Government Doctor Dies in Accident
కారు, స్కూల్ బస్సు డికొని ప్రభుత్వ వైద్యుడు విజయ్ కుమార్ మృతి.
కల్వకుర్తి / నేటి ధాత్రి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలో జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై సీబీయం కాలేజీ దగ్గర శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రైవేట్ స్కూల్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ విజయ్ కుమార్ మృతిచెందాడు. తలకు,గుండె పక్క భాగంలో తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికి బ్రతికించలేక పోయారు. డాక్టర్ విజయ్ కుమార్ స్వస్థలం కొల్లాపూర్ వృత్తిరీత్యా కల్వకుర్తిలో స్థిరపడ్డారు ఆయన భార్య కల్వకుర్తి మండలం రఘుపతి పేట పీహెచ్సీలో వైద్య ర్యాలీగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అనవసర ఆపరేషన్లకు బదులుగా నార్మల్ డెలివరీ లను ప్రాధాన్యం ఇచ్చేవారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కల్వకుర్తి మాత్రమే కాకుండా కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వందలాది ప్రసవాలు నిర్వహించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రజలు భారీగా తరలివచ్చి కన్నీటి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడే చేతులు ఈరోజు నిశ్శబ్దంగా మారిపోయాయి ఎంతోమందికి జీవం పోసిన వైద్యుడు తానే ఇలా అకస్మాత్తుగా దూరమవ్వడం విధి ఎంత క్రూరమో చూపించిందన్నారు . ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు , రోగులు పెద్ద సంఖ్యలో చేరుకొని నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. జాతీయ రహదారులపై అతివేగం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
