ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా సహించేది లేదు..

అర్హత కలిగినవారందరికీ ఇళ్లు, కార్డులు రావాల్సిందే..

అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు..

పదేళ్లలో రోడ్ల కోసం బీఆర్ఎస్ ఇచ్చింది రూ.93 కోట్లు..

ఏడాదిలో నేను తెచ్చింది రూ.200 కోట్లు..

చెప్పింది చేస్తా.. చేయగలిగిందే చెప్తా..

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరులో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా తాను సహించేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికీ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరైయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులదేనని స్పష్టం చేసారు.
ప్రజాపాలనలో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో అనిరుధ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికీ కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, గుడిసెలు కన్పిస్తున్నాయని చెప్పారు. వీరిలో కొంత మంది ఇళ్లు లేకపోగా, మరికొంత మందికి రేషన్ కార్డులు లేవని, ఇంకొంత మందికి ఇళ్లూ, రేషన్ కార్డులు రెండూ కూడా లేవని తెలిపారు. ప్రస్తుతం అలాంటి వారందరి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇళ్లు లేని పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికీ రేషన్ కార్డును కూడా అందించాలన్నారు. రేషన్ కార్డు కేవలం బియ్యం తీసుకోవడానికి మాత్రమే కాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో లబ్ది పొందడానికి ప్రాతిపదికగా ఉంటోందని గుర్తు చేసారు. ఈ కారణంగానే అర్హత కలిగిన పేద కుటుంబాలకు రేషన్ కార్డు రాకపోతే వారు అన్ని విధాలుగా నష్టపోయే అవకాశం ఉంటుందని వివరించారు. అందుకే అర్హత కలిగిన పేదల్లో ఏ ఒక్కరికి కార్డు రాకపోయినా తాను సహించనని పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు గ్రామ సభలలో ముందుండి అర్హత కలిగిన వారందరి పేర్లు జాబితాలలో రాయించాలని సూచించారు. రాజకీయ కారణాలు, వ్యక్తిగత విబేధాల కారణంగా అర్హత కలిగిన పేదలకు అన్యాయం చేయకూడదని హితవు చెప్పారు. రాజకీయ విబేధాలు ఉంటే వాటిని ఎన్నికల సమయంలో చూసుకోవాలే తప్ప సంక్షేమానికి ముడి పెట్టకూదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ పార్టీకి ఓటు వేస్తేనే ఏ పథకమైనా ఇస్తామని ప్రజలను బెదిరించారని, కేవలం రాజకీయ కారణాలతో ఎంతో మంది అర్హులకు అన్యాయం చేసారని విమర్శించారు. తమ ప్రజా ప్రభుత్వంలో అలాంటి వివక్ష ఉందడన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటి వరకూ రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలు సరికాదని చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ నుంచే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైయిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. పదేళ్ల టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలకు ఇచ్చింది రూ.93 కోట్లు కాగా, ఏడాది కాలంలోనే తాను తీసుకొచ్చింది రూ.200 కోట్లు అని ప్రస్తావించారు. జడ్చర్లకు రావాల్సిన రూ.30 కోట్ల ముడా నిధులను తమ కమీషన్ల కోసం మహబూబ్ నగర్ కు మళ్లించి, జడ్చర్లకు తీరని ద్రోహం చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికీ, బీఆర్ఎస్ నేతలకూ అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం మంజూరైన ముడా నిధులలో గతంలో లక్ష్మారెడ్డి కారణంగా నష్టపోయిన గ్రామాలకు ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ చెరువు కట్టను నీటిపారుదల శాఖ నిధులతో మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామని హామీ ఇచ్చారు. తమకు ఏం కావాలో ప్రజలు అడిగితే అది తాను చేయగలనోలేదో చెబుతానని, చేస్తానని మాట ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పారు. తాను చేయలేని పనులు చేస్తానంటూ బూటకపు హామీలు ఇవ్వనని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేసారు. గురువారం ఆయన జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్, మల్లెబోయినపల్లి, జడ్చర్ల మున్సిపాలిటీలోని నిమ్మబావిగడ్డ తదితర ప్రాంతాల్లో జరిగిన గ్రామ, వార్డు సభలలో పాల్గొన్నారు.

ఫోటోవార్త: నస్రుల్లాబాద్ లో జరిగిన గ్రామ సభలో ప్రసంగిస్తున్న అనిరుధ్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!