Minister Jupally Pays Tribute to Martyr Constable Soumya
గాంధీ ఆస్పత్రిలో కానిస్టేబుల్ సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి నివాళి
సౌమ్య కుటుంబ సభ్యులకు మంత్రి పరామర్శ
సౌమ్య కుటుంబానికి ‘కోటి’ ఎక్స్గ్రేషియా
సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం.. సౌమ్య సర్వీస్ కాలానికి ప్రభుత్వ వేతనం చెల్లిస్తాం
దుండగుల వెన్ను వణికేలా కఠిన చర్యలు.. పరిశీలనలో ఎక్సైజ్ కు ఆయుధాల కేటాయింపు
సౌమ్య కుటుంబానికి ఒక్క రోజు వేతనాన్ని అందజేస్తామని ప్రకటించిన ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది
హైదరాబాద్ నేటి ధాత్రి:
విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్య లేని లోటు భర్తీ చేయలేనిదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, సౌమ్య సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు
ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, తమ సహచరిని కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయం అని అన్నారు.
ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్ను వణికించేలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం తమ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి రెండు నిముషాల మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఖురేషి,
ఉప కమిషనర్లు జె.హరికిషన్, అంజన్ రావు, చంద్రయ్య, ప్రదీప్ రావు, కృష్ణ ప్రియ, డి.శ్రీనివాస్, నవీన్ కుమార్, అంజిరెడ్డి, సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, తెలంగాణ ప్రొహిబిషన్ & ఆబ్కారీ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు టి.లక్ష్మణ్ గౌడ్, కార్యదర్శి చంద్ర శేఖర్ , విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, భరత్, ఏడుకొండలు, ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం కృష్ణ, మధుబాబు, కానిస్టేబుల్ సంఘం అధ్యక్షుడు పి.రాజిరెడ్డి, నాగరాజు, అనంత్ రెడ్డి, మల్లేష్ తో పాటు సుమారుగా 500 మంది ఆబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు.
