Stay Alert to Heatwave: Abhilash Reddy
ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కాంగ్రెస్ యువ నాయకులు అభిలాష్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
https://youtu.be/qnVv4RsgECE?si=ihuDkIgNeeXEjdNM
ఝరాసంగం మండల కేంద్రంలో బుధవారం మేదపల్లి గ్రామ కాంగ్రెస్ యువ నాయకులు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనులకు వెళ్లే కార్మికులు తలపై రుమాలు, గమ్ఛా లేదా చున్నీ కప్పుకొని వెళ్లాలని, వీలైనంత త్వరగా పనులు ముగించుకొని ఉదయం 11 గంటలలోపు ఇంటికి చేరుకోవాలని కోరారు. పనిచేసే సమయంలో అధిక చెమటలు పట్టడం, తల తిరగడం, జ్వరం వచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకొని తడి బట్టతో శరీరాన్ని చల్లబరచుకోవాలని తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా పిల్లలను అవసరం లేకుండా ఎండలోకి పంపవద్దని, బయటకు వెళ్లాల్సి వస్తే తలపై రుమాలు లేదా టోపీ పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామాల్లో ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంటూ, రోజుకు కనీసం ఐదు లీటర్ల వరకు నీరు తీసుకోవడం మంచిదని చెప్పారు. ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అభిలాష్ రెడ్డి కోరారు.
