క్రమంగా పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు

`ఇప్పటికీ మహిళల ఆత్మహత్యలే అధికం

`స్త్రీపురుషుల ఆత్మహత్యలు పెరిగితే సమాజానికి నష్టం

`గృహహింసను అరికట్టేందుకు మరో మార్గం అవసరమేమో?

`మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరం

`ఆధిపత్య ధోరణే అనర్థాలకు మూలం

`ఆనందం కావాలంటే కుటుంబంలో ప్రేమ అవసరం

`ప్రేమ మాత్రమే కుటుంబాన్ని బంధించే బలీయమైన బంధం

`అహంకారాన్ని వదిలేస్తే మిగిలేది సంతోషమే

`దీన్ని గుర్తిస్తే జీవితం స్వర్గమయం లేదంటే నరక ప్రాయం
హైదరాబాద్‌,నేటిధాత్రి:
వైవాహిక సంబంధాల సమస్యల కారణంగా ఏటా సగటున మనదేశంలో లక్షమంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం బెంగళూరులో అతుల్‌ సుభాష్‌ (35) ఆ త్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సోషల్‌మీడియామరియు టెలివిజన్‌ యాంకర్లు పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కథనాలు రూపొందించడం, ప్రసారం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా పురుష హక్కుల కా ర్యకర్తలు (మెన్స్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌) ఈ పెరుగుతున్న ఆత్మహత్యలకు దేశంలో లింగ వివక్షతో కూడి, స్త్రీ అనుకూల చట్టాలే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ న్యాయసం హిత (బీఎన్‌ఎస్‌)లోని 85, 86 సెక్షన్లను (పూర్వపు ఇండియన్‌ పీనల్‌కోడ్‌లోని 498ఎ సెక్షన్‌)ను ‘లింగ తాటస్త్యం’ (జండర్‌ న్యూట్రల్‌)గా మార్పు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మహిళలపై, భర్త మరియు అతని కుటుంబ సభ్యులు పాల్పడే గృహహింసకు సంబంధించి ఈ సెక్షన్లను రూపొందించారు. ‘స్త్రీవాదం’, ‘మహిళా సాధికారత’ అనేవి ఇప్పుడు వికృతస్థాయికి చేరుకొని,ఏకంగా భార్యలే, భర్తలను ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పే దశకు సమాజాన్ని తీసుకెళ్లాయని వారు గగ్గోలు పెడుతున్నారు.
అయితే భారత ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వీరు చెబుతున్న అంశాలకు భిన్నంగా వుండటం గమనార్హం. ఇప్పటికీ దేశంలో సింహభాగం మహిళలు తీవ్ర వివక్షకు గురవుతూనే వున్నారని ప్ర భుత్వం వాదిస్తోంది. లైంగిక దాడులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, బహిరంగ ప్రదేశాల్లోమహిళల వేధింపులు, గృహహింస, వరకట్నహత్యలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే దేశంలో మహిళలపై జరిగే హింసాత్మక సంఘటల్లో పెద్దగా మార్పు లేదన్న సంగతి స్పష్టమవు తుంది.
ఆత్మహత్యలకు కారణాలు
పరిశీలిస్తే సాధారణంగా ఆత్మహత్యలకు ఏదో ఒక్క బలీయమైన అంశం మాత్రమే కారణంగా వుంటుంది. సామాజిక, సాంస్కృతిక, వ్యవస్థీకృత మరియు ఆర్థిక కారణాలు ఇందుకు ప్రేరేపిస్తా యి. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌.సి.ఆర్‌.బి) రికార్డులను పరిశీలిస్తే పై కారణాల్లో ఏదో కొటి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్‌.సి.ఆర్‌.బి. డేటాను పరిశీలిస్తే ఈ ఆత్మహత్యల సంఘటనల విషయంలో విభిన్న పోకడలు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
2015-22 మధ్య కాలంలో అంటే ఎనిమిదేళ్ల కాలంలో ఏటా సగటున 1,01,188 మంది పు రుషులు ఆత్మహత్యలకు పాల్పడితే, 43,314 మంది మహిళలు మాత్రమే బలవన్మరణాలకు గురికావడం గమనార్హం. ప్రతి లక్షమంది పురుషుల్లో ఈ ఆత్మహత్యల రేటు 14.2% వుంటే, మహిళల్లో ప్రతి లక్షమందికి 6.6%గా వుంది. భారత్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలే! మొత్తం ఆత్మహత్యల్లో ఈ కారణంగా జరిగే ఆత్మహత్యలు 23.06%గా వుంటున్నాయి. అయితే ఈవిధంగా ప్రేరేపిస్తున్న కుటుంబ సమస్యలేంటో ఎన్‌.సి.ఆర్‌.బి. స్పష్టంగా నిర్వచించలేదు. ఫలితంగా వీటిపై ఎవరికి అనుకూలమైన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. ఆత్మహత్యలకు రెండో అతిపెద్ద కారణం అనారోగ్యం. దీనివల్ల 23% ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
