Headlines

కార్యకర్తలెప్పుడూ కరివేపాకులే!


ఒక్క తెలుగుదేశంలోనే కనీసం సైకిల్‌పై తిరిగిన వాళ్లు మోటార్‌ సైకిల్‌ కొనుక్కున్నారు.


కాంగ్రెస్‌లో మొండిచేయే చూశారు….


కమలం పువ్వు చెవుల్లో పెట్టుకున్నారు…


పేరుకే కారు.. ఎక్కింది లేదు..కొన్నది లేదు
తెలంగాణ అన్నంత కాలం అటుకులే బుక్కారు…


తెలంగాణ వచ్చాక ఆ చరిత్ర చెప్పుకుంటూ బతుకుతున్నారు…


కడుపు కాలుతుందని ఆనాడు చెప్పలేదు..ఇప్పుడు చెప్పడం లేదు…


కన్నీళ్లు దిగమింగుడు అలవాటు చేసుకున్నారు…


కమ్యూనిస్టులు చెప్పేది కాళ్లకు పనే…


కార్యకర్తలే కష్టపడి విరాళాలు సేకరించి,పార్టీని బతికించాలి
ఏ పార్టీలోనూ కార్యకర్తలు బతికింది లేదు. బాగు పడ్డలేదు.


ఎన్నేళ్లైయినా కార్యకర్తలు అక్కడే…


నాయకులకు ఊడిగాలు చేసుడే…


ఏ రాజకీయ పార్టీచూసినా ఏమున్నది గర్వకారణం…కార్యకర్తలు సమస్తం సొంత పార్టీల పీడన పరాయణత్వం. ఇది దేశంలోని రాజకీయా పార్టీలలో పనిచేసే కార్యకర్తలు అనుభవించే వేధన. వెలుబుచ్చే ఆవేదన. జెండా కట్టే కాడ…జెండాలు మోసే కాడా మాత్రమే ముందుండాలి…తర్వాత అన్నిట్లో వెనుకేవుండాలి. పచ్చిగా చెప్పాలంటే దూరంగానే వుండాలి. నాయకులు పిలిస్తేనే రావాలి. లేకుంటే ఇంటి భయట కాపలా కాయాలి. నాయకుడు ఎప్పుడు పిలస్తాడా అని కళ్లు కాయలయ్యేలా ఎదరుచూడాలి. ఇదీ సగటు కార్యకర్త బతుకు…..నాయకులకు జైకొట్టే దగ్గర ముందుండాలి….ఇలా చెప్పుకుంటూ అన్నింటా కార్యకర్తలు వెనుకే వుండాలి. నాయకుల అనుమతి వుంటేనే ముందుకు రావాలి…నాయకులెప్పుడూ ముందు నడుసుడే…నాయకుల అడుగులో అడుగులై, వారికి ఓట్లేయించే యాంత్రాలుగా అలుపెరగని పని చేయాలి. ఎన్నికలయ్యాక నాయకుల చుట్లూ దీపపు మెణుగురులు తిరిగినట్లు తిరాగాలి. రాత్రనక, పగలనక నాయకులకు వెన్నంటే వుండాలి. వారికి రక్షణగా నిలవాలి. ఒక రకంగా చెప్పాలంటే కూలీ లేని పని వాడు అనలేక కార్యకర్త అని గౌరవంగా పిలిస్తే పొంగిపోవాలి. నాయకుడు ఇళ్లు కట్టుకుంటే నీళ్లు కొట్టాలి. నాయకులకు కావాల్సిన పనులు దగ్గరుండి చూసుకోవాలి. తన ఇల్లు మర్చిపోవాలి. తన కుటుంబం ఏం తింటుంది చూసుకోకుండా వుండాలి. ఎల్లప్పుడూ నాయకుడి జపం చేస్తుండాలి. వారి నాయకులను ఎవరైనా దూషిస్తే వారి మీద తిరగబడాలి. తమ నాయకుడిపై ఈగ వాలకుండా చూసుకోవాలి. జీవితాంతం ఇంతే…వందల మందిలో ఏ ఒక్కడికే అవకాశం వస్తే, ఆ నాయకుడి చెప్పుచేతుల్లో పదవులు అనుభవించాలి. వచ్చే రూపాయి ఆ నాయకుడి చేతిలో పెట్టి, అవే పాత చింత కాయపచ్చడి మెతుకులు తింటూ పార్టీకి జై కొట్టాలి. నాయకుడికి జేజేలు పలకాలి. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీలోనే కాదు..అన్ని రాజకీయ పార్టీల్లో కార్యకర్తల పరిస్ధితి ఇదే..ఇంతకన్నా ఘోరంగా వుంటాయంటే ఆశ్చర్యపోవాల్సిందే…
మేం సంతోషంగా వున్నామని చెప్పుకునే కార్యకర్త ఏపార్టీలో వుండడు. వున్నాడంటే ఆ కార్యకర్త మనసు చంపుకొని అబద్దం చెబతున్నట్లే లెక్క. పని లేదు. రూపాయి సంపాదన లేదు. తెల్లారితే తెల్లబట్టలు వేసుకోవాలి. నాయకుడి వెంట తిరగాలి. నాయకుడు ఎప్పుడు తింటే అప్పుడు నాలుగులు మెతుకులు తినాలి. ఇంట్లోనే నాయకుడు తిని బైటకు వెళ్తే, ఆ పూటంతా కార్యకర్త పస్తులే వుండాలి. ఆఖరుకు అయ్యో! ఇయ్యాల తినకపోతివి గదా? అని సానుభూతి మాటలు నాయకుడు మాట్లాడితే కన్నీళ్లు పెట్టుకోవాలి. నాయకుడిని మరింత గుండెల్లో పెట్టుకోవాలి. ఇదేనా కార్యకర్తలకు దక్కాల్సింది…ఇదేనా కార్యకర్తలకు నాయకులు ఇచ్చేది…..రాజకీయ పార్టీల పేరుతో కార్యకర్తలను వెట్టికి వినియోగిస్తున్నారు.
పార్టీ కోసం మూడువందల అవరై ఐదు రోజులు పనిచేసేది ఒక్క కార్యకర్త మాత్రమే… అప్పులు చేసి, ఆశలు తీరకపోతాయా? మంచి రోజులు రాకపోతాయా? అని జీవితాంతం ఎదురు చూసేది కార్యకర్తలు. ఆయా గ్రామాల్లో ఏదైనా పని చేయాలనుకుంటే భుజనా వేసుకొనేది కార్యకర్తలే. హైదరాబాద్‌లో వుండే నాయకుడు ఆర్డరస్తే, అప్పు చేసి సాయం చేయాల్సింది కార్యకర్తే. పేరు నాయకుడికి, అప్పు మీదపడేది కార్యకర్తకే. నాయకుడికి జేజేలు..కార్యకర్తకు ఇబ్బందులు…కార్యకర్తలే పార్టీలకు సైనికుల వంటి వాళ్లు అని గొప్ప సంబోధనలు. ఎన్నికల సమయంలోనే కాదు, నిరంతరం పార్టీ కోసం పని చేసే కూలీ లేని వెట్టికి నిదర్శనమైన వాళ్లు. అలా తయారు చేశారు. వాళ్లు ఎలాంటి పనులు చేసుకోవద్దు. కేవలం పార్టీ కోసమే బతకాలి. నాయకులకే జీవితం అంకితం చేయాలి. వాళ్లేమైనా కానీ, వాళ్ల కుటుంబాలేమైనా కాని నాయకులకు అవసరం లేదు. ఏదైనా జరగరానిది జరిగితే ఆ సమయంలో పార్టీ అండగా వుంటుందని ఒక్క మాట చెప్పాలి. మరుసటి రోజు మర్చిపోవాలి. అలా చెప్పి నాయకులు మర్చిపోయిన కుటుంబాలు దేశం మొత్తం మీద కొన్ని లక్షలుంటాయి. ఒక్కసారి మన రాష్ట్రంలో వున్న పార్టీలలో ఏ పార్టీలు కార్యకర్తలకు కనీసం కడుపు నిండా భోజనం పెడుతున్నవేమైనా వున్నాయా? మణి వున్నప్పుడు మంచినీళ్లు పోయకపోయినా మా కార్యకర్తలకు జీవిత భీమా చేయించాం? అని గొప్పగా చెప్పుకుంటున్నాయి? ఇదేనా కార్యకర్తలకు రాజకీయ పార్టీలు ఇచ్చే గౌరవం.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న సమయంలో కార్యకర్తలు ఎంత కొంత బాగుపడ్డారన్న మాట సర్వత్రా వినిపించేది. చిన్న చిన్న కాంట్రాక్టు పనులు నాయకులు, కార్యకర్తలకు ఇప్పించేవారు. గ్రామ స్ధాయిలో కొన్ని పనులు కార్యకర్తలను చేసుకొమ్మనేవారు. ఇక పనికి ఆహార పధకం బియ్యం వంటి కార్యక్రమాలు చేసి, నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు. అలా కనీసం పార్టీలో