పదేళ్లుగా చిన్న నిర్మాతలను తొక్కేస్తున్నారు.
తెలంగాణ వచ్చినా ఆ నలుగురే పెత్తనం సాగిస్తున్నారు.
తెలంగాణ సినిమా గొంతు నులిమేస్తున్నారు.
కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా ప్రదర్శనకు నోచుకోవడం లేదు.
పెద్ద సినిమాలను తలదన్నే చిన్న సినిమాలు తయారౌతున్నాయి.
దియేటర్లు లేక వెలుగులోకి రాకుండా పోతున్నాయి.
తెలంగాణ నుంచి ఎంతో టెక్నీషియన్లు వస్తున్నారు.
వారి ప్రతిభకు గుర్తింపు లేకుండా పోతోంది.
వారు పడిన కష్టం వృధా అవుతోంది.
ఆ నలుగురి గుప్పిట్లో నుంచి దియేటర్లు బైటపడాలి.
చిన్న సినిమాలకు మెయిన్ దియేటర్లు కేటాయించాలి.
ఓటిటి ఫ్లాట్ ఫామ్ అందడం లేదు.
చిన్న సినిమాకు శాటిలైట్ అవకాశం కూడా దక్కడం లేదు.
ఏడాదికి 300ల చిన్న సినిమాలు నిర్మాణం జరుగుతోంది.
అవి విడుదలకు నోచుకోక ప్రదర్శన జరగడం లేదు.
ప్రతి వారం చిన్న సినిమాలకు కనీసం 30 శాతం ధియేటర్లు కేటాయించాలి.
అప్పుడు చిన్న సినిమాల సత్తా తెలుస్తుంది.
తెలంగాణ సినిమా బతికి బట్టకడుతుంది.
తెలంగాణ సినిమా ఉజ్వల భవిష్యత్తును చూస్తుంది.
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
చిన్న సినిమాలను బతికించాలి.
అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే కంటెంట్ సినిమాలు తెలంగాణలో తయారౌతున్నాయి.
విడుదలకు నోచుకోక సినిమా చచ్చిపోతోంది.
చిన్న సినిమాను యూ ట్యూబ్‌లో కూడా తొక్కేస్తున్నారు.
తెలంగాణ సినిమాను ఆ నలుగురు కబంధ హస్తాల మధ్య నలిగిపోతోంది.
తెర మీద తెలంగాణ సినిమా వెలగలేకపోతోంది.
ఆ నలుగురే పరిశ్రమ కాదు. నలుగురు తమ కబంద హస్తాలలో బందించుకుంటే సరిపోదు. పరిశ్రమ అంటే పది మంది మాత్రమే కాదు. ఓ వంద మంది నిర్మాతలు ఎప్పుడూ సినిమా తీసే పరిస్తితి వున్నప్పుడే పరిశ్రమ అంటారు. ఓ వెయ్యి మంది కళాకారులు నిత్యం సినిమాలలో వేషాయలతో బిజీగా వున్నప్పుడే పరిశ్రమ అంటారు. లక్షల మందికి ఉపాధి కల్పించినప్పుడే దానిని పరిశ్రమ అంటారు. కాని నలుగురు సినీమా పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకొని పెద్ద సినిమా పేరుతో చిన్న సినిమాను తొక్కేస్తున్నారు. చిన్న సినిమా గొంతు నులిమేస్తున్నారు. సినిమా ఆడకుండానే చంపేస్తున్నారు. అసలు ధిjేటర్లు లేక అనేక సినిమాలకు దారి లేకుండా చేస్తున్నారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఆ నలుగురు సినిమా పరిశ్రమకు పట్టిన దరిద్రమైపోయారు. చిన్న సినిమా ఎదగకుండా చేస్తున్నారు. అంతే కాదు