బిజేపి అరువు…కాంగ్రెస్‌ కరువు!?

https://epaper.netidhatri.com/

`ఉన్న నేతలు ఊడుతున్న బిజేపి.

` సీనియర్లకు కూడా గెలుస్తామన్న నమ్మకం లేదా?

`కేంద్ర నాయకత్వం భరోసా అంతంత మాత్రమేనా?

` వస్తున్నారు…పోతున్నారు…కేంద్ర పెద్దలు.

`బండిని తొలగించడంతో వున్న వాళ్లు పోతున్నారు.

` కొత్త నేతలతో కాంగ్రెస్‌ లో పాత నేతలకు తలనొప్పులు.

` గెలుస్తామన్న విశ్వాసం సీనియర్లలోనే లేదు.

`ఖర్చు చేయడం అంటే వున్నది ఊడ్చేసుకోవడమే?

`పార్టీ గెలిచినా ప్రాధాన్యత వుంటుందన్న భరోసా లేదు.

`ముందట పడితే రేవంత్‌ కు మేలు చేసినట్లౌతుంది.

`రండి…రండి…అనకోవడమే.

`అభ్యర్థుల ప్రకటన చేస్తే ఓ తంట…చేయకుంటే మరో తంట.

`ముందడుగులు దేవుడెరుగు! అన్నీ వెనకడుగులే!!
హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయ పార్టీలకు ఉపు అంటే ఊరికే వచ్చేది కాదు. ప్రజా మద్దతు అంటే మాటలు కాదు. అధికారంలోకి రావడం అంటే ఆటలు కాదు. పాలించాలంటే పార్టీ ఒక్కటే కాదు, దాని పనితనం, దానిలో పనిమంతులు కూడా వుండాలి. తెలంగాణ విషయానికి వస్తే ప్రజలు అటు కాంగ్రెస్‌ను గాని, ఇటు బిజేపిని కాని ఎందుకు నమ్మాలే? అన్న ప్రశ్నకు సమాదానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే 2004 ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని, గెలిచి పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టించింది కాంగ్రెస్‌. 1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ తీర్మాణం చేసిన బిజేపి 1999లో కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాజధాని నగరమే హైదరాబాద్‌లో వుంది. ఇక ప్రత్యేక రాష్ట్రమెందుకని మాట్లాడిరది బిజేపి. ఇలా రాజకీయ అవసరాల కోసం పిల్లిమొగ్గలేసి, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్న పార్టీలు ఈ రెండు. వాటిని నమ్మాలంటే ప్రజలు ఇప్పుడు సుముఖంగా లేదు. తెలంగాణ ఆంధ్రలో విలీనం చేసి, 1956లో పెనం మీద వున్న తెలంగాణను పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ప్రజలు అప్పటి నైజాం నవాబుకు వ్యతిరేకంగా రాజరికాన్ని దిక్కరించి సాయధ పోరాటం చేసి, తెలంగాణ దాస్య శృంఖలాలను తెంచుకొని స్వరాష్ట్రమై ఐదేళ్లు మూడేళ్లు స్వయం పాలన సాగింది. అలా మూడేళ్లు గడిచిందో లేదో బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రలో కలిపి, గంగలో ముంచినంత పని చేశారు. తెలంగాణకు మళ్లీ వాతలు పెట్టారు. ప్రజల గోస పుచ్చుకున్నారు. ఆనాడే ఆంధ్రతో కలవమంటూ తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకన్నా వినకుండా ఆంధ్రలో కలిపేశారు. పెత్తనం వారి చేతిలో పెట్టి, తెలంగాణ మోచేతికి బెల్లం అంటించి నాకించారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ తప్పని పరిస్ధితుల్లో, అనివార్యమై తెలంగాణ 2014లో ఇచ్చిందే కాని, తెలంగాణ ప్రజలమీద గౌరవంతో ఇవ్వలేదు. రాజకీయంగా పార్టీ నామరూపాలు లేకుండాపోయే ప్రమాదముందని గ్రహించి ఇచ్చారు. అయితే అప్పటికే పుణ్య కాలం పూర్తయింది. ఇక కాంగ్రెస్‌ను మళ్లీ నమ్మితే నట్టెట ముంచుతుందన్న భయంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ అంటేనే ఆమడ దూరం తరిమేస్తున్నారు. అందులోనూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొందరు మాత్రమే జై తెలంగాణ అన్నారు. కాని అప్పటి కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాగైనా తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం, భరోసా కల్గిన తర్వాతనే తెలంగాణ కోసం ఆలోచించారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల దాకా ఆ ఊసే ఎత్తలేదు. పైగా కాంగ్రెస్‌ నాయకులు అడుగడుగునా ఉద్యమాన్ని అడ్డుకున్నారే గాని, సహకరించలేదు. ఎంత సేపు వైఎస్‌ కళ్లలో పడాలని, ఆయన చేత పదువుల పొందాలన్న తపన తప్ప, తెలంగాణ కోసం పోరాడేందుకు ఏ ఒక్క తెలంగాణ నాయకుడు ముందుకు రాలేదు. వైఎస్‌. మరణం తర్వాత గాని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు సోయి రాలేదు. వైఎస్‌ మత్తు తొలగలేదు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేసి, కేంద్రం యూటర్న్‌ తీసుకుంటే రాజీనామా చేయమంటే