Row Over Journalist Accreditations Violating GO 252
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రిడిటేషన్ల జారీకి కుట్ర
జీవో 252 బుట్ట దాఖలు చేస్తున్న
సమాచార శాఖ
పెద్ద పత్రికలకు ఉదారత
చిన్న పత్రికలపై వేటు
జీవో ఇష్టం వచ్చినట్లు మార్చే అధికారం ఎవరిచ్చారు?
జీవో ప్రకారం అక్రిడిటేషన్లు
ఇవ్వకపోతే న్యాయపోరాటం తప్పదు
డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్
కరీంనగర్, ఏప్రిల్, 24
రాష్ట్రంలో జర్నలిస్టులకు సంబంధించి అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ పూర్తి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా
రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు.
అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 252 అపహాస్యం పాలవుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక సంఘానికి సంబంధించిన నేతల ఒత్తిళ్లకు తలవొగ్గిన సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు సాక్షాత్తు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను
తుంగలో తొక్కడం ఎంత మేరకు సమర్థనీయం కాదన్నారు.
సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం జారీ చేసే అక్రిడిటేషన్లకు సంబంధించి
జరిపిన సమావేశాలలో ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయని, జీవోకు విరుద్ధంగా
జారీ చేసే అక్రిడిటేషన్ల ప్రక్రియను
అడ్డుకొని తీరుతామని ఆయన హెచ్చరించారు.
అక్రిడిటేషన్ జీవో కచ్చితంగా అమలు చేయాల్సి ఉండగా,
అందులో మార్పులు చేర్పులు చేసే అవకాశం, అధికారం రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీకి, సమాచార శాఖ కమిషనర్ కు, మీడియా అకాడమీ చైర్మన్ కు లేదని
కరుణాకర్ స్పష్టం చేశారు.
అలా మార్పులు చేసే అవకాశం లేనప్పుడు రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో
జీవో కు విరుద్ధంగా నిర్ణయాలు ఎందుకు జరిగాయని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో అక్రిడిటేషన్ల ప్రక్రియ జీవో ఎంఎస్ 252 ఆధారంగానే జరుగుతున్నదా? అలా అయితే, ఏబీసీ/ పీఆర్జీఐ/ ఆర్ఎన్ఐ ఆమోదిత సర్క్యులేషన్ సర్టిఫికేట్లు లేని పెద్ద (BIG) మధ్యతరహా (MEADIUM) వార్తాపత్రికలకు అక్రిడిటేషన్లు ఎలా మంజూరు చేయబడుతున్నాయని, దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత
సమాచార శాఖ అధికారులపైనే ఉందన్నారు.
జీవో ఎంఎస్ 252లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం, పెద్ద పత్రికల కేటగిరి లోని దినపత్రికలు ఏబీసీ/ పీఆర్జీఐ/ ఆర్ఎన్ఐ సర్క్యులేషన్ సర్టిఫికేట్ సమర్పించకపోతే, ఏ ప్రాతిపదికన వాటికి అక్రిడిటేషన్లు ఇవ్వబడుతున్నాయో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పెద్ద,మధ్యతరహా వార్తాపత్రికలతో పోలిస్తే చాలా తక్కువగా అక్రిడిటేషన్లు పొందుతున్న చిన్న వార్తాపత్రికలకు మాత్రమే సదరు జీవోను వర్తింప చేయడం చిన్న పత్రికలకు తీవ్ర అన్యాయం చేసినట్లేనని ఆయన అన్నారు.
జీవో ఎంఎస్ 252లో పేర్కొన్న విధంగా సర్క్యులేషన్ 25000 కంటే ఎక్కువ ఉంటే ఏబీసీ/పీజీఆర్ఐ/ఆర్ఎన్ఐ ఆమోదిత ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. సదరు జీవోను ఉల్లంఘిస్తూ, అక్రిడిటేషన్ కమిటీ పెద్ద మరియు మధ్యతరహా వార్తాపత్రికలకు అక్రిడిటేషన్లను ఆమోదించినట్టుగా తమకు సమాచారం ఉందన్నారు.
జీవో ఎంఎస్ 252ను ఉల్లంఘించి, దానికి వ్యతిరేకంగా ఆమోదాలు ఇచ్చే అధికారం అక్రిడిటేషన్ కమిటీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
జీవో ఎంఎస్ 252లో పేర్కొన్న విధంగా సర్క్యులేషన్ సర్టిఫికేట్‌ను ధృవీకరించుకోకుండా, పెద్ద మరియు మధ్యతరహా వార్తాపత్రికలకు ఏ ప్రాతిపదికన అక్రిడిటేషన్ ఇస్తున్నారని ప్రశ్నించారు.
కొన్ని పెద్ద,మధ్యతరహా వార్తాపత్రికలు డీఏవీపీ/సీబీసీలో అతి తక్కువ సర్క్యులేషన్‌ను చూపిస్తూ, సమాచార శాఖలో మాత్రం ప్రకటనల రేట్లు, అక్రిడిటేషన్ ప్రయోజనాల కోసం అంతకు పెద్ద సంఖ్యలో సర్క్యులేషన్ వివరాలు చూపిస్తున్నాయన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఏజెన్సీలకు వేర్వేరు సర్క్యులేషన్‌ను చూపిస్తూ మోసం చేస్తున్న పత్రికల
విషయంలో సమాచార శాఖ నిబంధనలు ఎందుకు పాటించడం లేదని ఆయన అన్నారు.
