*ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనదారుల నిర్లక్ష్యం*
*రాంగ్ రూట్,మొబైల్ వినియోగం,ఓవర్ స్పీడ్తో ప్రజల్లో ఆందోళన*
*పరకాల,నేటిధాత్రి*
పట్టణంలో ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా వాహనదారులు వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకు పెరుగుతోంది.ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు,ప్రధాన కూడళ్ల వద్ద రాంగ్ రూట్లో ప్రయాణించడం,ఓవర్ స్పీడ్తో దూసుకెళ్లడం వంటి ఘటనలు ప్రమాదాలకు దారి తీసే పరిస్థితులను సృష్టిస్తున్నాయి.కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా విస్మరించి రాంగ్ రూట్లో వేగంగా వెళ్తుండడంతో ఇతర వాహనదారులు,పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.అదేవిధంగా డ్రైవింగ్ చేస్తూనే మొబైల్ ఫోన్లో మాట్లాడటం కూడా అధికంగా కనిపిస్తోంది.ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల దృష్టి మరలిపోవడంతో ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఇక కొంతమంది యువత భారీ సైలెన్సర్ మోతలతో,ఓవర్ స్పీడ్లో వాహనాలు నడుపుతూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ తరహా ఘటనలు అధికంగా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.రాంగ్ రూట్, మొబైల్ వినియోగం,అధిక శబ్దాలతో వాహనాలు నడిపే వారిపై జరిమానాలు విధించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచిస్తున్నారు.ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించినప్పుడే ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
