Grand Cultural Fest Held as Part of Education Week
చెల్పూర్లో ఘనంగా మెగా రక్తదాన శిబిరం
57 యూనిట్ల రక్తం సేకరణ యువత ఉత్సాహభరిత భాగస్వామ్యం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ బస్టాండ్ కాంప్లెక్స్‌లో ‘హెల్ప్ టు నీడీ’ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ఘన విజయాన్ని సాధించింది. కేటీపీపీ జెన్కో కానిస్టేబుల్స్ నిర్వహిస్తున్న ఈ సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన శిబిరంలో మొత్తం 57 యూనిట్ల రక్తం సేకరించారు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిబిరం క్రమబద్ధంగా సాగింది. జెన్కో కానిస్టేబుల్స్, ఉద్యోగులు, స్థానిక యువతతో పాటు సంస్థ ద్వారా లబ్ధి పొందిన పేద కుటుంబాల సభ్యులు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జెన్కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఊర్మిళ, ఫ్యాక్టరీ మేనేజర్ రఘుపతి రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే రక్తదానం మహాదానమని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
