టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండల కేంద్రంలో పశువులకు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. పశువులకు టీకాలు వేయించటం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధుల ప్రభావం తగ్గుతుందన్నారు. గాలికుంటు వంటి వ్యాధులు పశువుల పాలు, ఉత్పత్తితో పాటు రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ప్రతీ ఒక్క రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మంత్రి సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…. పశు సంపద తోడు ఉంటేనే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఇళ్లల్లో పశుసంపద ఉంటే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు పశువులకు సరైన పోషకాలు కలిగిన దాణా మరియు మేత అందిస్తే పాల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. ముఖ్యంగా చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించడం తప్పనిసరి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ జిల్లా అధికారి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి గండ్ర సత్యనారాయణరెడ్డి పున్నమి రవి తదితరులు పాల్గొన్నారు