వైవాహిక సంబంధాలు
ఇక ఆత్మహత్యలకు కారణాల్లో వైవాహిక సంబంధాలు మూడోస్థానం ఆక్రమిస్తున్నాయి. వీటివల్ల పురుషుల్లో 3.28%, మహిలల్లో 9.66% ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. ఈ వైవాహిక సంబంధ ఆత్మహత్యలను ఎన్‌.సి.ఆర్‌.బి ఐదు సబ్‌గ్రూపులుగా విడగొట్టింది. అవి వరుసగా పెళ్లి కు దరకపోవడం, వరకట్న వివాదాలు, వివాహేతర సంబంధాలు, విడాకులు మరియు ఇతరాలు. ఈ సమస్యల కారణంగా ఈ ఎనిమిదేళ్ల కాలంలో (2015`22) 26,588మంది పురుషులు, 33,480మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటిల్లో మహిళల్లో అత్యధిక సంఖ్యాకులు (14,250) మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం వరకట్నం! ఇక పురుషుల్లో పెళ్లి కుదరకపోవడం అత్యధిక ఆత్మహలకు (10,119) కారణమవుతోంది. ఇక్కడ పెళ్లి కుదరక పోవడం అనేదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. అంటే అవివాహితులని అర్థం. తప్పుడు వాగ్దానాలు, మోసం లేదా ఆర్థికపరమైన దోపిడీ, వరకట్న డిమాండ్‌లు, బెదిరిపుంలు లేదా వేధింపులు వంటి కారణాలవల్ల వివాహం కాకపోవడం లేదా రద్దు జరిగినప్పుడు ఈ పెళ్లి కుదరక పోవడం అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. 2015`22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 8,09,506 మందిపురుషులు ఆత్మహత్యలు చేసుకో గా వీరిలో రైతులు, రైతు కూలీల సంఖ్య 10%అంటే81,402. రైతుల్లో ఆత్మహత్యలకు ప్రధాన కారణం పంటలు దెబ్బతినడం. ఇక ఇందులో సబ్‌ కేటగిరీలేమీ లేవు.
ప్రమాదకరమైన పద్ధతులు
ఒక పరిశోధనా పత్రం ప్రకారం పురుషులు ఆత్మహత్యలకు అత్యంత ప్రమాదరకరమైన పద్ధతు లు అనుసరిస్తే, స్త్రీలు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ఉన్నంతలో త్వరగా, తక్కువ క ష్టంతో ప్రాణంపోయే పద్ధతులను అనుసరిస్తున్నట్టు తేలింది. పురుషులో ఎంచుకునే ప్రమాదకర మైన విధానాల్లో రైలుకింద పడటం, సజీవదహనం వంటివి వుంటున్నాయి. ఇటువంటి కేసుల్లో తిరిగి బతికే అవకాశాలు చాలా తక్కువ. ఆత్మహత్యలకు పాల్పడానికి స్త్రీపురుషులు అనుసరించే విధానాల్లో తేడాలను స్పష్టంగా అవగాహన చేసుకుంటే, ఆత్మహత్యలనుంచి వారిని కాపాడే వ్యూ హాల్లో మార్పుల తేవడం లేదా కొత్త వ్యూహాలను అనుసరించడం చేయవచ్చు. నిద్రమాత్రలు, నీళ్ల లో దూకడం, విషం తాగడం వంటి ప్రక్రియల ద్వారా పదిమంది మహిళల్లో మరణాలు సంభవిస్తే, ఇవే పద్ధతుల్లో మరణించే పురుషుల సంఖ్య 21గా (10:21)గా వుంటోంది. ఇక వాహనాల కింద మరణించేవారి నిష్పత్తి 10:65 కాగా విద్యుత్‌ షాక్‌ వల్ల సంభవించే మరణాలు 10:35గా వుంటున్నాయి. ఈ నిష్పత్తులను పరిశీలిస్తే అధికశాతం మంది పురుషులు ఆత్మహత్యలకు మరింత హింసాత్మక పద్ధతులను అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిలో మరణాలరేటు అధికంగా నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో పురుషుల్లో ఆత్మహత్యలను నివారించ డం ఒక సవాలుగా మారింది.
498ఎ సెక్షన్‌
ఇండియన్‌ పీనల్‌కోడ్‌లో 498ఎ సెక్షన్‌ను ప్రభుత్వం 1983లో చేర్చింది. వైవాహిక పరమైన హింసనుంచి మహిళలకు రక్షణ కల్పించడమే ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టడం యొక్క ముఖ్యోద్దేశం. ముఖ్యంగా మహిళలపై భర్త, అతని కుటుంబ సభ్యులు, వేధింపులకు పాల్పడటం, భౌతిక హిం సలనుంచి రక్షణకల్పించడానికి ఈ సెక్షన్‌ను చేర్చారు. మరోరకంగా చెప్పాలంటే పితృస్వామ్య వ్య వస్థలో మహిళలకు రక్షణ కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. తర్వాత ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లో ఈ సెక్షన్‌ను రెండుగా అంటే 85,86గా విడగొట్టారు. 85వ సె క్షన్‌ భర్త లేదా అతని బంధువు, హింసకు పాల్పడటాన్ని పేర్కొంటే, 86వ సెక్షన్‌ పాల్పడే వివిధ రకాల హింసల వివరాలను తెలియజేస్తుంది. ఏటా 498ఎ సెక్షన్‌ కింద లక్ష కేసులు నమోదవు తున్నాయి. ఎన్‌.సి.ఆర్‌.బి. డేటా ప్రకారం కేవలం 2022లో దేశంలో 1,40,019 కేసులు నమోదయ్యాయి. ఈ ఎనిమిదేళ్ల కాలంలో మహిళలపై భర్త అతని బంధువులు పాల్పడే హింస క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. అయితే నేర నిరూపణ కేవలం 15.7% కేసుల్లో మాత్రమే జరుగుతోంది. మహిళా హక్కుల కార్యకర్తలకు ఈ 498ఎ సెక్షన్‌ ఆనందం కలిగించినా, నేర ని రూపణ కేసులు చాలా స్వల్పంగా వుండటం నిరుత్సాహం కలిగిస్తోంది. వ్యవస్థలో లోపమే ఇందుకు ప్రధాన కారణమన్నది వారి వాదన. అయితే పురుష హక్కుల కార్యకర్తలు చెప్పేదేమంటే, చాలా తక్కువ కేసుల్లో నేర నిరూపణ కావడం, పురుషులపై మహిళలు పెడుతున్న తప్పుడు కేసులు,వారిని వేధింపులకు గురిచేస్తున్నారనడానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.
సాక్ష్యాధారాల లేమి
నేర నిరూపణ కాకపోవడానికి ప్రధాన కారణం స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకపోవడం. ముఖ్యం గా మానసిక హింసకు సంబంధించిన ఆధారాలు వుండటంలేదు. ఇతర సెక్షన్లు హత్య (సెక్షన్‌ 302), వరకట్న హత్య (సెక్షన్‌ 304బి)కు సంబంధించిన కేసుల్లో మాత్రమే నేర నిరూపణ జరుగుతోంది. 498ఎ సెక్షన్‌ కింద మహిళలు కేసు పెట్టాలంటే, వారికి సామాజికపరమైన సమస్య లు మరో అడ్డంకిగా వున్నాయి. ప్రధానంగా వీరిని అత్తగారింటికి రానీయరు. ఆర్థికపరమైన మద్దతు, ప్రత్యామ్నాయ వసతి లేనప్పుడు వారు నిలువనీడలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వుంటుంది. మరికొన్ని కేసుల్లో విడాకులు తీసుకోవడం ద్వారా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నా రు. దీనివల్ల తమకు జరిగిన అన్యాయంపై పోరాడే పరిస్థితిలేకుండా పోతున్నది. ఇటువంటి పరిస్థితులు మహిళలను ముందుకెళ్లనీయడంలేదు.
కుటుంబాన్ని బంధించేది ‘ప్రేమ’ మాత్రమే
మొత్తంమీద చెప్పాలంటే భారతీయ సమాజంలో ఆలోచనా ధోరణులు, పోకడల్లో మార్పులు వస్తు న్నాయి. స్త్రీ లేదా పురుషుడు ఎవరికి అవకాశాలు వుంటే వారు తమ ఆధిపత్యాన్ని, హింసాత్మక ధోరణిని ప్రదర్శించడానికి వెనుకాడటంలేదు. వైవాహిక బంధంలో ప్రేమకు బదులు ఆధిపత్యం, అహంకార ధోరణులు పెరుగుతుండటం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మానసిక బలహీనులు, మానసికంగా దృఢంగా వుండేవారు స్త్రీపురుషులిద్దరిలో వుంటారు. సమాన ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన వైవాహిక జంటల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, విడాకులు, పరస్పర హింస అనేవి క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. పితృస్వామ్యంలో పురుషులవల్ల, మాతృస్వా మ్యంలో మహిళల వల్ల హింసాత్మక ధోరణులు పెరుగుతుంటాయి. ఇక్కడ ఎవరు గొప్ప లేదా ఎవరి వల్ల ఎవరు బాధపడుతున్నారనేది కాదు ప్రశ్న! ఇద్దరిలో ఎవరు బలీయంగా, మానసికంగా దృఢంగా వుండి విపరీత ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారో వారివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో స్త్రీ పురుషుడు అనే తేడా లేదు. మానసిక పరమైన భావోద్వేగాలు ఇద్దరికీ సమా నమే! జీవితంపై దృఢవిశ్వాసం వున్నవారు ఎదుటివారిని లెక్కచేయరు. ఫలితం సంఘర్షణ. ప్రస్తుతం వైవాహిక సంబంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఇదే! ‘ప్రేమ’, ‘కుటుంబం పట్ల మమకారం’, ఒకరి సంతోషంలో మరొకరు ఆనందం పొందే ప్రవృత్తి మాత్రమే ఈ హింసా ప్రవృత్తికి విరుగుడు. ఆధిపత్యం స్థానాన్ని సమర్పణభావం, హింస స్థానాన్ని అహింస, కోపం స్థానాన్ని ప్రేమ ఆక్రమిస్తే కుటుంబాలు శాంతిగా, ఆనందమయంగా కొనసాగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!