కోమటి రెడ్డి కొత్త ఎత్తుగడ!

`తమ్ముని కోసం అన్న కొత్త తరహా కోవర్డు అవతారం!?

`వెంకట రెడ్డి తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం నమ్మదగిందేనా!

`తమ్ముడు గెలిస్తే తాను రాజీనామా చేస్తా?

`లేకుంటే తమ్ముడిని ఓడిరచిన క్రెడిట్‌ ఖాతాలో వేసుకుంటా?

`ఏదైనా తన మంచికే…కుటుంబానికి పనికొచ్చేదే?

`అవసరమైతే అన్న ఇక్కడ, తమ్ముడు అక్కడ?

`మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌?

`అన్న తమ్ముని తోనే!

`పైకి రాజకీయం…లోన వ్యాపారం!

`కాంగ్రెస్‌ పార్టీకి జెల్లకొట్టకపోతే కాంట్రాక్టు మాయం

`వ్యాపారం చే జారిపోతే కష్టం!

`తమ్ముడితో నడవడం తప్పదు

`కాంగ్రెస్‌ మునిగిన నావ అనకపోతే నష్టం.

`నేనెక్కడికీ వెళ్లననే మాటలు ఒట్టివే!

`పనికిరాని తిరకాసులందుకే!

`అన్నదమ్ములది ఒకేదారి…చెరోదారి అన్నది చెప్పుకోవడానికే మరి…

`అన్న అంతరంగం…తమ్ముడు ఆవిష్కారం!

`అంతా మునుగోడు నాటకం!

`ఇరవై ఏళ్ల వ్యాపారం కోసం ముప్పై ఏళ్ల పార్టీని నిండా ముంచడం?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తనను తాను మోసం చేసుకోవడం మూర్ఖులు చేసే పని. తన పని కోసం ఇతరులను మోసం చేయడం అతి తెలివి మంతుని పని. అదే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఊగిసలాట ఎలా వున్నా ఉత్తుత్తి ప్రచారానికి తప్పకుండా వస్తా! తన వంతు పాత్ర ఎలా పోషించాలో అలా పోషిస్తా? ఎవరిని గెలిపించాలో వారినే గెలిపిస్తా? పార్టీ కోసమే పనిచేస్తా? పార్టీలోనే వుంటా? ఎలాగైనా పంతం నెగ్గించుకుంటా? తను అనుకున్నది నెరవేరడానికి కావాల్సిన ఎత్తుగడలు వేస్తా? తమ్ముని కోసం కొత్త తరహా కోవర్టు అవతారం ఎత్తుతా? అన్నట్లే వుంది కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ కాంపెయినర్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. పిపిసి దక్కలేదన్న అంసతృప్తితో వున్న వెంకటరెడ్డికి ఏ క్షణాన ఏఐసిసి స్టార్‌ కాంపైనర్‌ పోస్టు ఇచ్చిందో కాని అది ఈ రకంగా వెంకటరెడ్డికి ఉపయోగపడుతుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఇలాంటి పరిస్ధితుల్లో వెంకటరెడ్డి అడకత్తెరలో పోక చెక్క కావాలి. నుజ్జు నుజ్జు కావాలి. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కునే పరిస్ధితి ఎదురుకావాలి. కాని స్టార్‌కాంపెయినర్‌ పదవి అన్నది వెంకటరెడ్డికి అనుకూలంగా మారుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే దాన్ని వినియోగించుకొని మాత్రం తమ్ముడి వైపు పరోక్ష ప్రచారానికి క్షేత్ర స్ధాయిలోకి వెళ్లే అవకాశం దక్కింది. నిన్నటిదాకా మునుగోడు ప్రచారానికి నేను వెళ్లను…

