100 Quintals Rice Missing: Case Filed Against Officials
నేటిధాత్రి కథనంపై పూర్తిస్థాయిలో స్పందించిన సివిల్ సప్లై అధికారులు
చలపర్తి గోదాంలో రూ.4 లక్షల బియ్యం గల్లంతు.
మేనేజర్, జూనియర్ సహాయకుడిపై కేసు నమోదు
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ దుగ్గొండి మండలంలోని చలపర్తి గోదాంలో బియ్యం గల్లంతైన ఘటన పట్ల నేటిధాత్రి దినపత్రిక ప్రచురించిన చలపర్తి గిడ్డంగుల గోదాములో 100 క్వింటాళ్ల బియ్యం మాయం అనే వార్తా కథనంపై జిల్లా సివిల్ సప్లై అధికారులు పూర్తిస్థాయిలో స్పందించారు. అందుకు కారకులైన గోదాము మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ లపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో మాయమైన 100 క్వింటాళ్ల బియ్యం పట్ల ప్రధాన కార్యాలయ టాస్క్ ఫోర్స్ బృందం, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ తో పాటు సాంకేతిక సిబ్బంది కలిసి చలపర్తి గోదాంను తనిఖీ చేశారు.

తనిఖీ సందర్భంగా స్టాక్ రిజిస్టర్ ప్రకారం గోదాంలో నిల్వ ఉన్న బియ్యం బస్తాలను పరిశీలించగా, సుమారు 100 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గల్లంతైన బియ్యం విలువ సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ విషయంపై గోదాం మేనేజర్ స్వప్న మరియు జూనియర్ సహాయకుడు శ్రీకాంత్‌ను వివరణ కోరగా, వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.

దీంతో సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు దుగ్గొండి పోలీస్ స్టేషన్లో మేనేజర్ స్వప్న, జూనియర్ సహాయకుడు శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వరంగల్ జిల్లా మేనేజర్ సంధ్యారాణి తెలిపారు. ఫిర్యాదు మేరకు మేనేజర్ స్వప్న జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ లపై కేసు నమోదు చేయించి పోలీసులతో దర్యాప్తు చేపట్టిన్నట్లు జిల్లా సివిల్ సప్లై డిఎం సంధ్యారాణి పేర్కొన్నారు.
