మన మధ్య అడ్డు గీతలొద్దు!

`సమాజాన్ని చీల్చే రాజకీయాలు చేయొద్దు!

`మతాల మధ్య మానవత్వం ముద్దు.

`అందరి ఐక్యత స్పూర్తి దాయకం.

`సఖ్యత సంతోషదాయకం.

`అలాయ్‌ బలాయ్‌ మనకు ఆనందదాయకం.

`కులాల చిచ్చు, మతాల ఉచ్చు వద్దు.

`కరోనా నేర్పిన పాఠం అప్పుడే మరువొద్దు.

`ఆధిపత్య రాజకీయాలకు సమాజ విభజన సరైంది కాదు.

`అలజడులు ఆకలి తీర్చవు…

`హింసా వాదాలు హితాన్ని కోరుకోవు.

`అందరం ఒక్కటే….మనమంతా ఒక్కటే.

`మంచి మన ఆభరణం కావాలి.

`మానవత్వం మనలో వెల్లివిరియాలి.

`విద్వేషాలొద్దు…విషభీజాలు నాటొద్దు.

`యువత జీవితాలతో ఎవరూ ఆటలాడుకోవద్దు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నువ్వైనా, నేనైనా, మనమెవరమైనా మంచికి ప్రతీకలం కావాలి. మానవత్వానికి సంకేతం కావాలి. ఐక్యతకు స్పూర్తి కావాలి. ఐకమత్యం ప్రదర్శించాలి. ఆదర్శానికి నిదర్శనం కావాలి. ప్రగతికి మార్గనిర్ధేశకం కావాలి. అభివృద్ధికి ఆలంబన కావాలి. మన మధ్య ఎప్పుడూ స్నేహం వెల్లివరిస్తూ వుండాలి. చిద్విలాసం మన పెదవులపై చిందిస్తుండాలి. ఎవరైనా భయపడాల్సివస్తే అనారోగ్యానికి భాధపడాలి. పేదరికానికి భయపడాలి. అంతే కాని మనిషినికి మనిషి చూసి భయపడే రోజులు రావొద్దు. ఆ రోజులు ఎవరూ సృష్టించొద్దు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చింతించాలి. అంతే కాని సమాజమేమౌతుందో అని చింతించే రోజు రావొద్దు. బిక్కు బిక్కు మంటూ బతికే పరిస్ధితులు ఎవరూ కోరుకోవద్దు. వాటిని సృష్టించే ప్రయత్నం ఎవరూ చేయొద్దు. రాజకీయ ప్రయోజనాలు ముడిపెట్టి, మనుషుల మధ్య విభజనలు సృష్టించొద్దు. కులాల కుంపట్లు పెట్టొదు. మతాల మధ్య దూరాలు, మనుషుల మధ్య విద్వేషాలు రగిలించొద్దు. అంతరాలు పెంచేవే రాజకీయ అగచాట్లు. వాటిని దరి చేరనీయొద్దు. తోటి వారికి సాయం చేయాలన్న ఆలోచనలు చేయాలే తప్ప, కీడెలా జరుగుతుందన్నది మదిలోకి కూడా రానివ్వొద్దు. మతాల పేరుతో, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారు ఎవరైనా సరే ప్రభుత్వాలు ఉపేక్షించొద్దు.పిచ్చి ప్రేలాపనలు చేసేవారిని ఊరికే వదిలేయొద్దు. కఠినంగా వుంటే తప్ప కాక చల్లారదు.

