Probe Temple Demolition
శివాలయం కూల్చివేతపై విచారణ జరపాలి
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మాధవ రెడ్డి బాధ్యత వహించాలి
నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
గుప్తనిధుల కోసమే దురాశతో కూల్చివేత: త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తాం
శివాలయం పునర్నిర్మించకుంటే అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ చేపడుతుంది
బిఆర్ఎస్ రాష్ట్ర నేత,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్
నర్సంపేట, నేటిధాత్రి:
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో నిర్మించిన చారిత్రాత్మక శివాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. కూల్చివేతపై వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని శుక్రవారం డిమాండ్ చేశారు.పురావస్తు శాఖ పరిధిలోని కాకతీయుల నాటి వారసత్వ సంపదను స్కూల్ నిర్మాణం పేరుతో ధ్వంసం చేయడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి హస్తం ఉందని పెద్ది ఆరోపించారు. మట్టి కోట మధ్యలో ఉన్న శివాలయం 100 శాతం పురావస్తు శాఖ ఆస్తి అని, కాకతీయ కట్టడాలను తాకే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.స్కూల్ నిర్మాణం ముసుగులో అర్ధరాత్రి శివాలయాన్ని వెయ్యి ముక్కలు చేసి, రెండు గజాల లోతు తవ్వారని, గుప్తనిధుల కోసమే ఈ దురాశ అని విమర్శించారు. నర్సంపేటలో ఎమ్మెల్యే మాధవ రెడ్డే కాంట్రాక్టర్ అని, ‘శ్రీమాత కన్స్ట్రక్షన్’ పేరుతో బినామీ టెండర్లు వేసి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.శివాలయ విధ్వంసంపై ఇప్పటివరకు కాంట్రాక్టర్, అధికారులపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు కాలేదని ప్రశ్నించారు. దోచుకున్న సంపద మొత్తం రికవరీ చేసి, శివాలయాన్ని పునర్నిర్మించాలని, బాధ్యులైన ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తున్నామని, ఢిల్లీలోని పర్యాటకశాఖ, సీఎస్, పురావస్తుశాఖ, దేవాదాయ శాఖ, డీజీపీ, గవర్నర్‌కు బీఆర్ఎస్ తరఫున ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పునర్నిర్మించకుంటే, రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో పార్టీనే శివాలయాన్ని పునర్నిర్మిస్తుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు.ఈకార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తక్కల్లపెల్లి రవీందర్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, జిల్లా నాయకులు నల్లా మనోహర్ రెడ్డి, నాడెం శాంతి కుమార్,బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యువరాజు, మండల శ్రీనివాస్,నాగిశెట్టి ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి, ప్రచార కార్యదర్శి, పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
