పసిమొగ్గను…చిదిమేశాడు

పసిమొగ్గను…చిదిమేశాడు

హన్మకొండ నగరంలోని టైలర్‌స్ట్రీట్‌ పాలజెండా ప్రాంతంలో దారుణం జరిగింది. తొమ్మిది నెలల పసికందుపై ఓ కామాంధుడు సభ్యసమాజం తలదించుకునేలా ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల పసికందు పాపపై అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేశాడు. ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసే ఈ సంఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… జక్కోజు జగన్‌-రచన దంపతుల కుమార్తె శ్రిత (9నెలలు)తో తమ ఇంటి బంగ్లాపై నిద్రించారు. తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో కొలేపాక ప్రవీణ్‌ (28) అనే వ్యక్తి వారు నిద్రిస్తున్న బిల్డింగ్‌పైకి వెళ్లి పాపను తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేశాడు. తల్లిదండ్రులు నిద్రలోంచి మేల్కోని చూసేసరికి పాప కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. బంగ్లాపై పక్కనే స్పృహతప్పి రక్తస్రావంతో తమ కుమార్తె కనిపించడంతో గుండెలవిసేలా బోరునవిలపిస్తూ పాపను చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో హుటాహుటిన హన్మకొండ మ్యాక్స్‌కేర్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పాపను పరీక్షించి అప్పటికే మరణించిందని వైద్యులు నిర్థారించడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండాపోయింది. ఆసుపత్రి ఆవరణలో వారు రోదిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరు కన్నీరుమున్నీరయ్యారు. మానవజాతికే మచ్చ తెచ్చిన ఆ కామాంధుడిని నిందిస్తూ శాపనార్థాలు పెడుతూ శోకసముద్రంలో మునిగితేలారు. పాప తల్లిదండ్రులు పాపను తమ చేతుల్లోకి తీసుకుని ఏడుస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టించింది.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తొమ్మిదినెలల పాపపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు కొలేపాక ప్రవీణ్‌ (24)ను స్థానికులు పట్టుకుని చితకబాది, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడు దామెర మండలానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం పాప మృతదేహాన్ని వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎంజీఎం మార్చురీ వద్ద పాప తల్లితండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారయత్నం, హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని వివిధ విద్యార్థి, మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ భవనం కూడలిలో పెద్దఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించడం వల్ల సుమారుగా గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న వారిని విరమింపజేశారు. అనంతరం వివిధ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ కామంతో కళ్లు మూసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌ను ఉరితీయాలని కొందరు, శిక్షించాలని మరికొందరు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిందితుడిపై కేసులు నమోదు చేశాం

– సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

ఈ సంఘటనకు సంబంధించి మరణించిన చిన్నారి శ్రీహిత మామయ్య హన్మకోండ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు అధారంగా నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టుచేసి సెక్షన్‌ 366, 302, 376ఎ, 376ఎబి, 379 ఐ.పి.సి సెక్షన్లతోపాటు 5(యం) రెడ్‌ విత్‌ 6 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

కఠినచర్యలు తీసుకోండి

– దారుణంపై పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం

హన్మకొండలో చిన్నారిపై దారుణం జరిగిన ఘటనపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *