పరువుతీస్తున్న ప్రైవేట్ పిఎలు
ఓ ప్రభుత్వ కార్యాలయం వెళ్లాలంటే అధికారి కంటే ముందు అక్కడ పనిచేస్తున్న అటెండర్‌ను ప్రసన్నం చేసుకోవాలి. అలా అయితేనే పని జరుగుతుంది లేదంటే అంతే సంగతులు. ఆ కార్యాలయంలో ఏ వ్యవహారం గూర్చి సమాచారం. కావాలన్న వారే సమస్తం. ఇది ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి. మరీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీస్తే అచ్చం ప్రభుత్వ కార్యాలయాలలాగే ఉంది. ఇక్కడ మాత్రం సూటు…బూటు వేసుకుని చేతిలో రెండు, మూడు సెల్‌ఫోన్లు, ఓ డైరీ, ఏవో కాగితాలు పట్టుకుని ఎమ్మెల్యేల వెనకాలో, మంత్రుల వెనకాలో అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్లు వీరి కంటే ఎక్కువ గర్వంతో దర్పం ఒలకబోసే పిఎలను ప్రసన్నం చేసుకోవాలి. సరిగ్గా చెప్పాలంటే మీకు ఏ పని కావాలన్న వీరిని మచ్చిక చేసుకోవాలి. వీరు ఏ స్థాయి వరకు ఎదిగిపోయారంటే కొన్ని సందర్భాల్లో తాము పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి ఎదిగిపోయారని ప్రచారం జరుగుతోంది. అందిన కాడికి దండుకునే స్థాయికి ఎదిగిపోయిన ఈ ప్రైవేట్ పిఎలు ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్న కొందరికీ వీరిని వదులుకోవడానికి మనసు రావడం లేదట. తమ వ్యక్తిగత రహాస్యాలు ఎక్కడ బయటపడతాయనో కొందరు వీరిని భరిస్తుంటే, తమ వ్యక్తిగత దందాలు చేసేవారు ఎవరు ఉండరని కొందరు భరిస్తూ వస్తున్నారట. ఇంకొందరు ప్రజాప్రతినిధులైతే నా పదవి, పరపతి ఉపయోగించి ఏదైనా చేయండి మేం చూసుకుంటాం ఫిఫ్టీ…ఫిఫ్టీ అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారట. దీంతో ఈ ప్రైవేట్ పిఎలకు అడ్డూ…అదుపు లేకుండా పోయింది. అవసరమైతే ఉద్యోగం పోతుంది. ఇంతకుమించి అయ్యోదేముంది…? సంపాదనే ధ్యేయంగా పనిచేస్తే సరిపోతుందని ఇష్టారీతిన వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీఎం కట్టడి చేసినా…!
మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతరుల పిఎల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కట్టడి చేసే ప్రయత్నం చేసినా ప్రజాప్రతినిధులు మాత్రం వినడం లేదు. పిఎల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలని చెప్పినా విన్నట్లే విని వారికి తోచిన వారిని పిఎలుగా నియమించుకుని తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అధికారికంగా కొంత సిబ్బందిని కేటాయించిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలైతే అదనంగా నలుగురు, ఐదుగురిని తమ పిఎలుగా నియమించుకున్నారు. వీరు మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పనిచేస్తున్నామని అన్ని వ్యవహారాల్లో తలదూర్చుతున్నట్లు తెలుస్తోంది.
పిఎ షరతుకు తలొగ్గిన సీనియర్ మంత్రి…?
టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా కొనసాగుతూ శాఖ మారిన రెండోసారి మంత్రి పదవి దక్కించుకున్న ఓ సీనియర్ మంత్రి తన వద్ద గతంలో పనిచేసిన పిఎ షరతుకు తలొగ్గి మరోమారు పిఎగా నియమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో పనిచేసినప్పుడు ఈ పిఎ ఎన్నికల సమయంలో సీనియర్ మంత్రికి మూడున్నర కోట్ల రూపాయల ఎన్నికల లెక్క చూపలేదట. దీంతో కోపం వచ్చిన సీనియర్ మంత్రి రెండోసారి పిఎగా తీసుకోవడానికి ససేమిరా అన్నాడట. అయితే గతంలో ఓ మంత్రి వద్ద పిఎగా పనిచేసిన వ్యక్తితో కలిసి సీనియర్ మంత్రిని కలిసి తమరి వ్యక్తిగత పనులు, డబ్బుల వ్యవహారం, భూముల వ్యవహారం, సెటిల్‌మెంట్లు అన్ని తామే చూసుకుంటామని, తమరి చేతికి మట్టి అంటకుండా పనిచేసి పెట్టి ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉంచుదామని నమ్మబలకడంతో ఈ ఇద్దరిని సీనియర్ మంత్రి పిఎలుగా నియమించుకుని వ్యవహారం నడిపిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. సీనియర్ మంత్రికి సంబంధించిన సంపాదన, ఆర్థిక విషయాల్లో వీరు జోక్యం చేసుకుని పనులు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు పిఎల్లో ఓ పిఎ గతంలో ప్రముఖ మీడియా చానల్లో జర్నలిస్టుగా పనిచేశాడు. ఆ పరిచయాలతో తనకు భారీ లాభం చేకూర్చుతాడని తన జోక్యం లేకున్నా బద్నాం కాకుండా వెనకేయవచ్చని సీనియర్ మంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రైవేట్ పిఎల వ్యవహారం అటు పార్టీకి, ఇటు ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో తలదూర్చి సర్వం తామే అన్నట్లు వ్యవహారించే ఈ పిఎల వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధిని కలవడం దగ్గర నుంచి అన్ని విషయాల్లో వీరి చేతివాటం విమర్శలకు గురి అవుతుంది. ఎంతైనా ప్రభుత్వం వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.