Call for Workers’ Struggle for Peace and Equality
ప్రపంచ శాంతి, అంతరాలు లేని సమాజం కోసం పోరాడాలి
ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి:
శ్రమదోపిడి రహిత సమాజం కోసం, ప్రపంచ శాంతి కోసం పెట్టుబడిదారీ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాటాలను ఉధృతం చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. శ్రామికుల హక్కులను హరిస్తూ పాలక పార్టీలు మేడే జరపడం సిగ్గుచేటు అని విమర్శించారు.ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేని పురస్కరించుకొని గురువారం నర్సంపేట పట్టణంలోని మార్క్స్ కాలనీ, జ్యోతి బస్ నగర్ లలో అలాగే ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యాలయం ఓంకార్ భవన్లో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ జెండాను ఆవిష్కరించారు. నగర కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మార్చి సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ దోపిడీని విస్తృతం చేస్తున్నారన్నారు. అన్నదాతలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసేలా ఉత్పత్తి ఖర్చులు పెంచి, గిట్టుబాటు ధర లేకుండా మార్కెట్ దోపిడీని పెంచి పోషిస్తున్నారని తెలిపారు.ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి కూలీలకు ఉపాధి లేకుండా చేశారని, యుద్ధాల పేరుతో అశాంతిని సృష్టించి గ్యాస్, డీజిల్, పెట్రోల్లపై కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడే స్ఫూర్తితో పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.రైతుల పంటలకు మద్దతు ధర, రుణ విముక్తి చట్టాలకై పోరాడుతూ పాత కార్మిక చట్టాలను, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాలపై పోరాటాలతో ఒత్తిడి తేవాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సింగతి సాంబయ్య, గోనె కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుసుంబా బాబురావు, ముక్కెర రామస్వామి, సుంచు జగదీశ్వర్, ప్రాంత కార్యదర్శులు గణిపాక ఓదేలు, మహమ్మద్ మహబూబ్ బాషా, పరిమళ గోవర్ధన్ రాజు, జిల్లా నగర నాయకులు ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పనపురి నరసయ్య, సింగారపు దాసు, రాయినేని ఐలయ్య, సమ్మయ్య, కొమురయ్య, పూలమ్మ, ఆశా బేగం, యాకయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
