వ్యాపారుల కబంధహస్తాల్లో ఎనుమాముల మార్కెట్

కనీస ధర రాక నిండా మునుగుతున్న మిర్చి రైతులు

కేంద్ర నూతన మార్కెటింగ్ చట్టం అమలయితే రైతుల పరిస్థితి అధోగతే

మిర్చికి క్వింటా కనీస మద్దతు ధర 25 వేల రూపాయలు ప్రకటించాలి

మార్క్ ఫెడ్, నాఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి

రైతుల పంటలను దోచుకునే మార్కెట్ దోపిడిని అరికట్టాలి

ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ సోమిడి శ్రీనివాస్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను మార్కెట్ మాయాజాలంలో దోపిడి చేస్తూ నిండా ముంచుతున్నారని ఆరోపించారు. వ్యాపారుల కబంధహస్తాల్లో మార్కెట్లు నడుస్తున్నాయని వారికి మార్కెట్ అధికారులు అండగా నిలుస్తున్నారని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మండిపడ్డారు.
శుక్రవారం అఖిలభారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్), తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి రైతుల పంటల కొనుగోలు పరిస్థితి, కనీస వసతులు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్,సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏనుమాముల మార్కెట్ రైతుల పంటల దోపిడీకి అడ్డగా మారి రైతుల పంటలను చేస్తున్నారని వ్యాపారుల కనుసనల్లో మార్కెట్ వ్యవస్థ నడుస్తున్నదని వ్యాపారులందరు సిండికేటయ్యి వారి లాభాల కోసం పంటల ధరలను నిర్ణయిస్తూ జెండా పాట పెడుతున్నారని ఆరోపించారు.వాటిల్లో కనీసం ఆ జెండా పాట అయినా రైతులందరికీ ఉత్పత్తులకు వర్తింప చేయకుండా కుంటిసాకులతో మోసం చేస్తున్నారని తామే మార్కెట్ వ్యవస్థ అన్నట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వారికి మార్కెటింగ్ అధికారులు అండగా నిలుస్తున్నారని రైతు సంఘాలు రైతులకు అండగా నిలవకుండా మార్కెట్ సందర్శించకుండా అనేక ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో మిర్చి రైతులు ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండించి మార్కెట్కు తీసుకువస్తే అంతర్జాతీయంగా మిర్చి పంటకు డిమాండ్ ఉన్న ఎనుమాముల మార్కెట్లో మాత్రం కేవలం క్వింటాకు 13,400 రూపాయల జెండా పాట పాడి ఆచరణలో ఎనిమిది వేలకు మించి కొనుగోలు చేయడంలేదని తెలిపారు. దీంతో రైతులకు కూలీలకు సరిపడా డబ్బులు సైతం వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని అమలు చేస్తే రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మార్క్ ఫెడ్,నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయించి కనీస మద్దతు ధర కింటాకు 25వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. మార్కెట్లో కనీస వసతుల సదుపాయాలను మెరుగుపరచాలని మార్కెట్ దోపిడిని అరికట్టి శాస్త్రీయ పద్ధతిలో పంటల ధరల నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక మార్కెట్ కార్యదర్శి పోలేపాక నిర్మలకు పలు డిమాండ్ లతో కూడిన మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండి ఇస్మాయిల్, సహాయ కార్యదర్శి గోనె రామచందర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓదెల రాజన్న,జిల్లా కోశాధికారి ఊరటి హంసల్ రెడ్డి, ఏఐకేఎఫ్ జిల్లా నాయకులు ఐతమ్ నాగేష్, జక్కుల అశోక్జి అప్పనపురి నరసయ్య, మాలి ప్రభాకర్, పరిమళ గోవర్ధన్, రాజు, ఊకంటి గోపాల్ రెడ్డి, లడె మోహన్ రావు, బొల్లు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!