ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌కు రాష్ట్ర ఉత్తమ అవార్డు
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.1.10 లక్షల ప్రోత్సాహకం అందుకున్న ప్రొఫెసర్ మల్లం నవీన్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్), ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-విద్యా వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారంతో పాటు కళాశాల అభివృద్ధికి రూ.లక్ష, రూ.10 వేల నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ నవీన్ మాట్లాడుతూ ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయం కాకుండా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. సంకల్పం, క్రమశిక్షణ, సమిష్టి కృషి ఉంటే ప్రభుత్వ కళాశాల కూడా రాష్ట్రంలోనే ఆదర్శ విద్యాసంస్థగా నిలుస్తుందని నిరూపించామన్నారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, కళాశాలను విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక వనరులు, పరిశోధనలో ఉత్తమంగా తీర్చిదిద్దుతానని ప్రిన్సిపల్ తెలిపారు.డిజిటల్ లెర్నింగ్, పోటీ పరీక్షల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రతి తరగతి గది స్ఫూర్తి కేంద్రంగా, ప్రతి విద్యార్థి నాయకుడిగా ఎదగాలన్నదే తన కల అని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి, ఉన్నత విద్యాశాఖ అధికారులకు,
అధ్యాపకులకు, సిబ్బందికి, తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రొఫెసర్ మల్లం నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.
