BJP Bengal Formula in Telangana
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా
బీజేపీ అండర్ కరెంట్ వ్యూహాలు
పశ్చిమ బెంగాల్లో మమతా కోటను బద్దలు కొట్టిన కమలనాథులు.. ఇప్పుడు కన్ను దక్షిణ భారతంపై వేశారు. ముఖ్యంగా తెలంగాణ గడ్డపై పాగా వేసేందుకు ‘బెంగాల్ సైలెంట్ ఆపరేషన్’ను ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. 15 ఏళ్ల కిందట బెంగాల్లో నామమాత్రంగా ఉన్న శక్తి, నేడు అక్కడ అధికారాన్ని సవాల్ చేసే స్థాయికి చేరడమే కాకుండా, 207 సీట్లతో బలమైన ముద్ర వేసింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో తెలంగాణలో కమల వికాసం కోసం మోదీ-షా ద్వయం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. బెంగాల్ గెలవగలిగితే.. తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు? అనే నినాదంతో కమలనాథులు క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్తున్నారు.
మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ సభ ఈ రాజకీయ పోరులో అత్యంత కీలకం కాబోతోంది. సుమారు 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.. అదే వేదికగా రాజకీయ మార్పుకు పిలుపునివ్వనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి నేతలు టీమ్ మోదీ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వికసిత్ తెలంగాణ నినాదంతో తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన పార్టీ, ఇప్పుడు మోదీ సభతో పీక్ స్టేజ్‌కు చేరుకోవాలని చూస్తోంది.
బెంగాల్లో ఎలాగైతే కిందిస్థాయి ఓటర్లను మచ్చిక చేసుకున్నారో, తెలంగాణలోనూ అదే తరహా సైలెంట్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇతర పార్టీల అసంతృప్త నేతలను చేర్చుకోవడం, కుల సమీకరణలను సరిదిద్దడం, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి వాటిని ఇంటింటికీ తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. బీజేపీ అంచనా ప్రకారం, దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత పార్టీకి అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ఇప్పటికే బలమైన ఓటు శాతం ఉండటం, నాయకత్వం చురుగ్గా ఉండటం వల్ల కొంచెం కష్టపడితే అధికారం సాధ్యమని అమిత్ షా బృందం లెక్కలు వేస్తోంది. బెంగాల్ విజయం అందించిన ఊపుతో, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పనున్నారు. బెంగాల్ ఓటమితో ప్రతిపక్ష ఇండియా కూటమి నైతిక దెబ్బ తిన్న తరుణంలో, ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ గర్జన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరోసారి త్రిముఖ పోరు నుంచి బిజెపి వర్సెస్ అదర్స్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
