మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఐక్యత, టికెట్ హామీలు

కష్టపడితే మనదే విజయం..
టిక్కెట్ రాని నేతలు అధైర్య పడొద్దు..
పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులలో వారికి ప్రాధాన్యం..
ఐక్యంగా పనిచేస్తే ఐదు మున్సిపాలిటీలు మనవే..

బీఫాంలు అందించిన మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు, పటాన్ చెరు నియోజకవర్గం ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్..

నేటి ధాత్రి, పఠాన్ చేరు:

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కష్టపడి ప్రజల్లోకి తీసుకుని వెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యమని మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


మంగళవారం ఐదు మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ ఫాం లను అశోక్ నగర్ లోని కాట నివాసంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఉన్న నాయకులనే కౌన్సిలర్ అభ్యర్థులుగా టికెట్లు కేటాయించినట్లు తెలిపారు. టికెట్ల కేటాయింపులు సర్వే ఆధారంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు వివరించారు. టికెట్లు రాని అభ్యర్థులు అధైర్య పడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

రాబోయే నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులలో టికెట్ రాని నేతలకు పెద్దపీటవేస్తామని హామీ ఇచ్చారు. ఆ నేతలు నిరుత్సాహపడకుండా ఆయా వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ కోసం పనిచేసిన వారికి టిక్కెట్ దక్కేనా….

పార్టీ కోసం పనిచేసిన వారికి టిక్కెట్ దక్కేనా….?

పైసలుంటేనే కౌన్సిలర్ టిక్కెటా…? ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారికి టిక్కెటా..?

మున్సిపల్ ఎన్నికలు మంత్రికి పెద్ద సవాలేనా…?

బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే వార్డుల రిజర్వేషన్ల మార్పా..?

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే వార్డుల రిజర్వేషన్లు మార్పు చేశారా..? అంటే అవుననే సమాధానం ప్రజల నుండి ఎక్కువగా వినిపిస్తుంది. రానున్న క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలే అని తెలుస్తుంది.పంచాయతీ ఎన్నికల్లోనూ చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంతగా ఫలితాలు రాలేదనే చెప్పాలి. బీఆర్ఎస్ కు పంచాయతీ ఎన్నికల్లో బాగానే ఫలితాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలంటే గుర్తులుండవు. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే పార్టీలుగా విడిపోయి ప్రచారం చేసుకోవడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలన్నీ పోటీ చేశాయి. అయితే గ్రామాలు వేరు పట్టణాలు వేరు. పట్టణ ఓటర్లు ఒక పట్టాన అర్ధం కారు. పట్టణ ఓటర్లు ఖచ్చితంగా పార్టీ పాలనను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటారు. డెవలెప్ మెంట్ చూస్తారు. అలాగే సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మరీ ఓటేస్తారు. అందులో భాగంగానే క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి రాబోయే మున్సిపల్ ఎన్నికలు మంత్రి వివేక్ వెంకటస్వామి కి పెద్ద సవాలుగానే నిలిచాయి.గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం, ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారికే కౌన్సిలర్ టికెట్ కేటాయిస్తారా..!

పైసలుంటేనే టికెట్ కేటాయిస్తారా..! అనేది వేచి చూడాల్సిందే.మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీలకు కూడా పట్టు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ తప్పేట్లు కనిపించడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ వారికి మంత్రి భరోసా ఇచ్చి ప్రత్యామ్నాయ పదవులు ఇస్తారో లేదో అనేది వేచి చూడాల్సిందే. అధికార పార్టీ నేతలు అయితే టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తామని బహిరంగంగానే చెబుతుండడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సంతృప్త స్థాయి ప్రజలు ఉన్నారు, అసంతృప్త స్థాయి ప్రజలు కూడా అదే రేంజ్ లో ఉన్నారు.పింఛనుదారుల నుంచి నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు పట్టణ ఓటర్లుగా తమ తీర్పును చెప్పనున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, మంత్రికి, డిసిసి అధ్యక్షులకు కత్తిమీద సాము లాంటివనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల విషయంలో మంత్రులనే బాధ్యులను చేసినప్పటికీ మంత్రులు ఏ స్థాయిలో పార్టీ గెలుపునకు ఉపయోగపడతారన్నది వేచి చూడాల్సిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికలను ప్రెస్టేజ్ గా తీసుకున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ రానున్న మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

ఐనవోలు ఎన్నికల్లో టికెట్ ఉద్రిక్తతలు

ఐనవోలు మండలంలో ఎన్నికల సందడి:
కేడర్ కష్టం వర్సెస్ నాయకుల ఆరాటం
“ఈసారి టికెట్లు కష్టపడ్డ కేడర్‌కా…?
లేక ఖద్దరు చొక్కాలిచ్చే నోట్ల కట్టలకా…?”
నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమే
“ఆగమవుతున్నము పట్టించుకోండి” అసంతృప్తి లో కష్టపడ్డ క్యాడర్
మెజారిటీ సర్పంచ్ స్థానాలు జనరల్ కేటగిరివే!!
17 గ్రామాల రాజకీయ సమీకరణలపై విశ్లేషణ

నేటిధాత్రి ఐనవోలు :-

 

ఐనవోలు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల పతాక వేళ మొదలైంది. హనుమకొండ రెవెన్యూ డివిజన్‌లో భాగంగా 2016లో ఐనవోలు మండలంగా ఏర్పడినప్పటి నుండి ,ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామ పంచాయతీలు ఉండటం ఈసారి ఎన్నికల రేసులో మెజారిటీ స్థానాలు జనరల్ కేటగిరీ కింద ఉండటంతో రాజకీయ నేతల దృష్టిలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. ప్రజలతో కంటే పైస్థాయి అనుచరులతోనే టికెట్ పంపకాలపై చర్చలు ఎక్కువగా సాగుతుండటం, జేబులు బరువైన వాళ్లే ముందంజలో కనిపించడం స్థానిక రాజకీయ విన్యాసాలపై కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమేనా??

ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే–ఎంపీ–జిల్లా నాయకుల దృష్టి మొత్తం పంచాయతీ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని స్థిరపరచడంపైనే నిలిచింది. అనుచరులకు అవకాశాలు ఇవ్వాలనే హామీలు వెలుపల వినిపిస్తున్నా, నిజమైన కష్టపడ్డ కేడర్‌కి మాత్రం పట్టింపులు తగ్గుతున్నాయన్న ఆవేదన పార్టీ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది.

గ్రామాల్లో పార్టీ జెండా మోసి తిరిగిన వాళ్ల కంటే, చివరి నిమిషంలో వచ్చిన “ప్రత్యేక అనుచరులు” లేదా వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయం వైపు చూడని వ్యక్తులకు ఇదివరకే అధికారం అనుభవించిన వారికీ టికెట్లు చుట్టబెడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

“ఆగమవుతున్నాం పట్టించుకోండి” పా(త)ర్టీల క్యాడర్లో అసంతృప్తి

గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికల దాకా పార్టీ కార్యకర్తలు భుజాన పడ్డ పని, తట్టుకున్న ఒత్తిడి, గ్రామాల్లో ఎదుర్కొన్న ప్రతికూలతలన్నింటినీ మరచినట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారని కేడర్ ఆరోపిస్తోంది.
“మా చెమట పిండుకొని వచ్చిన అధికార, మద్దతు మీ పాదాలకా? లేక నోట్ల కట్టలకా?” అనే ప్రశ్న గ్రామాల నుంచి నేరుగా నాయకుల కుర్చీల దాకా చేరుతోంది.

టికెట్లు చెమట చుక్కల కష్టానికా? ఖద్దరు చొక్కాలు ఇచ్చే నోట్ల కట్టలకా…?

టికెట్ పంపకాల్లో పారదర్శకత లేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశం.సంస్థాగత కృషి, పునాది స్థాయి పని, గ్రామ అభివృద్ధి పట్ల నిజమైన కట్టుబాటు లేనట్టి కొత్త నాయకులు లేదా గతంలో అధికారాన్ని అనుభవించి సంపాదన కూడబెట్టుకున్న వాళ్ళకి కేవలం వారి అంగ ఆర్థిక బలాన్ని చూపి పార్టీలు టికెట్ ఇచ్చేలా నాయకులు ప్రజా ప్రతినిధులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నిజాయితీగా పార్టీ కోసం పనిచేయడం అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ సిద్ధాంతాలను జండాలను వదిలిపెట్టకుండా నిలకడగా నిలిచిన వారిని విస్మరించడం అంటే పార్టీలకే దీర్ఘకాలిక నష్టమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

సామాజిక సమీకరణలు – జనరల్ కేటగిరీ స్థానాల ప్రభావం

17 గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలైన ఐనవోలు నందనం కొండపర్తి ముల్కలా గూడెం నర్సింహుల గూడెం ఉడుత గూడెం రెడ్డిపాలెం పంతిని తదితర గ్రామాల్లో జనరల్, జనరల్ మహిళా స్థానాలు కావడం వలన కుల, వర్గ సమీకరణలు కాస్త విభిన్నంగా కదులుతున్నాయి.కొన్ని గ్రామాల్లో వ్యక్తిగత ప్రాభవం మరికొన్ని గ్రామాల్లో ఆర్థిక బలం,ఇంకొన్ని ప్రాంతాల్లో పెద్దలు– మధ్యవర్తుల ప్రభావంఅభ్యర్థుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి.

రాబోయే రోజులు కీలకం

అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే సరికి పెద్దఎత్తున అసంతృప్తి, తిరుగుబాట్లు, మౌన వ్యతిరేకత కనిపించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజులు ఐనవోలు రాజకీయ దిశను మార్చే అవకాశం ఉన్నందున అందరి చూపూ ఇప్పుడు నాయకుల నిర్ణయాలపైనే నిలిచింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version