తెలుగు రాష్ట్రాల జల వివాదంపై ఢిల్లీలో కీలక చర్చలు..
తెలుగు రాష్ట్రాల జల వివాదంపై సీడబ్ల్యూసీ కీలక సమావేశం ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ మధ్య నీటి నిర్వహణ అంశాలపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన జల వివాదాల కమిటీ తొలి సమావేశం జరుగుతోంది..
న్యూఢిల్లీ, జనవరి 30: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల (Two Telugu States) మధ్య నదీ జలాల నిర్వహణ, వినియోగం విషయంలో కొనసాగుతున్న వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ (CWC Chairman Anupam Prasad) అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. జనవరి 2న కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఇరు రాష్ట్రాల మధ్య నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనుంది.
కమిటీ తదుపరి చర్చల కోసం జల వివాదాలకు సంబంధించిన అజెండా అందజేయాలని కమిటీ సభ్యులను సీడబ్ల్యూసీ చైర్మన్ కోరారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ సలహాదారులు, ఇంజనీర్ ఇన్- చీఫ్‌లు, జలవనరుల శాఖ అధికారులు, కేఆర్ఎమ్బీ, జీఆర్ఎమ్బీ చైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్ హాజరయ్యారు.ఏపీ నుంచి జలవనరుల శాఖ అడ్వైజర్- వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి పలువురు అధికారులు హాజరయ్యారు. అలాగే తెలంగాణ నుంచి ఆదిత్యనాథ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, కేంద్ర రాష్ట్ర సమన్వయ అధికారి గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు.
