Massive May Day Rally in Parakala
మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్స్ రద్దుకు పోరాటం చేయాలి- బొట్ల చక్రపాణి
పరకాల,నేటిధాత్రి
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణంలో కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని,మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు.పట్టణంలో ఎర్రజెండాలతో కార్మికుల సందడి నెలకొంది.బజారు హమాలీ,ట్రాన్స్పోర్ట్, దిగుమతి,ఎఫ్‌సిఐ,మార్కెట్ హమాలీ యూనియన్లతో పాటు బిల్డింగ్ వర్కర్స్, మున్సిపల్,ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ సీఐటీయూ,సిపిఎం జెండాలను ఆవిష్కరించారు.మాదారం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ “ప్రపంచ కార్మికులారా ఏకంకండి కార్మిక ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాలతో పట్టణం మారుమోగింది.ఈ సందర్భంగా బొట్ల చక్రపాణి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు.దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చడం కార్మిక వర్గానికి నష్టం కలిగించేదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం ద్వారా కార్మిక హక్కులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.ఎనిమిది గంటల పని దినానికి బదులుగా పని గంటలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని,కనీస వేతనాలు,ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ వంటి అంశాల్లో కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు.రాబోయే రోజుల్లో కార్మికులందరూ ఐక్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్,బొచ్చు ఈశ్వర్, సీఐటీయూ మండల నాయకులు బొచ్చు ఆదాం, మడికొండ ప్రమోద్,భయ్యా కృష్ణంరాజు,రమేష్,మోహన్, సాంబయ్య,సారయ్య,కమల్, రాజు తదితరులు పాల్గొన్నారు.
