Shiva Lingam Prana Pratishtha in Narsampet
నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక పూజలు
వల్లబ్నగర్లో శివ లింగ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 5 రోజులుగా మహోత్సవాలు
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వల్లబ్నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గత 5 రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన శివలింగ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వల్లబ్నగర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా శ్రీశ్రీశ్రీ మహాదేవ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, పరిహార దేవత, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు తాంత్రిక పూజారి, బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ ప్రదీప్ గురుస్వామి మంత్రోచ్ఛారణలతో జరుగుతున్నాయి. గ్రామ కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే హాజరై శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.ఎమ్మెల్యేకు వేద పండితులు, గ్రామ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