మన దేశం లౌకిక ప్రజాస్వామ్యానికి ప్రతీక. ప్రపంచ దేశాలు మనను చూసి స్పూర్తి పొందుతున్న ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం మనది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కొన్ని వందల సంవత్సరాలుగా సాగుతున్నది. మతం పేరుతో చిచ్చు రేపితే శాంతిభద్రలకు విఘాతం కలుగుతుంది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిసిన మన దేశంలో కులాలెన్ని వున్నా, మతాలెన్ని వున్నా మన మధ్య ఐక్యతే మన దేశాన్ని ప్రపంచంలో గొప్ప దేశంగా నిలిపింది. ప్రజా ప్రతినిధిలే సమాజంలో విద్వేషాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడం మనకు ఏ మాత్రం మంచిది కాదు. సమాజాన్నీ చీల్చే రాజకీయాలు ఎవరూ చేయొద్దు. కేవలం అధికారమే పరమాధిగా సమాజాన్ని వర్గాలుగా విభజించడం పెద్ద తప్పు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో కుల రాజకీయాలను గురించి నిత్యం మాట్లాడుకుంటుంటాం. మనలో మనకే కుల రాజకీయాలే సమాజానికి విఘాతం అనుకుంటే, మత రాజకీయాలు ఉత్పాతాలౌతాయి. సమాజాన్ని రెండుగా చీల్చేస్తాయి. ఇది ఎవరికీ మంచిది కాదు. ఎంత మాత్రం హితం కాదు. అందుకే రాజకీయా పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం విద్వేషాలు సృష్టించే రాజకీయ ప్రసంగాలెక్కడా చేయెద్దు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారు చేయాల్సిన పనులు కాదు. అది ఏ పార్టీ చేసినా తప్పే. రాజకీయ పార్టీలు అన్న తర్వాత అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలి. ఎన్నికల నాడు ఎల్లన్న, తర్వాత బోడన్నా అనే రాజకీయాలు చేయొద్దు. ఏ ఒక్క కులమో, ఓ ఒక్క మతమో ఓట్లేస్తే గెలిస్తేనే నాయకులు కాలేదు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఓట్లేస్తేనే గెలిచారు. అది మర్చిపోవద్దు. ఎన్నికల నాడు ఒక రాజకీయం…ఎన్నికల కోసం ఒక రాజకీయం చేయొద్దు. సమాజంలో చిచ్చు రేపే రాజకీయాలు మనకొద్దు. మతాల మధ్య మానవత్వం అందరికీ ముద్దు. కాని ఎవరూ విద్వేషపూరితమైన వాతావరణం కావాలని కోరుకోవద్దు. ఆ ఆలోచనలు చేయొద్దు. సమాజాంలో అందరికి ఐక్యత, అలాయ్‌ బలాయ్‌ లాంటి సంస్కృతి మనది. అది సమాజానికి ఎంతో ఆనందదాయకం. సఖ్యత సంతోషదాయకం. ఆధిపత్య రాజకీయాల కోసం, కేవలం అధికారం కోసం, ఓ పార్టీని అప్రదిష్టపాలు చేయడంకోసం, అధికారంలో వున్న పార్టీని గద్దెదింపడం కోసం చేసే రాజకీయ కుట్రల్లో మతాన్ని జొప్పించడం అన్నది ఎవరికీ శ్రేయస్కరం కాదు. అలజడులు ఆకలి తీర్చవు. కుత్సితాలు రేపే కుంపట్లు ఆరని మంటలు తెచ్చిపెడతాయి.ఒక్కసారి మన తెలంగాణ రాజకీయాలు బాగా గమనించండి. 

తెలుగు సామ్రాజ్యాలు మన దేశంలోనే కాదు, మన తెలంగాణలో అంతరించిన తర్వాత సుమారు ఆరు వందల సంవత్సరాల పాటు ముస్లింల పరిపాలనలోనే తెలంగాణ వుంది. మొఘలులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌ జాహీల పరిపాలన కొనసాగింది. కాని ఐక్యత ఒక ఒరవడిగానే సాగింది. ఒక దశలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లిం సమాజం కూడా వుంది. అందరూ కలిసే నిజాం మీద తిరగబడ్డారు. తెలంగాణ సాయుధపోరాటం చేశారు. నిజాంలకు తొత్తులుగా పనిచేసిన దొరల మీద అందరూ పోరాటం చేసి, తెలంగాణ సాధించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ అస్ధిరతల సృష్టికి ఆనాడు కూడా కొందరు పాకులాడేవారు. ప్రభుత్వాల అస్ధిరతకు కారణభూతులయ్యేవారు. అయినా సమాజంలో అవి రాజకీయ కుట్రలుగా కనిపించేవి. ఎన్టీఆర్‌ హాయాం వచ్చేసరికి కొంత సద్దుమణిగింది. చంద్రబాబు కాలంలో మరింత తగ్గింది. కాని వైఎస్‌. రాజశేఖరెడ్డి సమయంలో గోకుల్‌ ఛాట్‌ , లుంబినీ పార్కు వంటి దుర్ఘటనలు జరిగాయి. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో చాలా వరకు నగరంలో అల్లర్లు లేకుండా చేశారు. తెలంగాణ వచ్చాక అసలు అలజడి అన్న పదమేలేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన ప్రగతి శీల భావనలు ఎంతో మార్పును తెచ్చాయి. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాల అమలు. వంటి వాటితో సమాజంలో విజభన అన్నది లేకుండాపోయింది. అందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపే రోజులువచ్చాయి. దేశంలోనే అత్యంత ప్రశాంతమైన వాతావరణం వున్న రాష్ట్రంగా తెలంగాణ, ఎంతో ఆనందదాయకమైన నగరంగా హైదరాబాద్‌ మరింత కీర్తికెక్తింది. ఎన్నో రకాల పరిశ్రమల ఏర్పాటుకు, ఐటి రంగానికి ఉజ్వల భవిష్యత్తు తెలంగాణలో కనిపించింది. తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు, రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సమాజంలో ఒక్కసారిగా కుదుపుకు కారణమైంది. 

కొన్ని సంవత్సరాలుగా చార్మినార్‌ వంటి ప్రాంతాల్లో అర్ధరాత్రుళ్లు కూడా ప్రశాంతమైన వాతావారణం నెలకొన్నది. కాని మళ్లీ ఏడు గంటలకే దుకాణాలు మూసేయాల్సిన పరిస్ధితులు మళ్లీ వస్తాయని సగటు తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించలేదు. ఇందుకు కారణం ఎవరైనా కావొచ్చు. కాని రాష్ట్ర్రప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ర్యాపిడ్‌ ఆక్షన్‌ఫోర్సును రంగంలోకి దింపి, పరిస్దితి చక్కదిద్దింది. త్వరలో గణేష్‌ నవరాత్రులున్నాయి. పరిస్ధితి చేయిదాటిపోకుండా వుండాల్సిన తరుణం. అసలు ప్రేజలు రెచ్చగొట్టే వేషాలు ఎవరూ వేయొద్దు. తెలంగాణ ఉద్యమ కాలంలో ట్యాంక్‌ బండ్‌ మీద బతుకమ్మ పండుగ, తర్వాత పెద్దఎత్తున సాగిన సద్దుల బతుకమ్మలు, గణేష్‌ నిమజ్జనాలు ఎంతో సంతోషంగా సాగాయి. కాని ఒక్కసారిగా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా? అని రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. నిన్నటిదాక రాష్ట్ర బిజేపిలో అంతా మిత వాదులే వుండేవారు. తాజాగా పార్టీ అధ్యక్షుడు అతి వాద నాయకుడి మారిపోవడం అన్నది కొంత ఇబ్బందికరమైన పరిస్ధితికి సంకేతం. చనిపోయిన వారి ఇళ్లముందు భగవగ్ధీతను పెట్టొద్దు? అని చెప్పడం వేరు. అలా పెట్టిన వారిపై దాడి చేస్తామని చెప్పడం వేరు. హిందువులే భగవగ్ధీతను నమ్ముతారు. ఎంతో పవిత్రంగానే భగవధ్గీతను ప్రతి హిందువు చూస్తాడు. కాని కొంత కాలంగా అలా భగవద్గీతను వైకుంఠదామాల వాహనాలకుండే మైకుల్లో వినిపిస్తున్నారు. ఇది తప్పని చెప్పండి. కాని హిందులపైనే దాడి చేస్తామని చెప్పడం కూడా బిజేపికి తీవ్ర నష్టదాయమైన పనే. ఇక బిజేపి మొత్తం హిందువుల కోసమే అన్నట్లు మాట్లాడుతూ పోతే , ఆ పార్టీలో మైనార్టీ నాయకులకు చోటు లేకుండాపోతుందన్న సంకేతాలు వెళ్తాయి. అది పార్టీ మూల సిద్ధాంతానికి కూడా వ్యతిరేకం. అదే నుపుర్‌ శర్మ విషయంతో తేలిపోయింది. అయినా ఒక ప్రజా ప్రతినిధిగా వున్న రాజాసింగ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజల్లో అలజడిని సృష్టించాయి. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, ప్రజలను రెండుగా చీల్చి, ఇప్పుడేం సమాధానం చెబుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అన్నది ఎంత వరకు సమంజమో! కూడా పార్టీల నాయకులు తమను తాము ప్రశ్నించుకోవాలి. ప్రజలకు అసౌకర్యం కల్పించడమే రాజకీయం అనుకుంటే, ఆ పార్టీల రాజకీయానికి చరమగీతం పాడడం ప్రజలకు పెద్ద పని కాదు…ఓటుతో ఎక్కడ విసిరేయాలో అక్కడకి విసిరేస్తారు…బంగాళాఖాతంలో కలిపేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *