తెలంగాణ ఆణిముత్యం.. సురవరం

సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆణిముత్యమని, ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి 123వ జయంతి వేడుకలను గ్రంధాలయ సంస్థ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సురవరం ప్రతాపరెడ్డి నిజాంకాలంలోనే గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని గుర్తుచేశారు.

తెలంగాణలో కవులు లేరనే విమర్శను సవాల్‌గా స్వీకరించి 354మందితో గోల్కొండ కవుల సంకలనం ద్వారా మన మట్టి గొప్పతనాన్ని చాటారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక చరిత్రను సష్టించుకున్న సురవరం తెలంగాణ ఆణిముత్యమని కొనియాడారు. తెలంగాణలో తెలుగురాదని వాదన ఉన్న సమయంలో సురవరం గోల్కొండ పత్రిక స్థాపించి ప్రజాసమస్యలను పత్రికలో ప్రచురించి ప్రజలపక్షాన నిలిచారన్నారు. నిజాం నిరంకుశపాలన కాలంలోనే సురవరం తెలుగుపత్రికను స్థాపించి తెలంగాణవాణిని వినిపించారన్నారు.

సాంఘిక సంస్కర్తగా ఆయన బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలిచారని, రెడ్డిహాస్టల్‌ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఆయన రచనా సమగ్రాన్ని తెలంగాణ ప్రజలలోకి తీసుకెళ్లేందుకు తద్వారా సురవరం గౌరవాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. జిల్లా ప్రజాసంబంధాల అధికారి మామిండ్ల దశరథం మాట్లాడుతూ సురవరం బహుముఖ ప్రజ్ఞాశాలి అని, పత్రికా సంపాదకుడిగా, రచయితగా, గ్రంథాలయోద్యకారుడిగా, రెడ్డి హాస్టల్‌ నిర్వాహకుడిగా, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా విశేష కషి చేశారన్నారు. తెలంగాణలో సాహిత్య చైతన్యాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. గొల్కొండ పత్రిక, గొల్కొండ కవుల సంకలనంతోపాటు తొలి జానపద సాహిత్యాన్ని సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *