ఐనవోలు ఎన్నికల్లో టికెట్ ఉద్రిక్తతలు

ఐనవోలు మండలంలో ఎన్నికల సందడి:
కేడర్ కష్టం వర్సెస్ నాయకుల ఆరాటం
“ఈసారి టికెట్లు కష్టపడ్డ కేడర్‌కా…?
లేక ఖద్దరు చొక్కాలిచ్చే నోట్ల కట్టలకా…?”
నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమే
“ఆగమవుతున్నము పట్టించుకోండి” అసంతృప్తి లో కష్టపడ్డ క్యాడర్
మెజారిటీ సర్పంచ్ స్థానాలు జనరల్ కేటగిరివే!!
17 గ్రామాల రాజకీయ సమీకరణలపై విశ్లేషణ

నేటిధాత్రి ఐనవోలు :-

 

ఐనవోలు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల పతాక వేళ మొదలైంది. హనుమకొండ రెవెన్యూ డివిజన్‌లో భాగంగా 2016లో ఐనవోలు మండలంగా ఏర్పడినప్పటి నుండి ,ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామ పంచాయతీలు ఉండటం ఈసారి ఎన్నికల రేసులో మెజారిటీ స్థానాలు జనరల్ కేటగిరీ కింద ఉండటంతో రాజకీయ నేతల దృష్టిలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. ప్రజలతో కంటే పైస్థాయి అనుచరులతోనే టికెట్ పంపకాలపై చర్చలు ఎక్కువగా సాగుతుండటం, జేబులు బరువైన వాళ్లే ముందంజలో కనిపించడం స్థానిక రాజకీయ విన్యాసాలపై కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమేనా??

ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే–ఎంపీ–జిల్లా నాయకుల దృష్టి మొత్తం పంచాయతీ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని స్థిరపరచడంపైనే నిలిచింది. అనుచరులకు అవకాశాలు ఇవ్వాలనే హామీలు వెలుపల వినిపిస్తున్నా, నిజమైన కష్టపడ్డ కేడర్‌కి మాత్రం పట్టింపులు తగ్గుతున్నాయన్న ఆవేదన పార్టీ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది.

గ్రామాల్లో పార్టీ జెండా మోసి తిరిగిన వాళ్ల కంటే, చివరి నిమిషంలో వచ్చిన “ప్రత్యేక అనుచరులు” లేదా వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయం వైపు చూడని వ్యక్తులకు ఇదివరకే అధికారం అనుభవించిన వారికీ టికెట్లు చుట్టబెడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

“ఆగమవుతున్నాం పట్టించుకోండి” పా(త)ర్టీల క్యాడర్లో అసంతృప్తి

గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికల దాకా పార్టీ కార్యకర్తలు భుజాన పడ్డ పని, తట్టుకున్న ఒత్తిడి, గ్రామాల్లో ఎదుర్కొన్న ప్రతికూలతలన్నింటినీ మరచినట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారని కేడర్ ఆరోపిస్తోంది.
“మా చెమట పిండుకొని వచ్చిన అధికార, మద్దతు మీ పాదాలకా? లేక నోట్ల కట్టలకా?” అనే ప్రశ్న గ్రామాల నుంచి నేరుగా నాయకుల కుర్చీల దాకా చేరుతోంది.

టికెట్లు చెమట చుక్కల కష్టానికా? ఖద్దరు చొక్కాలు ఇచ్చే నోట్ల కట్టలకా…?

టికెట్ పంపకాల్లో పారదర్శకత లేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశం.సంస్థాగత కృషి, పునాది స్థాయి పని, గ్రామ అభివృద్ధి పట్ల నిజమైన కట్టుబాటు లేనట్టి కొత్త నాయకులు లేదా గతంలో అధికారాన్ని అనుభవించి సంపాదన కూడబెట్టుకున్న వాళ్ళకి కేవలం వారి అంగ ఆర్థిక బలాన్ని చూపి పార్టీలు టికెట్ ఇచ్చేలా నాయకులు ప్రజా ప్రతినిధులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నిజాయితీగా పార్టీ కోసం పనిచేయడం అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ సిద్ధాంతాలను జండాలను వదిలిపెట్టకుండా నిలకడగా నిలిచిన వారిని విస్మరించడం అంటే పార్టీలకే దీర్ఘకాలిక నష్టమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

సామాజిక సమీకరణలు – జనరల్ కేటగిరీ స్థానాల ప్రభావం

17 గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలైన ఐనవోలు నందనం కొండపర్తి ముల్కలా గూడెం నర్సింహుల గూడెం ఉడుత గూడెం రెడ్డిపాలెం పంతిని తదితర గ్రామాల్లో జనరల్, జనరల్ మహిళా స్థానాలు కావడం వలన కుల, వర్గ సమీకరణలు కాస్త విభిన్నంగా కదులుతున్నాయి.కొన్ని గ్రామాల్లో వ్యక్తిగత ప్రాభవం మరికొన్ని గ్రామాల్లో ఆర్థిక బలం,ఇంకొన్ని ప్రాంతాల్లో పెద్దలు– మధ్యవర్తుల ప్రభావంఅభ్యర్థుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి.

రాబోయే రోజులు కీలకం

అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే సరికి పెద్దఎత్తున అసంతృప్తి, తిరుగుబాట్లు, మౌన వ్యతిరేకత కనిపించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజులు ఐనవోలు రాజకీయ దిశను మార్చే అవకాశం ఉన్నందున అందరి చూపూ ఇప్పుడు నాయకుల నిర్ణయాలపైనే నిలిచింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version