# రైతాంగ సమస్యల పరిష్కారానికై దశల వారి ఆందోళనలు.
# ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి :
రైతాంగ సమస్యల పరిష్కారానికి సమగ్ర వ్యవసాయ పంటల రుణ ప్రణాళికలను తక్షణమే ప్రకటించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
శుక్రవారం అఖిల భారత రైతు సమైక్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు వసుకుల మట్టయ్య అధ్యక్షతన నర్సంపేటలోని ఓంకార్ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభమై రైతులు విత్తనాలు విత్తడానికి సిద్ధమైన ఇంతవరకు వ్యవసాయశాఖ గాని రాష్ట్ర ప్రభుత్వం గానీ సమగ్రమైన అంచనాతో రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు రుణాలు యంత్రాలు సమకూర్చకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. మరోవైపు విత్తన కంపెనీ యజమానులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతుల విత్తన అవసరాలను అమాయకత్వాన్ని గమనించి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా రెట్టింపు ధరలతో రైతులకు విత్తనాలను విక్రయిస్తున్న అధికార యంత్రాంగం నామమాత్రపు తనిఖీలతో కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేయడంలో దృష్టి పెట్టడం లేదన్నారు. అలాగే రైతుల భూముల భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ కనీస శ్రద్ధ కనబరచకపోవడం సరైనది కాదని ఆరోపించారు. రైతుల పంటల పెట్టుబడికి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి బ్యాంకులో పంట రుణాలు ఇచ్చే విధంగా ఎస్ఎల్బిసి సమావేశపరిచి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు నడుచుకునేలా రైతులను ఆదుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించి పంట రుణాలు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు. సమగ్ర భూ సర్వే నిర్వహించి రైతులు ఆధీనంలోని భూములను రికార్డుల్లో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటిని తక్షణమే అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనర్హుల ఆధీనంలో ఆక్రమణకు గురైన వివిధ రకాల ప్రభుత్వ భూములు, శిఖం భూములను గుర్తించి రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి దశల వారి ఆందోళన పోరాటాలకు సిద్ధం కావాలని రైతాంగానికి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుండెబోయిన చంద్రయ్య, కుసుంబ బాబురావు,మహమ్మద్ ఇస్మాయిల్, మోహన్, మానయ్య, వెంకటయ్య, కిషన్,కొమురయ్యలతోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.