సినిమా పరిశ్రమనే నాశనం చేస్తున్నారు. ఏటా ఎన్ని సినిమాలు వస్తే అంత లాభం. ఎన్ని సినిమాలు ఆడితే పరిశ్రమ అంత కళకళలాడుతుంది. కాని తాము మాత్రమే సినిమాలు తీయాలి. తమ సినిమాలు మ్తాత్రమే ఆడాలి. తమ చేతుల్లోనే ధియేటర్లు వుండాలన్నట్లు వైకుంఠపాలిలో పాములుగా మారి చిన్న సినిమాలను మింగేస్తున్నారు. చిన్న నిర్మాతల జీవితాలను ఆగం చేస్తున్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు దూరారు. చిత్రపరిశ్రమకు శనిలా దాపురించారు. ఏటా తెలంగాణలో కూడా వందల సినిమాలు తయారౌతున్నాయి. అందులో పెద్ద సినిమాలు కేవలం ఐదో పదో మాత్రమే వుంటున్నాయి. కాకపోతే ఆ నలుగురు కొన్ని సినిమాలను సెలెక్టు చేసకుంటున్నారు. అక్కడ కూడా చిన్న నిర్మాతలను నిండా ముంచేస్తున్నారు. నిర్మాతగా పేరు వస్తే చాలన్న ఆలోచనలతో కూడా చాల మంది సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నారు. ఈ నలుగురి చేతిలో వాళ్ల సినిమాలు పెట్టి, దివాళా తీస్తున్నారు. అదే సినిమాలతో ఆ నలుగురు బతుకుతున్నారు. కనీసం ఆ సినిమాలు తీసిన నిర్మాతల పేరు కూడా బైటకు రాకుండా చేస్తున్నారు. ఇంతటి దుర్మార్గం ఎక్కడా వుండదు. అయినా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంటు కార్పోరేషన్ పదవిలో కూర్చున్న తర్వాతనైనా దిల్ రాజుకు దాని అర్దం పరమార్ధం తెలియనట్లుంది. చిన్న సినిమాలను ప్రోత్సహించాలి. వాటికి రాయితీలు కల్పించాలి. వాటిని ఆడిరచేందుకు అవసరమైన చొరవ తీసుకోవాలి. ధియేటర్లన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్న దిల్ రాజుకే ఆ పదవి ఇవ్వడం తెలంగాణ సినిమా మంచి రోజులు రావు. ఇదిలా వుంటే చెన్నైలో వున్న కుక్కిన పెనుల్లా వున్నవారికి హైదరాబాద్ రాగానే కొమ్ములొచ్చాయా? కళ్లు నెత్తికెక్కాయా? ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో స్ధలాలు తీసుకొని, పరిశ్రమను గుప్పిట్లో పెట్టుకొని ఆటలాడతామంటే చెల్లుతుందా? ఒకనాడు చిన్న సినిమాలు తీసుకుంటూ ఒక్కొమెట్టు పైకి ఎక్కిన వాళ్లే ఆ నలుగురు. ఉన్నఫలంగా అందలం చూసిన వాళ్లు కాదు. వారసత్వంతో నిలబడిన వాళ్లు ఇద్దరైతే, కష్టపడి ఎదిగిన ఇద్దరికి కూడా ఎందుకు కళ్లు నెత్తికెక్కాయి? ధనమొచ్చిన, మదమొచ్చును, మదమొచ్చిన మచ్చరంబు మరిమరి ఎక్కున్ అన్న సామెతను నిజం చేస్తున్నారు. కాని పెరుగుట విరుగుట కొరకే అన్నది సామెత నిజమైన నాడు పాతాలానికి పడిపోతుదు. పెద్ద సినిమాలు తీసి దివాలా తీసిన వాళ్లే ఎక్కువ. బాలకృష్ణతో పెద్ద సమరసింహారెడ్డి తీసిన నిర్మాత ఏమయ్యాడో తెలియంది కాదు? చిరంజీవితో ఘరానా మొగుడు నిర్మాత భవిష్యత్తు ఏమైందో చూసిన వాళ్లమే. అదే చిరంజీవితోటి మృగరాజు తీసిన నిర్మాత దివాళా తీసిన సంగతి తెలిసిందే. పెద్ద నిర్మాతలం, పేరున్న నిర్మాతలమని విర్రవీగితే కాలం ఎప్పుడో గుణపాఠం చెబుతుంది. పాతాళానికి తొక్కేస్తుంది. అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అనే విభజన చేయడమే తప్పు. గొప్పగా ఆడితే మంచి సినిమా. ఆడకపోతే పోయిన సినిమా. ఈ విషయాన్ని గతంలోనే దాసరి నారాయణ రావు పదే పదే చెబుతూ వచ్చేవారు. పరిశ్రమ భవిష్యత్తు ఆగమ్య గోచరమౌతుందని అనేకసార్లు హెచ్చరించారు. మంచి సినిమా వస్తే జనం గొప్పగా ఆదరిస్తారని చెప్పడానికి బలగం వంటి సినిమా నిదర్శనం. అయితే ఆ బలగం సినిమా దిల్ రాజు బ్యానర్ లో రావడం వల్ల నిలబడిరది. లేకుంటే ధియేటర్లు దొరక్క మూలన పడేది. కనీసం విడుదలకు కూడా నోచుకునేదో లేదో చెప్పలేం. అయితే తెలంగాణలో ఇప్పటికీ బలగం సినిమాను మించిన సినిమాలు అనేక తయారౌతున్నాయి. సినిమా మీద ఫ్యాషన్‌తో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నవారు ఎంతో మంది వున్నారు. ఎంతో మంది టెక్నీషియన్లు వస్తున్నారు. కొత్త కొత్త స్క్రిప్ట్‌లు తయారు చేస్తున్నారు. అవి ఎంత హృద్యంగా వుంటున్నాయో తెలంగాణ ముచ్చట్లు అని వెబ్ సిరీస్‌లు చూస్తేనే అర్ధమౌతోంది. తెలంగాణలో ఎంతోమంది గొప్ప నటులున్నారు. గొప్ప దర్శకులున్నారు. రచయితలున్నారు. వారందరి సినిమాలు వెలుగులోకి రావాలి. అవి ప్రదర్శింపబడాలి. తెలంగాణ నిర్మాతలు తీసిన ప్రతి సినిమాకు కొన్ని ధియేటర్లు ఖచ్చితంగా కేటాయించాలి. పెద్ద సినిమాలు లేకున్నా, ధియేటర్లును చిన్న సినిమాలకు ఇవ్వకుండా వేదిస్తున్న వారిమీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దొంగల చేతికే తాళాలిచ్చినట్లు దిల్ రాజు చేతికి ఫిల్మ్ డెవలప్ మెంటు కార్పొరేషన్ చేతిలో పెడితే ఆయన తెలంగాణ సినిమా ప్రేమికులకు అవకాశాలు కల్పిస్తారనుకోవడం భ్రమే అవుతుంది. ఇటీవల ఆయన చేసిన కామెంట్లు కూడా వివాదమయ్యాయి. తెలంగాణలో సినిమా ప్రేమికులు లేరన్న అర్ధమొచ్చేలా చెప్పడమే కాకుండా, తెలంగాణ వాళ్లు కళ్లు తాగే తాగుబోతులుగా చెప్పారు. మటన్ కోసం కొట్లాడకుంటారన్న అర్ధమొచ్చెలా చెప్పారు. అసలు అలాంటి అభిప్రాయం వున్న దిల్ రాజును పిల్మ్ డెవలప్ మెంటు కార్పోరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. ఆయన చేతుల్లో వున్న ధియేటర్లును విడిపించాలి. అప్పుడు తెలుస్తుంది. తెలంగాణ సినిమా అంటే ఏమిటో? కొత్త కొత్త నిర్మాతల అభ్యుదయ బావాలు ఎలా వుంటాయో తెలుస్తుంది. కొత్త కొత్త దర్శకులు ఇప్పటి తరానికి అవసరమైన గొప్ప సినిమాలు ఎన్ని చేస్తారో చూపిస్తారు. ఆంద్రా హీరోల కాళ్ల కాడ పడిగాపులు కాసే దిల్ రాజుకు, తెలంగాణ హీరోలు తయారు కావడం ఇష్టం లేదు. కేవలం తన వ్యక్తిగత ఎగుదల తప్ప మరో ఆలోచన దిల్ రాజుకు లేదన్నది అర్ధమైంది. తెలంగాణ వచ్చి పదేళ్లయినా, తెలంగాణ సినిమా బతకాలని దిల్ రాజు ఏనాడు కోరుకోలేదు. తెలంగాణ కళాకారులకు ప్రోత్సాహం కల్పించలేదు. కనీసం సినిమాలు తీయాలన్న ఆసక్తి వున్న చిన్న నిర్మాతలను ప్రోత్సహించలేదు. తన ధియేటర్లు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అందుకే సినిమా అన్నది మూడు రోజులకు పరిమితమైపోయింది. సినిమా గొప్పగా వుంటే ఎందుకు ఆడదో బలగం నిరూపించింది. తెలంగాణ పల్లెల్లో ప్రదర్శన జరిగింది. అలాంటి సినిమాలు తెలంగాణలో వందలు తయారౌతున్నాయి. కాని అవి ప్రదర్శనకు నోచుకోవడం లేదు. అంతే కాకుండా చిన్న సినిమాలకు ఓటిటి ఫ్లాట్ ఫామ్ కూడా అందడం లేదు. నెట్ ప్లిక్స్ లాంటి వాటిలో కూడా చోటు దక్కడం లేదు. దీనంతటికీ కూడా కారణం ఆ నలుగురే అని అందరూ చెబుతున్న మాట. చిన్న సినిమాలకు శాటిలైట్ కు కూడా అవకాశం దొరక్కపోవడం నిజంగా దుర్మార్గం. అందువల్ల తెలంగాణలో వున్న ధియేటర్లలో కనీసం 30శాతం ధియేటర్లు చిన్న సినిమాలకు ఖచ్చితంగా కేటాయించాలి. అప్పుడు తెలంగాణ సినిమాల సత్తా అందరికీ తెలుస్తుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, పల్లె జీవనాలు ఎంతో హృద్యంగా వుంటాయి. వాటిని చూసేందుకు తెలంగాణ సమాజం ఎప్పుడూ సిద్దంగా వుంటుంది. డెబ్బైఏళ్లుగా ఆంద్రా సినిమాను, ఆ యాసను, అక్కడి ఆచారాలను తెలంగాణ మీద రుద్దుతూ వచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే యాస, అదే మాట, అదే సినిమా తెలంగాణకు అవసరమా? ఏటా కనీసం 300 సినిమాలు తయారౌతున్నాయి. కాని వాటిలో కనీసం వంద కూడ విడుదలకు నోచుకోవడం లేదు. ఈ నలుగురు ఆశీస్సులుంటే తప్ప వాటికి ప్రదర్శన లేదు. అయిన హైదరాబాద్‌లో ఒక్క ధియేటర్ కూడా సినిమాకు ఇవ్వకపోవడమేమిటి? పెద్ద సినిమాలంటూ ధియేటర్లును చిన్న సినిమాలకు ఇవ్వకుండా పెద్ద సినిమాలు ఆడకపోయినా వాటిని ఇతర సినిమాలకు ఇవ్వడం లేదు. కొన్ని వందల మందిని పెట్టుకొని పెద్ద సినిమాలను ప్రమోషన్ చేసుకుంటూ చిన్న సినిమాను చంపేస్తున్నారు.