: Farmers Allege Procurement Irregularities
కొనుగోలు కేంద్రాలా..? దళారుల అడ్డాలా..?
రైతు చెమటకు ధర లేక… దళారుల దందాకు అడ్డుకట్ట లేక..!
రైతులకు నియమాలు… దళారికి ప్రత్యేక సౌకర్యాలా..?
రైతులకే లేని .. గోనె సంచులు ? మరి దళారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి..?
అయినవోలు మండలంలో మొక్కజొన్న – వరి కొనుగోళ్లలో బయటపడుతున్న అక్రమాల కథ
నేటి ధాత్రి అయినవోలు :-
హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు రైతులకే శాపంగా మారుతున్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పంట అమ్మితే మద్దతు ధర వస్తుందనే ఆశతో కేంద్రాలకు వస్తున్న రైతులు… గోనె సంచుల కొరత, తూకాల ఆలస్యం, “ఆన్లైన్ సైట్ పని చేయడం లేదు” అనే సాకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెలల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇదే పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న దళారులు మాత్రం అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీశాయి.
రైతుకు నియమాలు… దళారికి ప్రత్యేక సౌకర్యాలా..?

సాధారణ రైతు తన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే “సర్వర్ లేదు”, “గోనె సంచులు లేవు”, “మ్యాచర్ రాలేదు”, “తూకం రేపు వేస్తాం” అంటూ రోజుల తరబడి వేచి పెట్టిస్తున్న అధికారులు… అదే సమయంలో కొందరు దళారుల ధాన్యాన్ని మాత్రం గంటల వ్యవధిలోనే తూకం వేసి లారీల్లో గోదాములకు తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయినవోలు మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో దళారుల హవా బహిరంగంగానే కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలోని ఒంటి మామిడిపల్లి సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో పది నుంచి పదిహేను మంది దళారులు గుంపుగా ఏర్పడి, కొందరు అబ్జర్వర్లు మరియు అధికారులను తమ ప్రభావంలో పెట్టుకొని భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
గోనె సంచులు రైతులకే లేవా..? మరి దళారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి..?
రైతు ధాన్యం కొనుగోలు చేయడానికి గోనె సంచులు లేవని చెప్పే అధికారులు… దళారులకు మాత్రం రహస్యంగా పెద్ద ఎత్తున సంచులు ఎలా అందుతున్నాయన్న ప్రశ్న ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆరువేళలా పొలంలో కష్టపడి పంట పండించిన రైతు ఒక తూకం కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుంటే… దళారుల ధాన్యం మాత్రం వరుసగా లారీల్లో లోడ్ అవుతూ గోదాములకు చేరుతోంది. ఇది సాధారణ వ్యవహారమా..? లేక అధికారుల సహకారంతో జరుగుతున్న అక్రమమా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది ఉద్యోగులు కావాలనే కొనుగోళ్లను ఆలస్యం చేసి, రైతులను విసిగించి, చివరకు దళారుల చేతుల్లోకి నెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు ప్రభుత్వ ధర కోసం ఎదురు చూస్తుండగానే, దళారులు తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసి భారీ లాభాలు ఆర్జిస్తున్నారని చెబుతున్నారు.
“పంట పండించేది రైతే… కానీ కొనుగోలు విషయంలో మాత్రం రైతునే ఇబ్బందులు పెట్టడం ఎందుకు..?” అని ప్రశ్నిస్తున్నారు.
అధికార పార్టీ పేరు చెప్పి ఒత్తిళ్లు..?
కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించిన రైతులకు కొందరు “అధికార పార్టీ నాయకులు చెప్పిందే జరుగుతుంది” అంటూ సమాధానం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు నిజంగా ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తున్నారా..? లేక కొందరి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతు కష్టానికి న్యాయం ఎప్పుడు..?
ఒకవైపు ప్రకృతి అనిశ్చితి… మరోవైపు పెట్టుబడి భారాలు… ఇవన్నీ తట్టుకుని రైతు పంట పండిస్తే, చివరకు కొనుగోలు కేంద్రాల వద్ద అవమానాలు, నిర్లక్ష్యం, ఆలస్యం ఎదురవుతుండటం బాధాకరం.
రైతు కళ్లలో ఆనందం కనిపించాల్సిన కొనుగోలు కేంద్రాలు… ఇప్పుడు కన్నీటి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థపై రైతుల్లో నమ్మకం కోల్పోతే, దాని లాభం పూర్తిగా దళారులకే దక్కుతుంది.
వెంటనే విచారణ అవసరం
అయినవోలు మండలంలోని మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న వ్యవహారాలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే ప్రత్యేక విచారణ చేపట్టాలి.
గోనె సంచుల సరఫరాపై ఆడిట్ నిర్వహించాలి
కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా చేయాలి
దళారుల జోక్యాన్ని అరికట్టాలి
రైతుల ధాన్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
లేకపోతే “రైతు ప్రభుత్వం” అనే మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతాయి. రైతు చెమటను గౌరవించని వ్యవస్థ… చివరకు రైతు కోపాన్ని ఎదుర్కోక తప్పదు.
