ములుగు రాజకీయ తెరపై సీనియర్ జర్నలిస్టు
నేటిధాత్రి బ్యూరో : ములుగు జిల్లా రాజకీయకాలు ఇక రసవత్తరంగా మారనున్నాయి. ప్రాదేశిక ఎన్నికలకు ఓ వైపు రంగం సిద్ధమవుతుండడంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారు. ములుగు జిల్లా నూతనంగా ఏర్పడటంతో ఇక్కడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం జడ్పీ చైర్మన్ పదవి జనరల్ కావడంతో ఈ పీఠాన్ని కైవం చేసుకోవడానికి పలువురు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రాజకీయాల్లోకి సీనియర్ జర్నలిస్ట్
గత రెండు దశాబ్ధాలుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో జర్నలిస్టుగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు తుమ్మ శ్రీధర్‌రెడ్డి ప్రాదేశిక ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ స్థానం కావడంతో ఏటూరునాగారం జడ్పీటిసిగా పోటీచేసి జిల్లా పరిషత్ చైర్మన్ కావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ములుగు జిల్లాలో విస్తృతమైన సంబంధాలు కలిగిన శ్రీధర్‌రెడ్డి ములుగు రాజకీయ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి వరకు ప్రయత్నాలలో తుమ్మ శ్రీధర్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నట్లు తెలియవచ్చింది. అందరిని సమన్వయం చేసుకుంటూ గెలుపు గుర్రం ఎక్కేందుకు ఇప్పటికే ఆయన పని చేసుకుంటూ పోతున్నట్లు తెలిసింది.
గులాబీ అధిష్టానం ఆశీస్సులు
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ స్థానం కావడంతో అధికార పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఈ సంఖ్య విషయం ఎలా ఉన్న అత్యధికులు తుమ్మా శ్రీధర్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అధిష్టానాన్ని సైతం సంప్రదించిన ఆయన హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ములుగు జిల్లాలో స్థానికంగా బలం ఉన్న నాయకుడి కోసం చూస్తున్న గులాబీ బాస్ శ్రీధర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శ్రీధర్‌రెడ్డి ఈ స్థానం కోసం బరిలో దిగితే జర్నలిస్టుల నుంచి సైతం సంపూర్ణ మద్ధతు లభించే అవకాశం ఉన్నందున గులాబీ బాస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సైతం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా, టియుడబ్ల్యుజె (ఐజెయు) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ శ్రీధర్‌రెడ్డి జర్నలిస్టు యూనియన్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ అతనికి కలిసివస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమీకరణాల నేపథ్యంలో అధికార పార్టీ నుంచి టికెట్ ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.