DIEO karyalayamlo…eam jaruguthondi, డిఐఈఓ కార్యాలయంలో…ఏం జరుగుతోంది..

డిఐఈఓ కార్యాలయంలో…ఏం జరుగుతోంది..

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులదే హవా నడుస్తున్నదని, వారు చెప్పిందే వేదంగా కార్యాలయ సిబ్బంది నడుచుకోవాలని, ఎదురు మాట్లాడినా…వారి పనులకు అడ్డు తగిలే ప్రయత్నం చేసినా కార్యాలయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, అవినీతికి పాల్పడినా, అక్రమాలకు ఒడిగట్టినా నోరు మెదపకుండా మౌనంగా కూర్చోవాలని ఇతరులపై ఒత్తిడి తెస్తుంటారని సమాచారం. కళ్ల ముందే కార్యాలయంలో అవినీతి జరుగుతున్నా ఎవరికి చెప్పలేక తమలో తాము మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కొందరి మౌనమే వారి ఆగడాలకు, అవినీతి అక్రమాలకు అంతులేకుండా పోతున్నదని విమర్శలు వెల్లువెత్నుతున్నాయి. క్యాంపుల పేరిట, పేపర్‌ వాల్యుయేషన్‌, రీ-వెరిఫికేషన్‌, స్టేషనరీ, క్యాంపు నడిచిన సమయంలో రోజువారి కూలీలుగా వచ్చే వారి పైనా, ట్రావెలింగ్‌ అలవెన్సులు, టిఏ., డిఏల పేరుతో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా లెక్కకు మించి బిల్లులు పెట్టి పైసలు కాజేస్తున్నారని విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు తమకు అన్యాయం జరిగిందని ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదును ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లకుండా కాలయాపన చేస్తారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

-కాలేజి అనుమతులకు వారిని కలువాల్సిందే..

ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు అనుమతి పొందాలంటే కార్యాలయంలో ముందు వీరినే కలవాలని, అలా కలిస్తేనే పనులు సులువుగా పూర్తి అవుతాయని, లేకుంటే చుక్కలు చూడాల్సిందేనని విస్తృత ప్రచారం జరుగుతున్నది. చేతివాటం ముడితే చాలు కాలేజిలు పాటించాల్సిన నిబంధనలను వీరే పక్కకు బెట్టి అనుమతులను మంజూరు చేయిస్తారు. ఉన్నతాధికారిని సైతం పక్కదారి పట్టిస్తారు. చేతివాటం ముట్టగానే కనీస సౌకర్యాలు లేని కాలేజీలకు కూడా అనుమతులు చకచకా వచ్చేస్తాయి. నగరంలో కనీస సౌకర్యాలు లేకుండా నిబంధనలకు విరుద్దంగా అనేక కాలేజీలు నడుస్తున్నాయని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *