April: Month of Legends
ఏప్రిల్ ఫూల్స్ నెల కాదు…
మహానుభావుల చరిత్రను మోసుకొచ్చిన గొప్ప నెల!
అంబేద్కర్ దొమ్మటి జర్నలిస్ట్
పరకాల,నేటిధాత్రి
ఏప్రిల్ నెల అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది “ఏప్రిల్ ఫూల్స్” అనే పదం మాత్రమే కానీ ఈ నెల కేవలం సరదా కోసం కాదు..మహానుభావుల జన్మదినాలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నెల ఇది.ఈ నెలలో జన్మించిన మహనీయులు సమాజానికి మార్గదర్శకులు వారి ఆలోచనలు,సేవలు, త్యాగాలు మన దేశాన్ని ముందుకు నడిపించాయి.ఈ నెలలో ప్రత్యేకంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జన్మదినాన్ని ఏప్రిల్ 14న జరుపుకుంటాం.ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా సమానత్వం,న్యాయం, హక్కుల కోసం పోరాడిన మహనీయుడు.ఆయన చూపిన మార్గం నేటికీ కోట్ల మందికి ప్రేరణగా నిలుస్తోంది.అలాగే జ్యోతిరావ్ ఫూలే జయంతి ఏప్రిల్ 11న జరుపుకుంటారు.సమాజంలోని అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి అపారమైనది. విద్యా ప్రాధాన్యతను పెంపొందించిన గొప్ప సంస్కర్తగా నిలిచారు.మరోవైపు బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5న జరుపుకుంటాం స్వాతంత్ర్య సమరయోధుడిగా,సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.ఈ మహనీయులందరి జన్మదినాలు ఏప్రిల్ నెలలో ఉండటం ఈ నెలకు ప్రత్యేకతను ఇస్తోంది.వారి సేవలు,ఆలోచనలు మన సమాజాన్ని మలచినవే కాబట్టి ఏప్రిల్ నెలను కేవలం “ఫూల్స్ డే”గా చూడకుండా, మహానుభావుల జ్ఞాపకాలను గుర్తు చేసుకునే నెలగా భావించాలి.వారి సిద్ధాంతాలను ఆచరించడం ద్వారా సమాజాన్ని మంచి దిశగా తీసుకెళ్లడం మనందరి బాధ్యత.నవ్వులు మాత్రమే కాదు,మార్పు కూడా అవసరమని మహానుభావుల అడుగుజాడల్లో నడిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఈనెల నేర్పుతుంది.అందుకే ఏప్రిల్ అంటే సరదా మాత్రమే కాదు, స్ఫూర్తి…చరిత్ర…మార్పు! అని గమనించాల్సిన అవసరం మన అందరికి ఉంది.
