Collector Reviews Paddy Procurement Process
క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలి
వేగంగా అన్ లోడింగ్ చేయడంపై దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల వేగవంతం, వాహనాల ద్వారా ధాన్యం తరలింపు, అన్ లోడింగ్ చేయడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ, రైతులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై శుక్రవారం ఉదయం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రవాణా, మెప్మా, తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగుతుందని, కొనుగోళ్ళు ముగిసే వరకు సంబంధిత అధికారులు అందరూ క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మిల్లులు, గోదాంలను తనిఖీ చేస్తూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పటివరకు సేకరించిన గ్రేడ్ ఎ రకం, కామన్ రకం ధాన్యం వివరాలపై అధికారులను అడిగి ఆరా తీశారు. వర్షాలు పడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని, తూకం వేసిన ధాన్యం బస్తాలను సరిపడా వాహనాలు సమకూర్చి వెంట వెంటనే మిల్లులకు, గోదాంలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తరలించిన వాహనాల్లోని ధాన్యం హమాలీల సంఖ్య పెంచి అన్ లోడ్ చేయాలని సూచించారు.
రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సంబంధించిన ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు.