కూడా చేయలేదు. కొందరు చేసినా, మళ్లీ వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఇదీ కాంగ్రెస్‌ నాయకుల చరిత్ర. అయినా కనీసం ఆ నాయకుల పెత్తనం కూడా నేడు కాంగ్రెస్‌లో లేదు. తెలంగాణను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నడుస్తోంది. అలాంటి కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం అనేది కల. ఇక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచిందన్న ఊపు తప్ప, తెలంగాణ ప్రజల మన్ననలు చూరగొన్నది ఏనాడు లేదు. అసలు మొన్నటి దాక బిజేపి ఊపు చూపించింది. అప్పుడే నేటిధాత్రి కుండబద్దలు కొట్టిచెప్పింది. అది వాపు తప్ప బలం కాదని తేల్చి చెప్పింది. అదే బిజేపి విషయంలో నిజమైంది. ఉప ఎన్నికల పుణ్యమా? అని బిజేపిలో కదలిక వచ్చినట్లు కనిపించింది. కాని అదంతా డొల్ల అంటూ నేటిధాత్రి చెబుతూనే వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే అన్నంతగా బిజేపి ఊపు మీద వున్నట్లు కనిపించింది. కాని కర్నాటక ఎన్నికల ఫలితాలతో బిజేపి గాలిబుడగ పగిలిపోయింది. బండి సంజయ్‌ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో బిజేపిలో కొద్దో గొప్పో వున్న ఆ మాత్రం గాలి కూడా లేకుండాపోయింది. ఇప్పుడు పూర్తిగా చతికిలపడిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆది నుంచి బిజేపి తెలంగాణకు వ్యతిరేకంగానే వుంది. తెలంగాణ ఇస్తామని బిజేపి ఏనాడు చెప్పలేదు. ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసిన తర్వాత చత్తీస్‌ఘడ్‌, రర్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ మూడురాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కాని తెలంగాణ ఇవ్వలేదు. అందుకు అప్పటి ఎన్డీయేలో చంద్రబాబు బాగస్వామి కావడమే. కేవలం చంద్రబాబు కోసం తెలంగాణ ఇవ్వకుండా అన్యాయం చేసింది బిజేపి. ఆ తర్వాత కూడ తెలంగాణ బలమైన ఆకాంక్ష కళ్లముందు కనిపించిన తర్వాత సుష్మాస్వరాజ్‌ మాత్రమే పట్టుబట్టి తెలంగాణకు న్యాయం జరగాలని కోరింది. తెలంగాణ పక్షం నిలిచింది. కాని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఆది నుంచి తెలంగాణపై విషం చిమ్ముతూనే వున్నాడు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో తల్లిని చంపి బిడ్డను బ్రతికించారాన్నరు. అంటే ఆయనకు తెలంగాణ ఇవ్వడం సుతారం ఇష్టం లేదన్నది తేలిపోయింది. అంతే కాదు పార్లమెంటు తలుపు మూసి తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఇదే విషయాన్ని సాక్ష్యాత్తు పార్లమెంటులో కూడా చెప్పి, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసు వుందో చెప్పకనే చెప్పారు. మరి అలాంటి బిజేపి పెద్దలు తెలంగాణకు న్యాయం చేస్తారని ప్రజలు భావించడంలేదు. అందుకే బిజేపిని అక్కున చేర్చుకోడం లేదు. ఆదరించేందుకు ఇష్టపడడం లేదు. ఒక దశలో బిజేపిలోకి కాంగ్రెస్‌నుంచి పెద్దఎత్తున వలసలు వెళ్లాయి. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న ఎంతో మంది కాంగ్రెస్‌నేతలు బిజేపిలో చేరిపోయారు. ఆఖరుకు ఇక కాంగ్రెస్‌లో వున్నా లాభం లేదనుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజేపిలోకి వెళ్లి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారు. ఇక ఆ ఎన్నికలో గెలిచి, సార్వత్రిక ఎన్నికల్లో బిజేపి అదికారంలోకి వస్తే నేనే సిఎం అన్నంతగా ఆశల పల్లకిలో ఊరేగారు. ఏమైంది ఉన్న పదవి పోయింది. మాజీ అన్నది వచ్చి చేరింది. చివరకు పార్టీలో తనకు గుర్తింపు లేకుండా పోతోందని మధనపడుతున్నాడు. కాంగ్రెస్‌లో వున్నంత కాలం కాంగ్రెస్‌కు రోజులు లేవన్నాడు. ఇప్పుడు బిజేపికి కష్టకాలమే అంటున్నాడు. బండి సంజయ్‌ అధ్యక్షుడిగా వున్న సమయంలో ఇక బిఆర్‌ఎస్‌నుంచి అదిగో వచ్చె, ఇదిగో వచ్చే అంటూ లెక్కలేసి మరీ చెప్పారు. ఆ మాటలు నమ్మి కాంగ్రెస్‌ నేతలు పార్టీ వదిలి కొంత మంది బిజేపిలో చేరారు. ఇప్పుడు వాళ్లంతా కాంగ్రెస్‌ వైపు అడుగులేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్‌ ఇప్పుడు నాయకుల కరువులో వుంది. బిజేపి అరువు నేతలు తిరిగి వలసలు వెళ్తుంటే కుమిలిపోతోంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *