాంగ్రెస్​అభ్యర్థులిద్దరూ లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో బీఆర్ఎస్ కాపు సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్‌‌కు టికెట్ ఇచ్చింది. పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ మెదక్ టికెట్ ఆశించగా.. బీఆర్ఎస్ హైకమాండ్​ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చింది. 2024 ఏప్రిల్ నాటికి జహీరాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో మొత్తం 16.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8,00,841 మంది ఉండగా.. 8,38,333 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అందులోని నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌, రెండింట్లో బీఆర్ఎస్, మిగిలిన ఒక్క నియోజకవర్గంలో బీజేపీ గెలించింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంత రావు, ఎల్లారెడ్డి స్థానం నుంచి మదన్ మోహన్ రావు గెలిచి హస్తవాసి చూపించారు. ఇక అదే జిల్లాలోని బాన్సువాడ నియోజవర్గం నుంచి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇక రాష్ట్రం మొత్తం షేక్ అయ్యేలా షాక్‌ చేశాయి కామారెడ్డి నియోజవర్గం ఫలితాలు. ఓ వైపు రెండు సార్లు సీఎంగా చేసిన కేసీఆర్, ఇంకోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి.. ఇలా ఇద్దరినీ ఒంటి చేత్తో ఓడగొట్టి.. కామారెడ్డి గడ్డపై బీజేపీ జెండా ఎగరేశారు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. ఇక.. సంగారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింట కాంగ్రెస్ జెండా ఎగిరింది. నారాయణఖేడ్‌లో పటోళ్ల సంజీవరెడ్డి, ఆంధోల్ నుంచి దామోదర రాజనర్సింహా కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు. దామోదర రాజనర్సింహా.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక జహీరాబాద్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి బరిలో దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు గెలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *