Demand for Synthetic Track in Warangal
చందాకాంతయ్య స్మారక క్రీడా మైదానానికి సింథటిక్ ట్రాక్ కోసం వినతి
నేటిధాత్రి, వరంగల్.
నిన్న (శుక్రవారం) రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ ను చందాకాంతయ్య స్మారక క్రీడా మైదానం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు చింతం సారంగపాణి నాయకత్వం వహించారు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన చందాకాంతయ్య స్మారక క్రీడా మైదానం ప్రస్తుతం సరైన అభివృద్ధి లేక నిర్లక్ష్యానికి గురవుతోందని వారు పేర్కొన్నారు. రోజుకు 500 మందికి పైగా వాకర్స్ ఈ మైదానాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, సరైన రన్నింగ్ ట్రాక్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మట్టి ట్రాక్ ఎండాకాలంలో దూళితో నిండిపోవడంతో వాకర్స్‌కు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయని వినతి పత్రంలో వివరించారు.
అందువల్ల, గతంలో ఆమోదం పొందిన సింథటిక్ ట్రాక్ పనులను తిరిగి టెండర్ ప్రక్రియ ద్వారా వెంటనే ప్రారంభించాలని మంత్రివర్యులను కోరారు.
ఈ వినతికి స్పందించిన మంత్రి కొండ సురేఖ, విషయాన్ని క్రీడా శాఖ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కొంగ శ్రీధర్, విజయభాస్కర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సురేష్ జోషి తదితరులు పాల్గొన్నారు.
