విజయ్ అనే నేను..
ద్రావిడ గడ్డపై కొత్త శకం!
చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తమిళగ వెట్రి కళగం అధినేత సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, తొలిసారిగా ఒక నూతన పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో తమిళనాడు అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
ముఖ్యమంత్రితో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. బుస్సీ ఆనంద్, ఆధవ్ అర్జున , కేఏ సెంగోట్టయన్ , కేజీ అరుణ్‌రాజ్, పి.వెంకటరమణన్, సిటిఆర్ నిర్మల్ కుమార్, ఏ.రాజ్ మోహన్, టికె ప్రభు , ఎస్.కీర్తన మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మంత్రుల జాబితాలో మహిళలకు , షెడ్యూల్డ్ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ విజయ్ తన టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం , ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.
ఈ చారిత్రాత్మక వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ హేమాహేమీలు హాజరయ్యారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా విచ్చేసి విజయ్‌కు అభినందనలు తెలిపారు. వారితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులతో నెహ్రూ స్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే స్టేడియం మొత్తం దళపతి నినాదాలతో మారుమోగిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా చెన్నై నగరం అంతటా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
గవర్నర్ ఆదేశాల మేరకు మే 13లోగా అసెంబ్లీలో విజయ్ తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీవీకే కూటమికి 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో బలాన్ని నిరూపించుకోవడం సులభమేనని భావిస్తున్నారు. మధ్యాహ్నం విజయ్ తన కేబినెట్ తో తొలి సమావేశం నిర్వహించి, ఎన్నికల హామీల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
