జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి పుణ్య క్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 7 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేకం మహోత్సవాల రోజు వారి కార్యక్రమాల షెడ్యూల్ ను గురువారం ఆయన తెలిపారు మహా కుంభాభిషేకం మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. స్వామి వారి తీర్థ ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా పరమైన చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు విధులు కేటాయించినట్లు తెలిపారు. 42 సంవత్సరాలు తరువాత జరుగుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ మహోత్సవాలను సమన్వయంతో విజయ వంతం చేయాలని సూచించారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మహోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. మహోత్సవాలకు విచ్చేయు భక్తులు జిల్లా యంత్రాంగం సలహాలు, సూచనలు పాటించాలని ఆయన సూచించారు. చుట్టుప్రక్కల జిల్లాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తు, రద్దీ నియంత్రణ, వాహనాలు పార్కింగ్ వంటి చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.