Target of 15,000 Metric Tons Paddy Procurement Daily
రోజుకు 15 వేల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం.
మిల్లుల వద్ద 12 గంటల్లోపు అన్ లోడింగ్ పూర్తి కావాలి
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, నేటి ధాత్రి:
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో ధాన్యం సేకరణపై వేబెక్ష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం అనుకున్న స్థాయిలో ధాన్యం సేకరణ జరగడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభంలో రోజుకు 5 వేల నుండి 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపిన ఆయన. ఇకపై ఆ వేగాన్ని పెంచి రోజుకు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సమయానికి లారీలు రావడం లేదని, వచ్చిన లారీలను కూడా సెంటర్ ఇంచార్జ్ లు కొన్ని నిర్దిష్ట మిల్లులకు మాత్రమే ఎక్కువగా పంపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల మిల్లుల వద్ద లారీలు గంటల తరబడి నిలిచిపోతున్నాయన్నారు. మండల తహశీల్దార్లు ప్రత్యేక బాధ్యత తీసుకొని, మిల్లుల వద్ద ఎక్కువ లారీలు నిలిచిపోయిన చోట త్వరితగతిన అన్ లోడింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలి. అదే విధంగా మిల్లుకు చేరుకున్న లారీలు 12 గంటల లోపు అన్ లోడింగ్ పూర్తి చేయాలని, ఒకవేళ 12 గంటల లోపు అన్ లోడింగ్ ప్రారంభం కాకపోతే, వెంటనే ఆ లారీలను ప్రత్యామ్నాయ అన్ లోడింగ్ పాయింట్లకు మళ్లించాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నుండి లారీలో ధాన్యం లోడింగ్ పూర్తి చేసి, 3 గంటల లోపు మిల్లుకు తరలించాలన్నారు. ఏ మిల్లుకు ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఎంత అన్ లోడింగ్ జరిగింది అనే రిపోర్టుతో పాటు, కొనుగోలు కేంద్రాలకు ఎన్ని లారీలు వస్తున్నాయనే పూర్తి వివరాలను రోజువారీగా ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో హమాలీల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, దాన్యం లోడింగ్, అన్ లోడింగ్ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు మూడు షిఫ్టులలో హమాలీలు పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లేదా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్డిఓ పిడి సన్యాసయ్య, డిఎస్ఓ మోహనబాబు, డిసిఓ ప్రవీణ్ కుమార్, డిఎం సివిల్ సప్లయస్ శ్రీధర్ రెడ్డి, డిఎంఓ నాగేశ్వర శర్మ, ఎఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
