`అభివృద్ధికి ఏది సమయం.. చెప్పుకోవడానికి ఏది సందర్భం.
`నిన్నటి దాకా వీళ్లు..ఇప్పుడు వాళ్లు!
`అవినీతి ఆరోపణలు రాకుండా రాజకీయాలు చేయలేరా?
`దోచుకున్నారన్న విమర్శలు లేకుండా పాలన సాగించలేరా?
`మీరంటే మీరు దోచుకున్న ముచ్చట్లు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడరా?
`దోచుకు తింటున్నారనే నాయకులు తప్ప ప్రజలకు దిక్కులేదా!
`నిన్నటి దాగా బిఆర్‌ఎస్ లక్షల కోట్లు దోచుకుందన్నారు
`రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ దివాలా తీయించిందన్నారు
`నిరూపించమని ప్రతి అంశంలోనూ బిఆర్‌ఎస్ సవాలు చేస్తూనే వుంది
`సంవత్సరంన్నరైనా ఏది నిరూపించింది లేదు
`ఎవరికీ శిక్ష పడిరది లేదు
`పత్రికలకు వార్తలకు కొదువ లేదు
`ఇప్పుడు బిఆర్‌ఎస్ ఆరోపణలు మొదలయ్యాయి
`కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారంటున్నారు
`నిజాయితీగా ఏ పార్టీ ప్రజాసేవ చేయలేదా?
`ప్రజలకు ప్రత్యామ్నాయం వీళ్లు తప్ప ఇంకెవరూ లేరా?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏ రాజకీయ పార్టీ నాయకుడి గురించి విన్నా ఏమున్నది గర్వకారణం సమస్తం అవినీతి ఆరోపణల మయం. ఇప్పుడున్న రాజకీయ పార్టీలైనా, నాయకులైనా సరే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వాళ్లు మచ్చుకు కూడా కనిపించడం లేదు. వాళ్లు నిజంగా సంపాదించారా? లేదా? అన్నది ఎవరికీ తెలియదు. కాని ఆస్ధులు కూడబెట్టుకున్నారన్నది నిజం. జనంలో ఆ దర్పం కనిపిస్తున్నది నిజం. కాని రాజకీయ అవినీతి ద్వారా సంపాదించారా? అన్నది మాత్రం పూర్తిగా నిజంకాకపోవచ్చు. ఒకప్పుడు నాయలంటే కేవలం ప్రజా ప్రతినిధులుగానే కొనసాగుతూ వుండేవారు. ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం వుండేది కాదు. వుంటే గింటే అంతో ఇంతో వ్యవసాయం వుండేది. అంతే తప్ప పెద్దగా వ్యాపారాలుండేవి కాదు. సంపాదనపై పెద్దగా వారికి ఆసక్తి వుండేది కాదు. ఎన్నికల సమయాల్లో కూడా వారికి వ్యాపారులు సహకరించేవారు. ఎన్నికల తంతు పూర్తి చేసుకునేవారు. కాని ఎనభైవ దశకం నుంచి పార్టీలపైన విమర్శలు, నాయకుల మీద అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. అవి ఇప్పుడు తారాస్దాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు లక్షల రూపాలయలు సంపాదించారంటే అది పెద్ద విషయంగా చెప్పుకునే వారు. తర్వాత కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు, ఇప్పుడు ఏకంగా లక్షల కోట్లు అనే మాటలు తప్ప తక్కువ వినిపించడం లేదు. నిజంగా నాయకులు అంత సంపాదిస్తారా? అంటే అవును ఎవరూ సమాదానం చెప్పలేరు. విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నామనే వారు కూడా వున్నారు. అయితే ఆ విమర్శించే వాళ్లు కూడా ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నవాళ్లే..అందులో ఎవరూ సుద్దపూసలు కాదన్న మాటలు పడుతున్నవాళ్లే..ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఆరోపణలు ఎదుర్కొని నాయకులు ఒక్కరు కూడ లేదు. కాకపోతే ఇప్పటికీ కనిపిస్తున్న ఒక్కరో, ఇద్దరో నాయకులు వున్నప్పటికీ వారు క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఎన్నికల్లో పోటీచేసినా వాళ్లు ఇప్పుడు గెలవలేరు. గతంలో నాలుగుసార్లు, ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి ఎలాంటి అవినీతి మరకలు అంటని వారు, ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేసినా తప్పకుండా వాళ్లు కూడా ఆరోపణలు ఎదుర్కొక తప్పని పరిస్దితులు వచ్చేశాయి. రాజకీయాల్లో అవినీతి అనే పదం అంతకు ముందుఎలా వున్నా..