మాతా శిశు ఆస్పత్రిపై మంత్రికి నిర్లక్ష్యం ఎందుకో చెప్పాలే

– ఓట్లు వేసి మంత్రిగా చేసిన మంథని ప్రజల కష్టాలు తీర్చరా
– రెండు నెలలుగా డాక్టర్‌ను నియమించలేని దుస్థితి సర్కారుది
– ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలనే కన్పిస్తాంది
– మెరుగైన వైద్యసేవలందించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ సర్కార్‌ది
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

ఆడబిడ్డల కాన్పు తల్లిదండ్రులకు భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో ఆనాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాతా శిశు ఆస్పత్రి నిర్మాణం చేసి మెరుగైన సేవలు అందిస్తే ఈనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆ ఆస్పత్రిపై మంత్రి నిర్లక్ష్యం చేస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. శుక్రవారం మంథని పట్టణంలోని మాతా శిశు ఆస్పత్రిని ఆయన సందర్శించి ఆయా వార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఎంత మంది డాక్టర్లు ఉన్నారని, సిబ్బంది ఎంతమంది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రెండు మాసాలుగా గైనకాలిజిస్ట్‌ వైద్యుల నియామకం జరుగలేదని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ముఖ్యమంత్రితో కలిసి తిరుగుతున్న మంథని ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలోని మాతా శిశు ఆస్పత్రిలో ఒక వైద్యుడిని నియమించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడికి ఒక పెద్ద పదవి వస్తే ప్రజలు ఎంతో ఆనందిస్తారని, తమకు ఎంతోమేలు జరుగుతుందని ఆశిస్తారని, కానీ ఇక్కడ మాత్రం అందుకు బిన్నంగా జరుగుతోందన్నారు. మంథని ప్రజల ఓట్లతో గెలిచి మంత్రిగా అయిన మంథని ఎమ్మెల్యే మంథని ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని, రెండు నెలలుగా మాతా శిశు ఆస్పత్రిలో ఒక గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ను నియమించడంలో విఫలం అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి హోదాలో ఉండి ఈ ప్రాంత ప్రజలను పురోగతిలోకి తీసుకెళ్లాల్సి ఉండగా అందుకు బిన్నంగా తిరోగమనంలోకి తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు. మంథని ఎమ్మెల్యేను ఐదు సార్లు, ఆయన తండ్రిని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంథని ప్రజలను ఓట్ల యంత్రాలుగానే చూస్తున్నారే తప్ప వారి గురించి ఏనాడు ఆలోచన చేయలేదని అన్నారు. రెండు నెలలుగా వైద్యుడిని నియమించకపోవడం ఎవరి తప్పో ఆలోచన చేయాలన్నారు. తాము ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వాటికి సరైన సమాధానం చెప్పకుండా కింది స్థాయి నాయకులతో తనను దూషించిపిస్తున్నారని, మాతా శిశు ఆస్పత్రి విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆనాడు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంథనిలో మాతా శిశు ఆస్పత్రిని మంజూరీ చేయించి నిర్మించామని, అటుతర్వాత వైద్యులను నియమించి ఈ ప్రాంత ఆడబిడ్డలకు కాన్పులు చేయించామని అన్నారు. సామాజిక వైద్యశాలలో ఆడబిడ్డలు కాన్పులై వేసవికాలంలో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతుంటూ తన ఆడబిడ్డల్లా బావించి ఏసీలు పెట్టించామని, అలాగే మాతా శిశు ఆస్పత్రిలో కూలర్లు అందించామని ఆయన గుర్తు చేశారు. ఈనాడు మంథని ఎమ్మెల్యే మంత్రిఅయ్యారని ఆస్పత్రికి మంచి రోజులు వచ్చాయని, మరిన్నిసౌకర్యాలు మెరుగుపడుతాయని భావిస్తే అందుకు బిన్నంగా ఆస్పత్రిని నిర్లక్ష్యంగా వదిలేశారని ఆయనవాపోయారు. ఒక వైద్యురాలు లేకపోవడంతో ఆస్పత్రిలో సుమారు 20మంది సిబ్బంది ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎంతో మంది ఆస్పత్రికి వైద్యంకోసం వచ్చి డాక్టర్‌ లేక గోదావరిఖరి, కరీంనగర్‌ లాంటి పట్టణాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంథనికి 30కిలో మీటర్ల దూరంలోనే కలెక్టర్‌ కార్యాలయం ఉందని, అయినా కలెక్టర్‌ ఈ విషయంపై దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. తరచూ ఈ ప్రాంతంలో పర్యటించే కలెక్టర్‌ మాతాశిశు ఆస్పత్రిలో వైద్యుల నియామకం ఎందుకు చేయడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే స్పందించి మాతా శిశు ఆస్పత్రిలో వెంటనే వైద్యురాలును నియమించి మెరుగైన సేవలుఅందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!