మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఐక్యత, టికెట్ హామీలు

కష్టపడితే మనదే విజయం..
టిక్కెట్ రాని నేతలు అధైర్య పడొద్దు..
పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులలో వారికి ప్రాధాన్యం..
ఐక్యంగా పనిచేస్తే ఐదు మున్సిపాలిటీలు మనవే..

బీఫాంలు అందించిన మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు, పటాన్ చెరు నియోజకవర్గం ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్..

నేటి ధాత్రి, పఠాన్ చేరు:

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కష్టపడి ప్రజల్లోకి తీసుకుని వెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యమని మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి నీలం మధు, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


మంగళవారం ఐదు మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ ఫాం లను అశోక్ నగర్ లోని కాట నివాసంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఉన్న నాయకులనే కౌన్సిలర్ అభ్యర్థులుగా టికెట్లు కేటాయించినట్లు తెలిపారు. టికెట్ల కేటాయింపులు సర్వే ఆధారంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు వివరించారు. టికెట్లు రాని అభ్యర్థులు అధైర్య పడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

రాబోయే నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులలో టికెట్ రాని నేతలకు పెద్దపీటవేస్తామని హామీ ఇచ్చారు. ఆ నేతలు నిరుత్సాహపడకుండా ఆయా వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version