Farmers Lock Narsampet Market
మక్కల కొనుగోళ్లు నిలిపివేతపై నర్సంపేట మార్కెట్కు తాళం వేసిన రైతులు
కలెక్టర్ వచ్చి కొనుగోళ్లు పూర్తిచేస్తేనే ధర్నా విరమిస్తాం: ఆందోళనలో రైతులు
నర్సంపేట, నేటిధాత్రి:
అమ్మకాల కోసం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కు మొక్కజొన్నల రైతులకు కన్నీళ్లు మిగులుతున్న పరిస్థితి ఎదురవుతున్నది. గురువారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన వేల కింటల్లా మొక్కలు తడిసి ముద్దయ్యాయి.
మార్కెట్లో మక్కల నిల్వలు ఉన్నాయని చెబుతూ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం నర్సంపేట మార్కెట్కు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మక్కల కొనుగోళ్లు చేపట్టాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అమ్మకానికి తెచ్చిన మక్కలు తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.వరంగల్ జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి ఈ రోజే మక్కల కొనుగోళ్లు పూర్తిచేస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు.నర్సంపేట మండలం బాంజీపేట గ్రామానికి చెందిన రైతులు కట్ల ఇంద్రారెడ్డి,భూషబోయిన రమేష్ మాట్లాడుతూ మార్క్ పెడ్ సహకారంతో మద్దతు ధరతో ప్రభుత్వం మక్కలు కొనుగోళ్ళు చేస్తున్నారని గత రెండు వారాల క్రితం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కు మక్కజొన్నలు తెచ్చామని తెలిపారు.ఈ నెల 2 నుండి కొనుగోళ్ళు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నాటినుండి జొన్నలవద్ద రాత్రిపగలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని అన్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో వారం రోజులుగా కొనుగోళ్లు నిలిపివేశారని, 20 రోజులుగా మార్కెట్లో పడిగాపులు పడుతున్నామని మరికొంత మంది బాధిత రైతులు తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్, మార్క్ఫెడ్ అధికారులు, మార్కెటింగ్ అధికారులు స్పందించి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మక్కలను కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