ఎంత వున్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే పుట్టిందని చెప్పకతప్పదు. ఇప్పుడు ఎన్టీఆర్ కాలంలో గురించిగొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ అప్పట్లో ఎన్టీఆర్ అవినీతి మీద, ఆశ్రిత పక్షపాతం మీద, అదికార దుర్వినియోగం మీద, కుటుంబ పాలన మీద అనేక సిని మాలు వచ్చాయి. నేరుగా ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అనేక సినిమాలు తీశాడు. కాని ఇప్పుడు ఎన్టీఆర్ కాలం గొప్పదనట్లు చెబుతుంటారు. అదే నిజమైతే అప్పట్లో అలాంటి సినిమాలు వచ్చేవి కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ది అనే మాట అటకెక్కింది. నిత్యం రాజకీయ పరమైన ఆరోపణలతోనే కాలం గడిచింది. నిజమైన అభివృద్దిని ఆనాడు చేసిందేమీ లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు తొమ్మిదేళ్ల కాలంలో పెద్దగా వ్యవసాయపరమైన ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. ఎంత సేపు పారిశ్రామికీకరణ, ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీ కరణ, ప్రభుత్వ కంపనీల అమ్మకాలులతో వచ్చే ఆదాయాల్లో కమీషన్లు అనే ఆరోపణలు అనేకం ఎదుర్కొన్నారు. రైతులకు సబ్సిడీలు తగ్గించారు. విపరీతమైన కంరటు చార్జీలు పెంచారు. వ్యవసాయం లాభసాటి నుంటి గిట్టుబాటు కాదన్నంత దూరం తెచ్చాడు. వ్యవసాయం పంగడ కాదు, దండగ అన్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ది ఏమిటని బూతద్దం పెట్టి వెతికినా ఒక్క ప్రాజెక్టు కనిపించదు. రాష్ట్రాదాయమేమో కాని, ఆయన ఆస్దులు మాత్రం పెరిగిపోయాయన్న ఆరోపణలుఅనేకం వచ్చాయి. రెండు ఎకరాల చంద్రబాబు, ఇరవై వేలకోట్లు సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులతో, అవసరం లేని పనులు చేపట్టి, రైతులను ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కమ్యూనిస్టుల చేత ప్రపంచ బ్యాంకు జీతగాడు అని పుస్తకాలు కూడా ప్రచురించారు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన ఐదేళ్లలలోనే లక్ష కోట్లు సంపాదించారన్న ఆరోపణలుఎదుర్కొన్నారు. ఆయన హయాంలో కూడా పెద్దగా చేసిన పనులేమీ లేదు. కాని నిత్యం అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కాలం గడిచిపోయింది. తర్వాత మరో ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కొని రోశయ్య, రాష్ట్రం విడిపోయే సయమంలో కిరణ్‌కుమార్ రెడ్డి పెద్దఎత్తున సంతకాలు పెట్టి సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దాదాపు ఆ ముప్పై ఎళ్ల కాలంలో వచ్చిన మార్పులు ఏమిటంటే అంతా హైటెక్ హంగులు తప్ప మరేం కనిపించడం లేదు. కేవలం ఐటి తప్ప మరేం కొత్త పుంతలు తొక్కిన ఆర్ధిక పరిస్దితి లేదు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కేసిఆర్ పరిపాలన చేసిన పదేళ్ల కాలం పాటు కాంగ్రెస్ నుంచి అనేక ఆరోపణలు, విమర్శలే. తొలి ఐదేళ్ల కాలంలో కొంత ప్రతిపక్షాల నుంచి పెద్దగా నిరసనలు, ఆరోపణలు వినిపించలేదు. కాని కేసిఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇక ఆర్ధికపరమైన ఆరోణలతోనే కాలం గడిచింది. ఆ సమయంలో కాంగ్రెస్ గాని, బిజేపి గాని నిత్యం ఆరోపణలే తప్ప కేసిఆర్ తోపాటు, బిఆర్‌ఎస్‌కు చెందిన నాయకుల ఆర్ధికపరమైన దోపిడీ గురించి స్పష్టమైన ఆధారాలు సంపాదించిందేమీ లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగం మొదలైన తర్వాత బిఆర్‌ఎస్ పతనం మొదలైంది. పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి నియాకంతో బిఆర్‌ఎస్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడిచిపోయింది. ఇప్పుడు బిఆర్‌ఎస్ వంతు వచ్చింది. ఏడాదిన్నర కాలం పూర్తవుతోంది. గతంలో నాయకులు చేసిన ఆరోపణలు మీడియా గుర్తు చేస్తే తప్ప వాటి గురించి ఆలోచనలు వుండేవి కాదు. ప్రజలు కూడా పట్టించుకునేంత తీరిక వుండేది కాదు. కాని నేడు ఆ పరిస్దితి లేదు. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది. నాయకులు మర్చిపోయినా, సోషల్ మీడియా నిత్యం ప్రశ్నిస్తూనే వుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్ హాయంలో జరిగిన, ప్రతిపక్షంలో వున్నప్పుడు చేసిన ఆరోపణల మీద నిజా నిజాలు తేలుతాయని అందరూ అనుకున్నారు. కాళేశ్వరంలో లక్ష రూపాయలు తిన్నారన్నది ప్రదాన ఆరోపణ కేసిఆర్ మీద వుంది. అంతే కాకుండా కేసిఆర్ ఫామ్ హౌజ్‌లో వందల ఎకరాలున్నాయన్నాదానిపై విమర్శలున్నాయి. కేసిఆర్ పాలనా సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేవి ఇప్పటికీ సజీవంగా సాగుతున్న ఆరోపణలు. మరి ఆ ఆరోపణలు ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోతోంది. ఏడాదిన్న కాలం గడిచిపోతోంది. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుతోపాటు, అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి దీనిపై చర్యలు తీసుకుంటామని చెబుతూనే వున్నారు. మీరు ఎలాంటి దర్యాప్తులైనా చేసుకోండని బిఆర్‌ఎస్ ఎదరు సవాలు చేస్తూనే వుంది. బిఆర్‌ఎస్ హాయాంలో కేసిఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని అంటున్నారు. వాటి లెక్కలు చెప్పరు. అందులో జరిగిన అవినీతి చెప్పరు. ఇక బిఆర్‌ఎస్ వంతు వచ్చింది. ఏడాదిన్న కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇన్ని వేల కోట్లు దోచుకున్నాడు? ఆయన సోదరులు ఇన్ని తిన్నారు? ఫలానా మంత్రి ఇలా వసూలు చేస్తున్నాడు? అని ఆరోపణలు మొదలు పెట్టారు. కాని వివరాలు చెప్పమంటే మాత్రం సమయం వచ్చినప్పుడు అన్నీ బైట పెడతామంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. వారికి వివరాలు చెప్పడానికి సమయం, సందర్భం అవసరామా? అంటే పార్టీలు ఏవైనా సరే నాయకులంతా ఎల్ల కాలం రాజకీయాలు తప్ప మరేం చేయారా? ఎమ్మెల్యేలు ఎవరూ తమ నియోజకవర్గాలలో వున్న సమస్యలు ప్రస్తావించారా? వాటి పనుల పూర్తి గురించి, అబివృద్ది గురించి మాట్లాడరా? చేసిన అభివృద్ది గురించి చెప్పరా? దినాం..అధికార పార్టీ నాయకులతోపాటు, ప్రతిపక్ష నాయకులంతా అవినీతి ఆరోపణలు తప్ప మరేం మాట్లాడుకోరా? నువ్వుంటే,నువ్వు అని నిత్యం ఒకరిపై ఒకరు చేసుకునే అవినీతి ఆరోపణలు వింటూ ప్రజలు కూడాపంచ తంత్ర కథలు వింటున్నట్లు సంబరపడి పోతున్నారు. ఇది కూడా తమ మంచికే అని నాయకులు లోలోన నవ్వుకుంటున్నారు..అంతే అంతకు మించి ఈ కథ ఒక్క అడుగు కూడా ముందుకు పోదు..అవినీతి నిరూపణలు అన్నవి ఆమడదూరం…అంతే!!!