పని చేస్తున్నందుకు ఓ మోటర్‌ సైకిల్‌ కొనుక్కున్నామని గర్వంగా చెప్పుకున్న కార్యకర్తలున్నారు. కాని అలా చెప్పుకున్నవాళ్లు కాంగ్రెస్‌లో లేరు. ఊడిగం చేయడం తప్ప వారికి మిగిలిందేమీ లేదు. ఇక కారు కోసం ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల్లో ఎంత మంది కార్యకర్తలు కార్లు కొనుక్కున్నారు? ఎందుకంటే గ్రామ స్ధాయి పనులు కూగా కార్యకర్తలకు రావడం లేదు. గుడ్డిలో మెల్లలాగా మిషన్‌ కాకతీయ పనుల మూలంగా కొంత వెసులుబాటు కలిగినట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత మరొకటి ఏదీ రాలేదు. ఎంత సేపు సొంత వ్యాపారాలు చేసుకోవాలి. పగలనక రాత్రనక రియల్‌ వ్యాపారం చేసుకోవాలి. పార్టీ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి. అంతే తప్ప పార్టీ వల్ల వచ్చిన పనులు లేవు. ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన లబ్ధి లేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు అనే పధకం పెద్దఎత్తున అమలు చేసినప్పుడు, ప్రజలతోపాటు, కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా ఇండ్లు రాసుకున్నారు. కట్టుకున్నారు. కనీసం అలా అయినా లబ్ధి పొందారు. కాని కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి మూలంగానైనా, రాష్ట్రంలో అధికారంలో వున్న టిఆర్‌ఎస్‌ మూలంగానైనా కార్యకర్తలకు నయాపైస లాభం జరిగినట్లు ఎవరూ చెప్పింది లేదు. విన్నది లేదు. ప్రజలందరికీ అందే కార్యక్రమాలే తప్ప, ప్రత్యేకంగా కార్యకర్తలకు ఒనగూరిందేమీ లేదు. వారికి అందిందేమీ లేదు. డబుల్‌ బెడ్‌ రూంలు కూడా కార్యకర్తలకు వచ్చింది లేదు. సిసి రోడ్లు వేసి బాగుపడ్డది లేదు. గతంలో ప్రతి గ్రామంలో చెక్‌డ్యాంల నిర్మాణం పేరుతో కార్యకర్తలకు కాంట్రాక్టులు అందేవి. కాని ఇప్పుడు ఆ పనులు లేవు. కార్యకర్తలకు రూపాయి అందుతున్నది లేదు. నాయకులు దావత్‌ చేసుకోవడానికి ఇచ్చే నాలుగు రూపాయలు తప్ప, కుటుంబానికి అక్కరకొచ్చే ఒక్క పైసా కార్యకర్త సంపాదించింది లేదు. ఇంటికి నాలుగు స్వీటు ముక్కలు తీసుకెళ్లింది లేదు. కార్యకర్తలంటే పార్టీలకు సైనికులు అని మాత్రమే గొప్పగా చెప్పుకోవాలి. వారు వేయించే ఓట్లతో గద్దెనెక్కి కులుకుతూ వుండాలి. అవసరం వచ్చినప్పుడు కార్యకర్తలను దగ్గరకు పిలిపించుకోవాలి. అసవరం లేనప్పుడు కనీసం దగ్గరకు కూడా రాకుండా చూసుకోవాలి. జేజేలు కొట్టించుకోవాలి. జిందాబాద్‌లకు మాత్రమే కార్యకర్తలు పనికి రావాలి…అంతే…! ఎన్నికలప్పుడు నాయకులు కార్యకర్తలకు తమ కష్టాలు చెప్పుకోవాలి. గెలిచిన తర్వాత వారి సుఖాలు చూడకుండా కార్యకర్తలను దూరం పెట్టాలి!! కాదని ఎవరైనా అనగలరా???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *