`రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా నిరూపణ
`హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి
`రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
`ఒకే ఒక్కడుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడుపుతున్న రేవంత్
`రేవంత్ లేకపోతే పార్టీకి మనుగడే కష్టం
`తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టను పెంచిన రేవంత్
అధిష్టానానికి అప్తుడు
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకోగానే కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముఖ్యంగా దావోస్ పర్యటనలో ఆయన రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొని రావడం గొప్పవిశేషమనే చెప్పాలి. గత ఏడాది రూ.40,232కోట్లు వచ్చాయి. దీంతో పోలిస్తే ఏకంగా నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడులు సాధించడం రేవంత్‌రెడ్డి సాధించిన గొప్ప విజయంగా నిలిచి పోయింది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో 49550 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈసారి ప్రభుత్వం 20 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 23వ తేదీ ఒక్కరోజే ప్రపంచం లోని ఐదు దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో 91,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం నిజంగా ఒక రికార్డు అనే చెప్పాలి. ఇక ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు తమ ప్రాంగణాలను హైదరాబాద్‌లో విస్తరించనున్నట్టు ప్రకటించాయి. రామ్‌కీ గ్రూపు రాష్ట్రంలో సమీకృత పారిశ్రామిక పార్క్‌లు, డ్రైపోర్టులు, టౌన్‌షిప్‌లపై పెట్టుబడులు పెట్టడానికి సానుకూలంగా వుండటం మరో సానుకూలాంశం.
పెట్టుబడుల్లో ప్రధానమైనవి
ఈ పెట్టుబడుల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గవి అమెజాన్ రూ.60వేల కోట్లు, సన్ పెట్రో కెమికల్స్ రూ.45వేల కోట్లు, టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15వేల కోట్లు. సాఫ్ట్‌వేర్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ విస్తరణ ద్వారా 17వేలు, హెచ్‌సీఎల్ విస్తరణతో 5వేలు, విప్రో విస్తరణతో 5వేలు కొత్తగా ఉద్యో గాలు లభించనున్నాయి. అమెజాన్, టిల్మన్, సిఆర్‌ఎల్‌ఎస్ సంస్థలు తమ డేటా సెంటర్ల విస్తరణ ద్వారా తెలంగాణకు గొప్ప ప్రయోజనం చేకూరనుంది. సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, యుద్ధ విమానాల ఇంటీరియర్ డిజైన్, యు.ఎ.వి. తయారీ మరియు రక్షణరంగంలో జిందాల్ పెట్టుబడులు రానున్నాయి.
కొత్త రంగాలపై దృష్టి
ప్రస్తుతం తెలంగాణ ఐ.టి, ఫార్మా రంగాలకు హబ్‌గా వెలుగొందుతోంది. ఇప్పుడు డేటాసెంటర్లుగ్రీన్ ఎనర్జీ, ఆహారశుద్ధి, విద్యుత్ వాహనాలు, సెమికండక్టర్స్ వంటి రంగాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. కోవిడ్ మహమ్మారి తర్వాత సరఫరా శృంఖలాలు దారుణంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకు అదనంగా సరఫరా శృంఖలాలను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ తీవ్రంగా కృషిచేస్తోంది. అంతేకాదు ఒక ట్రిలియన్ ఎకానమీని సాధించేదిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్ మరియు రీజినల్ రింగ్ రోడ్డు మధ్యప్రాంతాలను సెమీ అర్బన్ జోన్‌గా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని, ఔటర్ రింగ్‌రోడ్డు దిగువ భాగంలో సేవారంగానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇక రీజినల్ రింగ్ రోడ్డుకు ఆవలి ప్రాంతాల్లో వ్యవసాయం మరియు ఆహారశుద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మౌలిక సదుపాయాలు, సమీకరణ, అవకాశాలు, సుస్థిరత అనేవి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన లక్ష్యాలు. మెట్రోరైల్ విస్తరణ, రీజినల్ రింగ్ రైల్వే, రేడియల్ రోడ్లు, కొత్త విమానాశ్రయాలు, మూసీనది పునరుద్ధరణ, విద్యుత్ వాహనాలకు ప్రో త్సాహం, స్కిల్ యూనివర్సిటీ వంటివి ప్రభుత్వ ప్రాధాన్యతలుగా వున్నాయి.
ఎదురులేని నేత
అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో పార్టీలో, రాష్ట్రంలో తనకు ఎదురులేదని నిరూపించుకోవ డంలో విజయం సాధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి తగినన్ని స్థానాలు సంపాదించి పెట్టడంలో కృతకృత్యులయ్యారు. పార్టీలో తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా విపక్ష పార్టీలపై ఒంటరిగానే ఎంతో నైపుణ్యంతో ఎదురుదాడులకు దిగుతూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల తర్వాత ఇక రేవంత్ హైదరాబాద్ విస్తరణపై దృష్టి సారించి ఫోర్త్ సిటీని ఏర్పాటును ప్రకటించారు. నగరంలో ఆక్రమణలను తొలగించడం, పర్యావరణ పరిరక్షణకోసం ఏర్పాటు చేసిన హైడ్రా కార్యకలాపాలతో వచ్చిన కొన్ని వివాదాలు ఇబ్బంది పెట్టినా వెనుకడుగు వేయలేదు. ఈ ఏడాది పైచిలుకు కాలంలో రెండుసార్లు దావోస్ సమావేశాలకు హాజరు, అమెరికా మరియు దక్షిణ కొరియాల్లో జరిపిన పర్యటనలను అ త్యంత విజయవంతమైన విదేశీ పర్యటనలుగా చెప్పాలి. గత ఏడాది దావోస్, అమెరికా, దక్షిణ కొరియాల్లో జరిపిన పర్యటనల ద్వారా రాష్ట్రానికి రూ.80వేల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలి గారు. ఈసారి దావోస్ పర్యటనలో ఏకంగా రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను సాధించారు. ఇవన్నీ ఆయన పనితీరుకు, పాలనా సాఫల్యతకు ప్రత్యక్ష నిదర్శనాలు.
కేంద్రంతో సమతుల్యంగా…
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. యువతలో విద్య తో పాటు నైపుణ్యాలను కూడా పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. కేంద్రంతో సత్సంబంధాల విష యంలో గత కె.సి.ఆర్. ప్రభుత్వం కంటే రేవంత్ ఎంతో నైపుణ్యంతో, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా రు. కేంద్రం సహాయం లేకుండా ప్రభుత్వ మనుగడ కష్టమన్న సంగతి రేవంత్‌కు బాగా తెలుసు. కేంద్రంలో భాజపా సర్కార్ పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకి. మరి తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరపడమంటే కత్తిమీద సామే. ఈ విషయంలో ఆయన తె లంగాణ అభివృద్ధి, ప్రయోజనాల విషయంలోకి రాజకీయాల ప్రసక్తి లేకుండా ఆచితూచి వ్యవహ రిస్తున్నారు. రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమన్న రీతిలో ఆయన వ్యవహారశైలి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆయన కాళేశ్వరం, గత ప్రభుత్వం ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంతో జరిపిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, ఫార్ములా ఈ`రేస్‌లో జరిగిన అవకతవకల విషయంలో విచారణలు, విచారణ కమిషన్లు వేయడం వంటివి బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికే. సంధ్య ధియేటర్ తొక్కిసలాటపై అసెంబ్లీలో రేవంత్ చేసిన భావోద్వేగ ప్రసం గం అందరినీ కదిలించి వేసింది. టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కోర్టుకూడా రేవంత్ వైఖరికే మద్దతు పలికింది. రేవంత్ అనుసరించిన స్పష్టమైన వైఖరి, టాలీవుడ్‌ను కాళ్లబేరానికి తీసుకొచ్చింది.
రేవంత్ ప్రాధాన్యతలు
ప్రస్తుతం ఆయన ప్రధాన ప్రాధాన్యతలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసు కెళ్లడం. హెల్త్‌కేర్ కేపిటల్‌గా, వంటకాలకు కేంద్రంగా, క్రీడారంగంలో తలమానికంగా, పెట్టుబడిదార్లకు స్వర్గధామంగా మలచడం ఆయన ప్రధాన లక్ష్యాలు. పెట్టుబడిదార్లను ఆకర్షించడంలోభాగమే, హైడ్రా ఏర్పాటు, మూసీనది పునరుద్ధరణ కార్యక్రమాలు.
మొత్తంమీద చెప్పాలంటే రేవంత్ ఏడాది పైచిలుకు పాలన సమర్థవంతంగా సాగిందనే చెప్పాలి. ఆయన కాకుండా మరే ఇతర కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి అయినా ఈస్థాయి సుస్థిరత సాధించడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు అటువంటివి. అన్నింటా తానై, ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగుతుండబట్టే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత బాగా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం రేవంత్ పరిపాలనా దక్షతేనన్నది మాత్రం ముమ్మాటికీ నిజం!