అంటూ భీష్మించుకు కూర్చున్న వెంకటరెడ్డిలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు పార్టీ కోసమనుకుంటే అంత కంటే అమాయకత్వం వుండదు. తాను పంతం పట్టుకొని కూర్చుంటే తమ్ముడి వైపు అన్న లేడన్న సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. అందుకే చీకటి రాజకీయాలు చేసైనా సరే తమ్ముడిని గెలిపించుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ పదవి అడ్డం పెట్టుకొనే, శకుని పాత్ర పోషించొచ్చు. శల్య సారధ్యం వహించొచ్చు. ఇది కాంగ్రెస్‌పెద్దలు ఎందుకు ఆలోచన చేయడం లేదో అర్ధం కాకుండా వుంది. నిజాలు మాట్లాడుకోవడం కాంగ్రెస్‌లో పూర్తిగా కనుమరుగైనట్లుంది. తమ్ముడు రాజగోపాల్‌కు వ్యతిరేకంగా వెంకటరెడ్డి ప్రచారంచేయడం అంటే నమ్మశక్యం కాని విషయం. కాంగ్రెస్‌ పార్టీ తరుపున ప్రచారం అంటే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిని గెలిపించండి అని చెప్పడం కాదు…రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి తీరని ద్రోహం చేసిండని చెప్పగల ధైర్యం వెంకటరెడ్డికి వుందా? రాజగోపాల్‌రెడ్డి ఎన్నుకున్న మునుగోడు ప్రజలను మోసం చేశాడని చెప్పగడా? తన నాయకత్వాన్ని చూసే పార్టీ రాజగోపాల్‌కు ఇన్ని రకాల అవకాశాలు కల్పించినా, పార్టీని వదిలివెళ్లడం తల్లికి ద్రోహం చేయడమే అని వెంకటరెడ్డి చెప్పగలరా? మరి ఏం చెబుతారు? ఎలా ప్రచారం చేస్తారు? ఇదంతా హంబక్‌ అన్నది ఇక్కడే తెలిపోతోంది. ఇక్కడ వెంకటరెడ్డి అడుగులకు ముందర కాళ్లకు బంధం పడిరది. 

ముందుకు అడుగు వేయలేడు. వెనక్కి వేయలేడు. రాష్ట్రంలో పరిస్ధితులు కొద్దిగా మారుతున్నాయి. బిజేపిలో ఒక వర్గం దూకుడు ఆ పార్టీకి నష్టం తెచ్చే పరస్థితి వుందని తేలిపోయింది. ఇది గమనించే ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలకు పూనుకున్నది. ఆయనను సస్పెండ్‌ చేసింది. ఇలాంటి సమయంలో రాజగోపాల్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కూడా ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. నిజానికి కోమటిరెడ్డి సోదరులకు మునుగోడులో మంచి పట్టు వుంది. ప్రజల ఆదరణ కూడా వుంది. దీన్ని వదులుకుంటే రాజగోపాల్‌రెడ్డిది ఎటూ కాని రాజకీయం అవుతుంది. అందుకే అన్న వెంకటరెడ్డి చాలా చాకచక్యంగా రంగంలోకి దిగాడు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌ రెడ్డి ఒక వేళ గెలిస్తే, ఆ మరు క్షణమే వెంకటరెడ్డి కూడా భువనగిరి పార్లమెంటు స్ధానానికి రాజీనామా చేస్తాడు. ఒక వేళ రాజగోపాల్‌ రెడ్డి ఓడిపోతే, తాను చేసిన ప్రచారం మూలంగానే తమ్ముడు ఓడిపోయాడు? అన్న క్రెడిట్‌ తన ఖాతాలో వేసుకుంటాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు…ఇందులో పెద్ద లాజిక్‌ లేదు. కాకపోతే వెంకటరెడ్డి ఊ… అనడమే గొప్ప అన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ చేసుకునే ప్రచారం అసలుకే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. అంటే ఇక్కడ ఎవరికి వారు కాంగ్రెస్‌ నేతలంతా తప్పించుకునే ఎత్తుగడలోనే వున్నారన్నది పూర్తిగా స్పష్టమౌతోంది. కోమటిరెడ్డి సోదరుల మూలంగానే పార్టీ నల్లగొండలో బతుకుతుందన్న సంకేతాలు పరోక్షంగా ఒప్పుకున్నట్లే అవుతోంది. ప్రజల్లోకి పంపుతున్నట్లే అవుతుంది. అంతే కాదు వెంకటరెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కాల్చుతున్నామన్న భ్రమల్లో పిసిపి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసిసి నేతలు కూడా వున్నారనడంలో సందేహం లేదు. ఏది జరిగినా కోమటిరెడ్డి కుటుంబానికి నష్టం లేదు. 

రాజగోపాల్‌ రెడ్డి గెలిస్తే కాంగ్రెస్‌ పార్టీ కన్నా, కోమటిరెడ్డి కుటుంబానిదే పై చేయి అన్నది ప్రచారం చేసుకోవడానికి వీలౌతుంది. బిజేపిలో ఆయనకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. అన్న వెంకటరెడ్డి కూడా బిజేపిలో అడుగుపెట్టడానికి మార్గం సుగమమౌతుంది. కాంగ్రెస్‌ పార్టీ మునిపోయిన నావ అంటూ వెంకటరెడ్డి నోటితోనే పదే పదే చెప్పించుకునేందుకు వీలౌతుంది. ఒక వేళ రాజగోపాల్‌రెడ్డి ఓడిపోతే, వెంకటరెడ్డి బలమైన నాయకుడు. ఆయన వల్లే తమ్ముడు ఓడిపోయాడని కాంగ్రెస్‌లో మరింత ప్రాధాన్యత పెరిగేందుకు అవకాశం ఏర్పడుంది. ఎటు చూసినా కోమటిరెడ్డి కుటుంబానికి మేలే తప్ప, నష్టం లేదు. ఇదీ అసలు లెక్క. రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే అన్న కూడా అన్నీ సర్ధుకుంటాడు. లేకుంటే తమ్ముడు అక్కడ, అన్న ఇక్కడ రాజకీయాలు చేస్తుంటారు. పైకి కనిపించేందంతా రాజకీయమైనా, లోన సాగేందంతా వ్యాపారమే అన్నది అందరికీ తెలిసిందే. 

కాంగ్రెస్‌కు జెల్ల కొట్టకపోతే కాంట్రాక్టు మాయమౌతుంది. రెండేళ్లలో కేంద్రానికి ఎన్నికలు జరగాల్సివుంది. ప్రజలు మార్పు కోరుకుంటే పరిస్ధితి మరో రకంగా వుంటుంది. గత నలభై ఏళ్ల కాలంగా దేశ ప్రజలు వరసగా మూడుసార్లు ఏ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. మరి ఇప్పుడు బిజేపికి మూడోసారి అవకాశం వరించిందంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పూర్తిగా గల్లంతే…! అన్నది నూరు పైసల నిజం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఇద్దరు అన్నదమ్ములు మళ్లీ అసెంబ్లీకే పోటే చేసే అవకాశం వుంది. అప్పుడు ఏది అధికారంలో వుంటే దానికి సై అనేందుకు ఇద్దరు సోదరులు సన్నద్దమనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మంచో చెడో కాని రాజగోపాల్‌రెడ్డి కుమారుడు నడిపే కపంనీకి ఇరవైఐదేళ్ల కాలం సాగే ఓ కాంట్రాక్టు అన్నది వశమైంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక జీవిత కాలం కాంట్రాక్టు. ఒక జీవితానికి సరిపోయంతే పెద్ద ప్రాజెక్టు. ఒక తరం సుసంపన్నంగా కాలం వెళ్లదీసేందుకు ఆ ఒక్క కాంట్రాక్టు చాలు. అంత పెద్ద వ్యాపారం ముందు రాజకీయాలు చాలా చిన్నవి. అధికారంలో వున్న పార్టీ ఆశీస్సులు ఎంతో అవసరం. అందుకే ముందూ వెనుక ఆలోచించాల్సిన అవసరం లేకుండా రాజగోపాల్‌రెడ్డి జంప్‌ అయ్యారు. అన్న అలాగే వున్నారు. అయినంత మాత్రాన వెంకటరెడ్డి చెప్పే నేనెక్కడికీ వెళ్లను అన్న మాటలు వట్టివే…అన్నది అందరికీ తెలుసు. ఆయనకు కూడా తెలుసు.పనికి రాని తిరకాసులు పెడితే తప్ప తన ప్రభావం కనిపిచంచేలా లేదన్న చాణక్యం ప్రదర్శించడంలో వెంకటరెడ్డి సక్సెస్‌ అయ్యారని చెప్పడంలో సందేహం లేదు.

ఎందుకంటే తమ్ముడు పార్టీకి జెల్ల కొట్టి పోయినా, అన్న వెంకటరెడ్డి తన హావాను కొనసాగిస్తున్నాడంటే వారి రాజకీయాల ముందు రేవంత్‌ రాజకీయం తేలిపోయిందనేది ఇక్కడ స్పష్టమౌతోంది. పట్టుబట్టి మరీ రేవంత్‌రెడ్డి చేత సారీ చెప్పించుకున్నాడు. అయినా సంతృప్తి పడలేదని తేల్చేశాడు. అద్దంకి దయాకర్‌ సారి చెప్పాలన్నాడు. నాలుగు సార్లు చెప్పినా అబ్బే నాకు నచ్చలేదన్నాడు. అద్దంకిని సాగనంపితే తప్ప తాను కాంగ్రెస్‌ మొహం చూడనన్నాడు. అది కూడా చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైనా తూచ్‌ అన్నాడు. నేను మునుగోడుకుప్రచారం చేయనన్నాడు. అసలు కాంగ్రెస్‌ గెలిచే పరిస్ధితే లేదన్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకున్నాడు. అందర్నీ పిచ్చోళ్లను చేశాడు. అయినా పార్టీకి వెంకటరెడ్డి ప్రచారం చేస్తారనుకోవడం వెర్రిబాగుల తనం. పాపం కాంగ్రెస్‌ పార్టీ కూడా ఒక నాయకుడు ఆడమన్నట్లు అడేదాకా దిగజారిపోయిందనేది కళ్లముందు సాక్ష్యాత్కారం…ఇక పార్టీ కోలుకోవడం దేవుడెరుగు…జనం ఆదరణ మాత్రం ఇప్పటికే కరువు!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *