Farmers Protest Over Maize Procurement
మక్కల కొనుగోళ్లలో ఎమ్మెల్యే విఫలం
నర్సంపేట-వరంగల్ రహదారిపై గురజాల క్రాస్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, రైతుల ఆందోళన
నర్సంపేట, నేటిధాత్రి:
మక్కల కొనుగోలు ప్రక్రియ నిర్వహణలో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, మార్కెట్, గోదాం, రవాణా విభాగాల మధ్య సమన్వయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త తక్కల్లపల్లి రవీందర్ రావు ఆరోపించారు. మక్కల కొనుగోలు కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై గురజాల క్రాస్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రవీందర్ రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా 42 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మక్కల కొనుగోలు చేపట్టారని గుర్తు చేశారు.కేసీఆర్ ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజను కొనడానికి ప్రతి మండలంలో ఐదు నుంచి ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, పీఏసీఎస్, ఎఫ్పీఓ, ఐకేపీ మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం 90 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట దిగుబడి వస్తే కేవలం 7 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్లలో మక్కల కొనుగోలు కేంద్రాలను నిలిపివేసి ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తోందని, ప్రైవేటు వ్యాపారులు, దళారులకు కొమ్ముకాస్తూ రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తోందని విమర్శించారు.మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో, రైతులకు మద్దతు ధర అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు కేవలం నామమాత్రపు సమీక్షలు చేస్తున్నారని, రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. గతంలో ఏర్పాటు చేసిన 42 కేంద్రాలను పునరుద్ధరించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, నమాల సత్యనారాయణ మాజీ ఎంపీపీలు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు,మొటూరి రవి,కౌన్సిలర్లు మండల శ్రీదేవి శ్రీనివాస్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రైతులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
