సోషల్ మీడియా కోసం మదర్స్ డేనా..?
ప్రేమగా చూసుకుంటారో లేదోగాని పోస్టులకు మాత్రం పోటీ
పోస్ట్ లకన్నా ప్రేమగా చూసుకుంటే చాలంటూ పెద్దల కొందరి అభిప్రాయం
పరకాల,నేటిధాత్రి
ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలో సోషల్ మీడియా హడావిడి స్పష్టంగా కనిపించింది.ఉదయం నుంచే యువత తమ తల్లులతో కలిసి దిగిన ఫోటోలు,సెల్ఫీలు,వీడియోలను వాట్సాప్ స్టేటస్లు,ఫేస్బుక్ పోస్టులు,ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో షేర్ చేస్తూ సందడి చేశారు.నా ప్రపంచం అమ్మే,అమ్మ ప్రేమ అమూల్యం అంటూ సందేశాలు పోస్టు చేస్తూ ఒకరిని చూసి మరొకరు శుభాకాంక్షలు తెలియజేశారు.సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్టులను అనుసరిస్తూ చాలామంది ప్రత్యేకంగా కేకులు కట్ చేసి వేడుకలు నిర్వహించారు.మదర్స్ డే సందర్భంగా పరకాల పట్టణంలోని బేకరీలు కిటకిటలాడాయి.ప్రత్యేక డిజైన్ కేకులు,గిఫ్ట్ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకు యువత భారీగా తరలివచ్చారు.పలుచోట్ల కేకులు పూర్తిగా అమ్ముడైపోయినట్లు వ్యాపారులు తెలిపారు.అయితే మరోవైపు ఈ వేడుకలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కంటే తల్లిదండ్రులను ప్రతిరోజూ ప్రేమగ చూసుకోవడం ముఖ్యమని పలువురు పెద్దలు అభిప్రాయపడుతున్నారు.కొందరు మాత్రం ఒక్కరోజు కోసం మాత్రమే ప్రేమను ప్రదర్శించడం ఫ్యాషన్‌గా మారిందని విమర్శిస్తున్నారు.ఏదేమైనా సోషల్ మీడియా ప్రభావంతో మదర్స్ డే వేడుకలు పరకాలలో ఈసారి మరింత హడావిడిగా మారాయి.
