అసద్​ను హడలెత్తిస్తున్న నారీ శక్తి!

– పాతబస్తీలో మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్​

– ఎంఐఎంకు చుక్కలు చూపుతున్న బీజేపీ

– హైదరాబాద్‎ సెగ్మెంట్ లో టఫ్‎గా పొలిటికల్ ఫైట్

– ఎన్నికల ప్రచారంలో చెమటలు కక్కుతున్న ఓవైసీ

– జై శ్రీరాం నినాదాలతో హోరెత్తుతున్న మజ్లిస్​కంచుకోట

– వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళ్తున్న మాధవీలత

– ఎదురు లేని నేతను ఇంటికి పంపిస్తానంటూ సవాల్​

– విల్లు ఎక్కుబెడుతూ.. పతంగి కట్​చేస్తూ క్యాడర్​లో జోష్​

నేటి ధాత్రి, స్టేట్​బ్యూరో:

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఎంట్రీతో.. పాతబస్తీలో బస్తీ మే సవాల్ అన్నట్లు పోరు సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో రోజుకో వినూత్న రీతిలో, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలతో ఎంఐఎం పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల దర్గాలో మాధవీలత ప్రార్థనలతో కొత్త దుమారం రేగింది. ఆ సంఘటన హైదరాబాద్‎ను పొలిటికల్‎గా మరింత హీటెక్కిస్తోంది. దీంతో మాధవీ లత.. మజాకా! అంటున్నారు హైదరాబాద్ సెగ్మెంట్​ఓటర్లు. మాధవీలత ఎంట్రీతో పాతబస్తీలో ప్రచారం తీరే మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్​పార్లమెంట్​కు ఎన్నడూ లేనంత క్రేజ్​వస్తోంది. గతంలో లేని విధంగా అసదుద్దీన్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు మాధవీలత. ప్రచారంలో భాగంగా, పాతబస్తీలో గల్లీగల్లీని చుట్టేస్తున్నారు. మొన్న బాణం ఎక్కుపెట్టి, పతంగిని కట్ చేసిన హావభావాలతో కేక పుట్టించిన మాధవీలత.. ప్రచారంలో వేద మంత్రాలు చదువుతూ.. గణపతి, శివలింగానికి పూజలు చేస్తూ.. దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేస్తూ.. సమ్మర్​టైమ్ లో​ఎంఐఎంకు రాజకీయ వేడి సెగలు చూపుతున్నారు.

ఇటీవల ప్రచారం సందర్భంగా పాతబస్తీలోని ఓ దర్గాకు వెళ్లిన మాధవీలత, అక్కడ చాదర్ సమర్పించారు. దువా చేయాలని విజ్ఞప్తి చేస్తే, ఆమె సమాధిపై చాదర్ సమర్పించి దండం పెట్టుకొని తన గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె దర్గాలో చాదర్ సమర్పించడంపై ముస్లిం మత పెద్దలు మండిపడడంతో ఇదో వివాదంగా మారింది. ఇక ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ కూడా పాతబస్తీలో ఎలక్షన్ హీట్ పెంచుతున్నారు. ప్రచారం సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులతో ముచ్చటించారు. మరోవైపు కార్యకర్తలు పెద్దకూర తింటాం.. ఓవైసీని గెలిపిస్తామంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. ఇది కూడా మరో కాంట్రోవర్సీకి దారితీసింది. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీర్ మాత్రం.. బీజేపీ, ఎంఐఎం రెండూ కలిసి మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది. మెుత్తం 17 ఎంపీ సీట్లకు గాను మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ సారి ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలని మాధవీలతను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మజ్లిస్ పార్టీకి కంచుకోట. 2004 నుంచి ఈ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ వరుసగా ఎంపీగా గెలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో అసద్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే అందులో భాగంగానే నర నరాన హిందూత్వంతో నిండిని, పవర్​ఫుల్​లేడీ మాధవీలతను బరిలోకి దింపింది. అయితే చాలా మందికి మాధవీలత గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

మాధవీలత నేపథ్యం ఏమిటీ?
ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సనే కొంపెల్ల మాధవీ లత. ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ యాకుత్‌పురా నియోజకవర్గం సంతోష్​నగర్‌లో పుట్టి పెరిగిన మాధవీలత ఓయూలో ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్‌, ఫిలాసఫర్‌, ఎంటప్రిన్యూర్‌. ‘విరించి’ గ్రూఫ్‌ ఫౌండర్‌ కొంపెల్ల విశ్వనాథ్‌‌ను 2001లో వివాహం చేసుకున్నారు. కొంపెల్ల విశ్వనాథ్, మాధవీ లత దంపతులకు ముగ్గురు సంతానం. విరించి ఆస్పత్రి సీఎండీగా మాధవీ లత ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె లతామా ఫౌండేషన్‌ చైర్​పర్సన్‌ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.

కాగా.. ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవీ లత తొలిసారిగా రాజకీయంగా.. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అడ్డా. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో అసదుద్దీన్ వరుసగా ఎంపీగా గెలిచారు. అంతకు ముందు 1984 నుంచి 2004 వరకు ఆయన తండ్రి సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు.

అయితే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్‌కు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎదురులేని నేత ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. అందుకే ఈసారి అసద్‌ను ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది. ఇప్పటికే రెండు మూడు సార్లు బీజేపీ అభ్యర్థి ఇక్కడ రెండో స్థానం దక్కించుకున్నారు. దీంతో.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే అసదుద్దీన్‌ను ఓడించాల్సిందేనని అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీ లతను బీజేపీ బరిలోకి దింపింది. మరి కమలం పార్టీ ఫ్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *